డెంగీ ఫీవర్ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు -తీ సుకోవాల్సిన చికిత్స - లక్షణాలు - నివారణ

డెంగీ అనేది ఒక వైరస్. ‘ఈడిస్ ఈజిప్టై’ అనే ఒక రకం ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. ఈ వైరస్ జీవితచక్రమం దోమల నుంచి మనుషులకు, మనుషుల నుంచి దోమలకు ఇది ఒక విష వలయంలా ఉంటుందన్నమాట. దోమ, దోమ కుట్టిన 5 నుంచి 6 రోజులకు జ్వరం ప్రారంభమవుతుంది. పగలు కుట్టే దోమల వల్ల ఈ విషజ్వరం వ్యాపిస్తుంటుంది.

వాతావరణంలో 16 నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత ఉంటే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉంటుంది. 16 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఈ వైరస్ ఏ మాత్రం బతకలేదు. అందుకే చలిదేశాల్లో ఈ వ్యాధి తాలూకు ఆనవాలు మనకు కనిపించవు. మనందరినీ హడలెత్తిస్తున్న డెంగీ జ్వరం మొట్టమొదటిసారిగా ఆఫ్రికా ఖండంలో వెలుగు చూసింది. ఆ తర్వాత ఉష్ణదేశాలన్నింటికీ ఇది పాకినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.


దోమలకు ఆవాసం...

నిలువ నీళ్లల్లో ఈడిస్ ఈజిప్టై దోమ గుడ్లు పెడుతుంది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, అండర్‌గ్రౌండ్ ట్యాంకులు, కూలర్లు, ఇంట్లోని పాత్రలు, ఫ్లవర్‌వాజులు, నీటి కుండీలు, పాతటైర్లు, పనికిరాని పడేసిన బాటిళ్లు, పాత్రలు, డబ్బాలు... ఇలా ఎక్కడ నీళ్లు నిలువ ఉండటానికి అవకాశం ఉంటే అక్కడ ఈ దోమ గుడ్లు పెడుతుంది. ఈ నీళ్ల నుండి వారం, పదిరోజుల్లో లక్షలాది దోమలు తయారవుతాయి. ఇవి చల్లగా ఉండే, నీడగా ఉండే ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటాయి. అంటే మన ఇళ్లల్లో కర్టెన్ల వెనకా, తలుపుల వెనకా, గోడల మాటన విశ్రమించి మధ్యాహ్నం, సాయం సమయాలలో కుట్టడం ప్రారంభిస్తాయి. సాధారణంగా ఈ దోమలు అరమైలు కంటే ఎక్కువ దూరానికి తిరగలేవు. అయితే బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో ఇతర వాహనాల్లో చేరి ఎంతదూరమైనా వెళ్తాయి.

డెంగీ జ్వరమని ఆనుమానించినప్పుడు ఆందోళన చెందకుండా వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి. అవసరాన్ని బట్టి వైద్యులు రక్తపరీక్షలు చేయించి, చికిత్స ఇస్తారు.

డెంగీ లక్షణాలు...

2 నుంచి 7 రోజుల వరకూ జ్వరం తగ్గకపోవడం ఒళ్లంతా తీవ్రమైన నొప్పులుగా ఉండటం (కండరాలలో, కీళ్లలో, తలలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది) చర్మంపై ఎర్రటిమచ్చలు ర్యాష్‌లాగా కనిపించడం తెల్ల రక్తకణాలు బాగా పడిపోవడం (ఇది రక్తపరీక్షలో తెలుస్తుంది) హిమోగ్లోబిన్ 16 శాతం కంటే ఎక్కువ ఉండటం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవడం (రక్తపరీక్షలో తెలుస్తుంది) ప్లేట్‌లెట్స్ సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. వీటి సంఖ్య సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షలు ఉండాలి. కానీ... డెంగీ వ్యాధిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. ప్లేట్‌లెట్స్ అనేవి రక్తస్రావం జరగకుండా ఆపే కణాలు. అవి తగ్గడం వల్ల శరీరం లోపలి భాగాల్లో రక్తస్రావం జరిగి, అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. జ్వరం వచ్చిన మూడో రోజు నుంచి రెండో వారాంతం వరకు ఎప్పు డైనా ఇలా జరగవచ్చు. (అయితే మొదటివారం లోనే ఇది కనిపించే అవకా శాలు ఎక్కువ). ఇది ప్రమాదకరమైన దశ. ఈ సమయంలో రోగిని పర్య వేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

చికిత్స...

లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. రోగికి బాగా విశ్రాంతినివ్వాలి ఈ జ్వరానికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. (కానీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని నియంత్రించడానికి తగిన యాంటిబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది). ఐవీ ఫ్లుయిడ్స్ ఇచ్చి బీపీని పడిపోకుండా చూసుకోవడం అవసరం. పారాసిటమాల్ మాత్రలు డాక్టర్ల సూచన మేరకు ఇవ్వాలి పథ్యం అవసరం లేదు. అయితే తాజాగా, వేడిగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. జ్వరం రెండు నుంచి ఏడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. జ్వరం తగ్గినా... తీవ్రమైన కడుపునొప్పి, మలం నల్లగా రావడం, చర్మంలో ఎర్రటి మచ్చలు, ముక్కు నుంచి రక్తం కారడం, ఒళ్లు చల్లబడటం, విపరీతంగా చెమటపట్టడం... ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని ప్రమాద సూచికలుగా గుర్తించాలి. వెంటనే ఆసుపత్రిలో చేర్పించి వైద్యులతో చికిత్స ఇప్పించాలి.

డెంగ్యు హేమరేజిక ఫీవర్...
డెంగీలోనే మరో రకం డెంగీ హెమరేజిక్ ఫీవర్ ప్రమాదకరమైన జ్వరం. శరీరంలోని ఏ భాగంలోనైనా అంతర్గత రక్తస్రావం కావడం దీని లక్షణం. చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ముక్కు నుంచి రక్తస్రావం కావడం, రక్తవాంతులు, మెదడు, పొట్టలో, ఊపిరితిత్తుల్లో రక్త స్రావం... వీటిలో కొన్ని లక్షణాలు ఈ రకం డెంగీలో కనిపించవచ్చు. రక్తాన్ని గడ్డ కట్టించే ప్లేట్‌లెట్స్ బాగా తగ్గిపోవ డంతో ఈ సమస్య వస్తుంది.

డెంగ్యు షాక్ సిండ్రోమ్... 

ఇందులోనే ఇంకోరకం తీవ్రమైన జ్వరాన్ని డెంగీ షాక్ సిండ్రోమ్ అంటారు. శరీరంలోని ఫ్లుయిడ్స్ పడిపోవడం, శరీరంలోని లోపలి అవయవాల్లో ఎక్కడైనా రక్తస్రావం వల్ల నాడి బలహీనపడి బీపీ పడిపోవడం, కాళ్లు చేతులు చల్లబడటం, తీవ్రమైన దాహం.. ఇందులో అన్నీ లేదా పై లక్షణాల్లో కొన్ని లక్షణాలు డెంగీ షాక్ సిండ్రోమ్‌లో కనిపిస్తాయి. డెంగీ హెమరేజిక్ ఫీవర్, డెంగీ షాక్ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేర్చి అత్యవసర వైద్యం ప్రారంభించాలి.

నివారణ... 

దోమలు కుట్టకుండా జాగ్రత్తపడితే డెంగీని అరికట్టినట్టే...

దోమ గుడ్లుపెట్టే స్థలాలను శుభ్రం చేయాలి. వాటి ఆవాసాలను తొలగించాలి.

ఇంట్లో పాత్రలకు మూతలు పెట్టడం కూలర్లలో నీటిని తొలగించడం, కడిగి ఆరబెట్టడం వంటివి చేయాలి.

సెప్టిక్ ట్యాంకులు, ఇంటిపైన ట్యాంకులను కప్పి ఉంచాలి.

ఇంటి చుట్టుపక్కల పనికిరాని పాత్రలు, సీసాలు ఉండకుండా చూడాలి.

దోమతెరలు వాడటం, దోమ నిరోధక చర్యలు తీసుకోవడం తప్పనిసరి. పిల్లలకు ఫుల్‌షర్ట్‌లు, ప్యాంట్లు ఉపయోగించాలి.

ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను, పెద్దలను డెంగీ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

నిర్ధారణ...

రక్త పరీక్ష - దీనిలో తెల్ల రక్తకణాలు తగ్గటం, హిమోగ్లోబిన్ పెరగటం, ప్లేట్‌లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోవడం ద్వారా దీనిని గుర్తిస్తారు.

మరో రక్తపరీక్షలో డెంగీ యాంటీ బాడీస్‌ను కనుగొంటారు.

అయిదవ రోజు నుంచి యాంటీబాడీస్‌ను గుర్తించవచ్చు.

యాంటీబాడీస్ కనుగొన్నా, లేకపోయినా చికిత్స మారదు.   
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top