చర్మపోషణకు రోజువారి ఆహారం ఏవేవి ఉండాలో ముందుగా తెలుసుకోండి..

విటమిన్ ‘సి’
ఆహారంలో విటమిన్ ‘సి’ తక్కువగా ఉంటే చర్మం త్వరగా ముడతలు పడి, నిస్తేజంగా మారి వయసు మీరిన వారిలా కనపడతారు. ఈ నిజం చాలా పరిశోధనల్లో వెల్లడైంది కూడా. విటమిన్‌‘సి’కి ఇంత ప్రాధాన్యం ఎందుకంటే ఇది చర్మంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. చర్మంలో కొల్లాజెన్ సంశ్లేషణ, పునరుత్పత్తి విధానం, గాయాన్ని మానేలా చేయడం వంటి విభిన్నరకాలైన బయలాజికల్ రోల్స్‌ని విటమిన్ ‘సి’ సమర్థవంతంగా పోషిస్తుంది. అంతేకాదు విటమిన్ ‘సి’ కి మరో ముఖ్యమైన గుణం ఉంది. దీనిలో యాంటీయాక్సిడెంట్లు ఎక్కువ. చర్మం ముడతలను, పొడిబార్చే గుణాలను యాంటియాక్సిడెంట్లు నిరోధిస్తాయి.

విటమిన్ ‘సి’- జామ, నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లు, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, టొమాటో, బొప్పాయి, బంగాళదుంపల ద్వారా సమృద్ధిగా లభిస్తుంది.

పండ్లు, కూరగాయలు  

సహజసిద్ధంగా ప్రకృతి అందించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో ఉండే ఎన్నో పోషకాలు చర్మాన్ని ఎప్పుడూ తేజోవంతంగా ఉంచుతాయి. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వవు. వీటిలోని పోషకాలు చర్మంపై వేగవంతమైన ప్రభావాన్ని చూపుతాయి. సప్లిమెంట్ల అవసరం లేకుండా వరంగా లభించిన ఈ ప్రకృతిసిద్ధ ఆహారంలో రోజుకు కనీసం ఐదు రకాలైనా ఉండేలా జాగ్రత్తపడాలి.

విటమిన్ ‘ఎ’
దీర్ఘకాలం చర్మం ముడతలు పడకుండా చూసే సుగుణం విటమిన్ ‘ఎ’ కు ఉంది. మార్కెట్లో లభించే రకరకాల సౌందర్యసాధనాలను విటమిన్ ‘ఎ’ను ఉపయోగించి తయారుచేసినవే. తీసుకునే ఆహారంలో విటమిన్ ‘ఎ’ ఎక్కువ ఉండేలా చూసుకుంటే సౌందర్యసాధనాల అవసరమే ఉండదు. వయసు పైబడటం సమస్యను ఎలాంటి ఆయుధం లేకుండా అడ్డుకున్నట్టే. క్యారట్, గుమ్మడికాయ, చిలగడదుంప, గింజధాన్యాలు, పాలు, గుడ్లలో విటమిన్ ‘ఎ’ సమృద్ధిగా లభిస్తుంది.

ప్రొటీన్లు

తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల శాతం తక్కువగా ఉంటే ఆ లోటు వారి ముడతలు పడిన చర్మం స్పష్టంగా తెలియజేస్తుంది. వృద్ధుల్లో చర్మం పెళుసుదనాన్ని, సాగే గుణాన్ని బట్టి ఈ లోపాన్ని గమనించవచ్చు. ఈ సమస్య ప్రొటీన్ తక్కువగా ఉండటం వల్లనే అని తెలియజేస్తుంది. చర్మం నిగారింపుగా ఉండటానికి ఉపయోగపడే ప్రొటీన్లు చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, కోడిగుడ్లు, బీన్స్, పప్పులు, సోయా, మాంసం, పాల ఉత్పత్తులలో పుష్కలంగా లభిస్తాయి.

కొవ్వు, పిండిపదార్థాలు 

తీసుకునే ఆహారంలో అధికమొత్తంలో కొవ్వు, పిండిపదార్థాలు ఉంటే చర్మం ఉన్నదానికన్నా వయసు మీదపడినట్టుగా కనపడుతుంది. మాంసం, అధికకొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు, పందికొవ్వు, నూనెలలో ఫ్యాట్ ఎక్కువ. ఈ పదార్థాలను వండుతున్నప్పుడు ఇందులోని కొవ్వును గమనించవచ్చు. అలాగే వేపుడు పదార్థాలు, భోజనం తర్వాత తినే తీపిపదార్థాలు, వెన్న, క్రీమ్ పదార్థాలు ఉన్న గ్రేవీ, సాస్, ఫాస్ట్ ఫుడ్‌లలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఆహారంలో తగు మోతాదులో కొవ్వు ఉండటం అవసరమే. అయితే అధికకొవ్వు లేదా శాచ్యురేటెడ్ ఫ్యాట్ వంటివి శరీరానికి హాని చేస్తాయి. అందుకని ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పైన దృష్టి పెట్టాలి. ఆవ, వేరుశనగ, ఆలివ్ నూనెల్లో, చేపల నుంచి లభించే ఒమేగా -3 కొవ్వుల్లో, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ద్వారా మంచి ఫ్యాట్ లభిస్తుంది.

చర్మం ఆరోగ్యకరంగా, నిగారింపుగా ఉండాలంటే పై జాగ్రత్తలు పాటించడంతో పాటు పంచదారతో తయారు చేసిన పదార్థాలను అంటే కుకీస్, కేక్స్, పేస్ట్రీలు, క్యాండీలను బాగా తగ్గించాలి. అధిక ఆల్కహాల్ చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. నీరు ఎక్కువగా తీసుకుంటుంటే అది... చర్మంలోని మలినాలను పోగొట్టి తాజాగా ఉంచుతుంది. 6 నుంచి 7 గంటల చక్కని నిద్ర చర్మాన్ని తేజోవంతంగా ఉంచడానికి సహకరిస్తుంది.

లినోలిక్ ఆమ్లం

లినోలిక్ ఫ్యాటీ యాసిడ్ అన్నది శరీరానికి అవసరమైన ఒక రకం పోషకం. ఆహారం ద్వారా దాన్ని తగినంతగా శరీరానికి అందేలా చూస్తే వృద్ధాప్యం త్వరగా దరిచేరే సమస్యే ఉండదు. చర్మం పొడిబారదు. చర్మంలోని అనారోగ్యం కలిగించే కణాలు తగ్గి మేలైన ఫలితాలు వస్తాయి. లినోలిక్ ఆమ్లం.. నట్స్, పప్పుధాన్యాలు, కోడిగుడ్లు లాంటి ఆహారపదార్థాల్లోనూ కుసుమ, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, సోయా, ఈవెనింగ్‌ప్రిమ్‌రోజ్ నూనెల్లోనూ, గోధుమలు, గుమ్మడిగింజల్లోనూ అధికంగా లభిస్తుంది.
 
  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top