ఎన్ని ప్రయత్నాలు చేసినా లావు తగ్గని వారికి ఏ మాత్రం నొప్పి, శ్రమ లేకుండా కొవ్వును తొలగించే విధానాలు

ఎన్ని ప్రయత్నాలు చేసినా లావు తగ్గని వారికి ఆధునిక వైద్యం వరంగా మారింది. ఊబకాయులు ఏ మాత్రం నొప్పి, శ్రమ లేకుండా నాజూగ్గా మారుతున్నారు. మన శరీర స్థితిని బట్టి వివిధ పద్ధతుల్లో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించే విధానాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. 

ముఖ్యంగా శరీరాకృతి మీద ఆధునిక కాలంలో ఎక్కవ మంది దృష్టి సారిస్తున్నారు. నగర జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోవడంతోపాటు ఆహార అలవాట్లు శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపుతున్నాయి. దీంతో ఒంట్లో పేరుకుపోతున్న కొవ్వును, కొండలా పెరిగిపోతున్న శరీరాన్ని తగ్గించుకోవడానికి ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేసేవారిని మనం నిత్యం చూస్తున్నాం. మరికొందరైతే కఠినాతి కఠినమైన వ్యాయామాలు, యోగ, ధ్యానం కూడా చేస్తున్నారు. ఇంతచేసినా తమ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగకపోవడంతో స్థూలకాయంతో నానారకాల ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు వంటి రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి వారికి వరప్రసాదంగా కాస్మటిక్ సర్జరీలో లైపోసక్షన్ అందుబాటులోకి వచ్చింది.


లైపోసక్షన్ అంటే...
లైపోసక్షన్ అంటే మరేమిటో కాదు...మన భాషలో చెప్పాలంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం. లైపోసక్షన్‌ను శరీరంలోని అనేక భాగాలలో చేయవచ్చు. అయితే టమ్మీటక్ సర్జరీని మాత్రం పొట్ట భాగంలో చేస్తారు. ఈ శస్త్ర చికిత్స ద్వారా కడుపులోని కండరాలు పటుత్వాన్ని పొందడమేకాక పొట్టపైన ఉండే ముడతలను సమూలంగా తొలగించడం సాధ్యమవుతుంది. అయితే లైపోసక్షన్ ద్వారా బుగ్గలు, మెడ, చేతులు, నడుము, తొడలు వంటి భాగాలలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం సులభంగా సాధ్యమవుతుంది.

ఇలా అధిక కొవ్వు నిల్వలను తొలగించడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగ సమస్యలను నివారించడంతో పాటు నాజూగ్గా, చలాకీగా జీవించవచ్చు. సహజ సిద్ధంగా బరువు తగ్గడానికి కోల్పోవడానికి చేసే ప్రయత్నాలన్నీ విఫలమైన తరువాతే లైపోసక్షన్ పద్ధతిని స్థూలకాయులు ఎంచుకుంటారు. నొప్పిలేకుండా, రెండుగంటల్లో పూర్తయ్యే ఈ చికిత్సా విధానంలో రోగి ఔట్ పేషెంట్‌గా ఉండి కూడా చికిత్స చేయించుకోవచ్చు. సాధారణంగా చికిత్స చేయించుకునే భాగానికి మత్తు ఇవ్వడం(లోకల్ అనస్థీషియా), అవసరాన్ని బట్టి పూర్తిగా శరీరానికి (జనరల్) మత్తు ఇవ్వడం జరుగుతుంది.

సూక్ష్మ గొట్టాల ద్వారా...

ఈ పద్ధతిలో అత్యంత చిన్న పరిమాణంలో ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ గొట్టాలను శరీరంలో కొవ్వు ఉన్న భాగంలో ప్రవేశపెడతారు. కొవ్వు అనేది ఘనపదార్థమే తప్ప ద్రవ పదార్థం కాదు కాబట్టి కొవ్వు కరగడానికి దోహదపడే మందులను శరీరంలోకి పంపడం జరుగుతుంది. దీంతో ద్రవరూపంలో కరిగిన కొవ్వు మూడు మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ సూక్ష్మ గొట్టాల ద్వారా బయటపడుతుంది. ఈ చికిత్సా విధానంలో శరీరంపై ఎటువంటి గాయపు గుర్తులు కనిపించవు. పైగా లోకల్ అనస్థీషియా ద్వారా ఈ చికిత్స చేయవచ్చు.

అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా...
ఈ విధానంలో శరీరంలో ఏ భాగంలో లైపోసక్షన్ జరుగుతుందో అక్కడ మత్తుమందుతోపాటు ఒక ద్రావకాన్ని ఇంజక్ట్ చేయడం జరుగుతుంది. కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి అల్ట్రాసోనిక్ తరంగాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసిన తరువాత ద్రవ రూపంలో ఉన్న కొవ్వును తొలగించడానికి సూక్ష్మ రూపంలో ఉండే సన్నటి గొట్టాలను ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో పెద్ద పరిమాణంలో కొవ్వును తొలగించడం సాధ్యమవుతుంది. ఈ లైపోసక్షన్ తర్వాత శరీరంలో కొవ్వు తీసిన ప్రాంతంలో చర్మం జారిపోకుండా ఉండేందుకు బిగుతైన దుస్తులు వేసుకోవడం తప్పనిసరి.

ఇంజెక్షన్ పద్ధతిలో..

ఈ పద్ధతిలో శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉన్న భాగంలో వాటిని కరిగించడానికి మందులను ఇన్‌జక్షన్ రూపంలో వేయడం జరుగుతుంది. ఈ విధానంలో నాలుగైదు విడతలు చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఒక్కో సెషన్‌కు మధ్య కనీసం నాలుగు నుంచి ఆరువారాలు విరామం ఉండాలి. ఈ తరహా చికిత్సను ముఖ్యంగా లావు బుగ్గలు, చేతుల పైభాగం, తొడలు, నడుము భాగంలో చేయడం జరుగుతుంది. అయితే లైపోసక్షన్‌లోని ఇతర చికిత్సా విధానాలతో పోలిస్తే ఈ చికిత్స కొద్దిగా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. స్థూలకాయులు, నాజూకైన శరీరాకృతి కోసం తపించేవారు లైపోసక్షన్ చేయించుకోవడం ఒక్కటే మార్గం. ప్రసవం తర్వాత మహిళల్లో వచ్చే అసాధారణ ముడుతలు, లావు వంటివి తొలగించుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top