చలికాలంలో కీళ్లనొప్పులు పెరిగేదెందుకు...?

చలికాలంలో బయటి వాతావరణ ప్రభావం వల్ల ఉపరితల భాగాలకు ప్రసరించే రక్తం చలి కారణంగా తన వేడిని కోల్పోతుంది. పైగా చలి కారణంగా అక్కడి రక్తనాళాలు కాస్త కుంచించుకుపోవడం (వాసోకన్‌స్ట్రిక్షన్)తో కాళ్లు, చేతుల వంటి భాగాలకు రక్తప్రసరణ కాస్తంత తగ్గుతుంది. అందుకే ఈ సీజన్‌లో ఏదైనా భాగంలో నొప్పి, వాపు, మంట (ఇన్‌ఫ్లమేషన్) వచ్చినా లేదా ఆర్థరైటిస్ వంటి జబ్బుల్లో వచ్చే నొప్పులైనా... అవి తగ్గడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే ఈ సీజన్‌లో ఏవైనా నొప్పులు వస్తే అది తగ్గడానికి చాలా సమయం తీసుకుంటుందన్నమాట. ఈ సీజన్‌లో గుండె పరిసరాల్లోనే వేడిరక్తం ప్రవహిస్తుండటం, శరీరంలోని ఉపరితల భాగాలకు ఆ సరఫరా స్వల్పంగా తగ్గడం వల్ల చలికాలంలో మామూలు నొప్పులతో పాటు కీళ్లనొప్పులు మిగతా సమయాల్లో కంటే దుర్భరంగా ఉంటాయి. 

ఈ సీజన్‌లో బయటి ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉండటం వల్ల చర్మం కూడా చల్లగా అయిపోతుంది. సాధారణంగా మన చర్మం సహజంగా ఉండాల్సిన 90 ప్లస్ డిగ్రీల ఫారన్‌హీట్ నుంచి ఒక్కోసారి ఇది 70 ప్లస్ లేదా 80 ప్లస్ డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోతుంది. ఇలా ఉష్ణోగ్రత పడిపోవడంతో చర్మంలోని నొప్పిని గ్రహించే భాగాలు (పెయిన్‌సెన్సర్స్) మరింతగా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల చిన్న దెబ్బకే మనకు చాలా నొప్పి అనిపిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో గాయమైతే దెబ్బ తీవ్రత తక్కువే అయినా నొప్పి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుంది. 

ఈ సీజన్‌లో ఆర్థరైటిస్‌ను ప్రేరేపించేందుకు అనువైన జీవనశైలిని మనం అనుసరిస్తుంటాం. అంటే ఉదాహరణకు మనం ఈ సీజన్‌లో చురుగ్గా లేకుండా కాస్త మందకొడిగా ఉంటాం. దాంతో ఆర్థరైటిస్ వంటి జబ్బులకు మనకు తెలియకుండానే అవకాశం ఇచ్చేలా మనం మారిపోతుంటామన్నమాట చాలామందికి చలికాలంలో నొప్పిని భరించే శక్తి (పెయిన్ టాలరెన్స్) తగ్గుతుంది. అందుకే మామూలు నొప్పులు సైతం ఈ కాలంలో మరింత పెరిగినట్లు అనిపిస్తాయి ఈ సీజన్‌లో ప్రధానంగా సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దాంతో ఎముకల ఆరోగ్య నిర్వహణకు అవసరమైన విటమిన్-డి సరఫరా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్‌లో ఎముకల ఫ్రాక్చర్లు అయితే అవి తగ్గడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. 

నొప్పులను తగ్గించుకోవడం ఎలా?

ఈ సీజన్‌లో నొప్పి వస్తే దాన్ని పూర్తిగా నివారించలేకపోయినా తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. అవి... 
బయట చలిగా ఉన్నప్పుడు శరీరానికి తగినంత ఉష్ణోగ్రత ఇచ్చే దుస్తులను ధరించాలి. చేతులకు గ్లొవ్స్, కాళ్లకు సాక్స్ వేసుకోవడం మంచిది. ఈ సీజన్‌లో ఆరుబయట కాకుండా ఇన్‌డోర్ వ్యాయామాలు చేయడం మంచిది. షికాగోలో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. (షికాగోలో చలికాలం ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం వల్ల చాలా చలిగా ఉండే నగరాల్లో ప్రధానమైనది. అందుకే ఈ అధ్యయనం కోసం ఆ నగరాన్ని ఎంపిక చేసుకున్నారు). ఈ అధ్యయనంలో భాగంగా ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 241 మంది వ్యాధిగ్రస్తులను ఎంపిక చేసి వారి విశ్రాంతి సమయాన్ని నాలుగింతలకు పెంచారు. దాంతో బాధలు మరింతగా ఇనుమడించాయి. అప్పుడు నొప్పులను అధిగమించడానికి ఎవరూ చెప్పకుండానే తమంతట తామే ఇంట్లోనే ఏదో ఒక శారీరకశ్రమ చేయడం మొదలుపెట్టారు. దాంతో వారి నొప్పులు చాలావరకు తగ్గిపోయాయి. 


అందుకే శీతకాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామాలు, శారీరకశ్రమ మంచిది. మన కీళ్లలో ఎప్పుడూ కదలికలు ఉండేలా చూసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్య నిర్వహణ మెరుగ్గా ఉంటుంది ఈ సీజన్‌లో వ్యాయామాలు తప్పనిసరి. వ్యాయామం సమయంలో మనం ఆహ్లాదంగా ఉండటానికి దోహదపడేదీ, మన ఒత్తిడిని గణనీయంగా తగ్గించేది అయిన ఎండార్ఫిన్ అనే స్రావం శరీరంలోకి విడుదల అవుతుంది. ‘ఎండార్ఫిన్’ లో నొప్పిని తగ్గించే గుణం ఎక్కువ. అందుకే ఈ సీజన్‌లో వ్యాయామం తప్పనిసరి. పైగా వ్యాయామం కారణంగా ఈ సీజన్‌లో సహజంగా మందగించే రక్త సరఫరా మెరుగవుతుంది. దాంతో నొప్పి సెన్సర్స్ కూడా మామూలుగా పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. 

నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని సూచనలివి..

మోకాళ్లపై ఎలాంటి భారం పడకుండానే మంచి వ్యాయామాన్ని చేకూర్చే ఈత ఈ సీజన్‌లో చాలా మంచిది. అయితే స్విమ్మింగ్‌పూల్‌లో బాగా చల్లటి నీళ్లుంటే మళ్లీ అది నొప్పులను పెంచేందుకే దోహదం చేయవచ్చు. అందుకే ఒకింత వేడిగా ఉండే నీళ్లు ఉండే పూల్స్‌లో ఈత మంచిది. పైగా ఆ వేడినీటి ప్రభావంతో కీళ్లనొప్పులూ బాగా తగ్గుతాయి. అయితే ఈత తర్వాత నేరుగా చల్లటి వాతావరణంలో వెళ్లకండి. బయటకు వచ్చాక ముందుగా కాసేపు బయటి వాతావరణాకి మిమ్మల్ని మీరు అడ్జెస్ట్ చేసుకోండి. ఆ తర్వాతే బయటి వాతావరణంలోకి ప్రవేశించండి. ఈ సీజన్‌లో దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. బయటకు వెళ్తున్నప్పుడు మంచి షూస్ ధరించడం, వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ-ప్యాడ్స్ వంటివి ధరించాలి ఆహారంలో చేపలు ఎక్కువగా తీసుకునేలా జాగ్రత్తపడాలి. ఎందుకంటే చేపల్లో ఉండే ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్‌లో నొప్పి, మంట, వాపు (ఇన్‌ఫ్లమేషన్) తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ డాక్టర్ సలహా మేరకు ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే సప్లిమెంట్స్ అప్పటికే వాడుతున్నవారైతే డాక్టర్ల సూచనల మేరకు ఆహారం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి మసాజ్ చేయించుకోవాలనుకునే వారు చాలా మృదువుగా చేయించుకోవాలి. ఈ సూచనలు పాటిస్తున్నా కీళ్ల నొప్పులు ఎంతకూ తగ్గకపోతే తప్పనసరిగా డాక్టర్‌ను కలిసి తగిన మందులు వాడాలి. 
పై సూచనలు పాటిస్తూ, పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సీజన్‌లో కీళ్లనొప్పులనుంచి సాధ్యమైనంత మేరకు రక్షణ పొందవచ్చు. 


చలి ... అని మంచినీళ్లు మానద్దు!
ఈ సీజన్‌లో వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. చాలామంది చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతారు. ఒంటిని వెచ్చబరచుకోడానికి దోహదం చేస్తుందనే నెపంతో కాఫీ, టీ వంటి పానీయాలు ఎక్కువగా తాగేస్తారు. పైగా దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమటరూపంలో నీరు బయటకు వెళ్తుంది. ఈ అన్ని కారణాలతో శరీరంలో నీళ్లు, లవణాల పాళ్లు తగ్గుతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top