చిగుళ్ల సమస్యలు ఎందుకొస్తాయి?

చిగుళ్ల వ్యాధి అంటే పంటి చిగుళ్లలో వాపు వచ్చి పంటి ఎముక, దాని చుట్టుపక్కల ఉండే భాగాన్ని దెబ్బతీయడం అన్నమాట. ఒక విధమైన బ్యాక్టీరియా వల్ల ఈ విధంగా జరుగుతుంది. దీనికి ముందుగా ఒక వర్ణరహితమైన గారలాంటిది పళ్ల మీద ఏర్పడుతుంది. పళ్లను రోజూ సరైన పద్ధతిలో శుభ్రచేసుకోకపోవడం, ఫ్లాసింగ్ చేసుకోకపోవడం వల్ల పళ్ల మీద పాచి పేరుకుపోయి బ్యాక్టీరియా ఏర్పడి, గారవచ్చి దాని మూలంగా ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి.

ఈ ఇన్ఫెక్షన్ వల్ల పళ్లతోబాటు పంటి చిగుళ్లు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా చిగుళ్లలో ఉండే కణజాలం, పళ్లను పట్టి ఉంచే చిగురుటెముక కూడా క్రమంగా దెబ్బతింటాయి. దాంతో పళ్లు వదులై, ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వల్ల పిప్పిపళ్లు ఏర్పడి పన్నుపోటు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. 


చిగుళ్లవ్యాధిని ఇలా గుర్తించాలి!
చిగుళ్లవ్యాధి ఏ వయసువారికైనా వచ్చే అవకాశం ఉంది. చిగుళ్లు ఎర్రబడటం, మెత్తగా మారడం, వాయడం లేదా పూయడం, పళ్లు తోముకునేటప్పుడు చిగుళ్లనుంచి రక్తం కారడం, చిగుళ్లు దెబ్బతినడం మూలంగా పళ్లు ఎత్తుగా మారడం, చిగుళ్లలో విపరీతమైన నొప్పి రావటం, జివ్వుమని లాగినట్లుండటం, గట్టి పదార్థాలను కొరికినప్పుడు నొప్పి పుట్టడం, పళ్లకూ, చిగుళ్లకూ మధ్య నుంచి చీమురావడం, పళ్లనుంచి ఎడతెగకుండా దుర్వాసన రావడం వంటి లక్షణాలు కనిపిస్తే చిగుళ్లవ్యాధికి ఇవి సంకేతాలుగా పరిగణించాలి.

చిగుళ్లవ్యాధికి చికిత్స...
నోటిని శుభ్రంగా ఉంచుకుంటూ, ఆరోగ్యంగా ఉంచుకుంటే పళ్ల మీద పాచి లేదా గార పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. అప్పుడప్పుడు డెంటిస్ట్ సహకారంతో పళ్లమీద ఏర్పడ్డ పాచిని, గారను క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. దీన్ని వైద్య పరిభాషలో స్కేలింగ్ అంటారు. దంతవైద్యుడు లేదా హైజీనిస్ట్ పళ్లను స్కేలింగ్ చేసి పాచిని లేదా గారను తొలగిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే... అంటే చిగుళ్ల నొప్పి లేదా వాపు ఎక్కువగా ఉంటే రూట్ ప్లానింగ్ ప్రొసీజర్ లేదా ఫ్లాప్ సర్జరీ, డీప్ క్లీనింగ్ చేయించుకోవడం అవసరం. ఈ ప్రక్రియద్వారా పళ్లమూలాన్ని, దానిచుట్టూ ఉన్న ఎముకకు సంబంధించిన అంశాలను సరిచేయవచ్చు.

సాధారణంగా పళ్లకు లేదా చిగుళ్లకు సంబంధించి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే వైద్యుని సంప్రదించడం కన్నా, కనీసం ఆరునెలలకు ఒకసారి మనంతట మనమే వైద్యుని వద్ద పళ్లను చెకప్ చేయించుకుంటూ ఉండటం వల్ల అనేక రకాల సమస్యలను రాకుండానే నివారించవచ్చు.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top