బిడ్డ పుట్టగానే కనిపించే ఆరోగ్య సమస్యల్లో కామెర్లు ఫస్ట్ - లక్షణాలు - చికిత్స

బిడ్డ పుట్టగానే కనిపించే ఆరోగ్య సమస్యల్లో పుట్టుకామెర్లు ఫస్ట్ కావచ్చుమో గాని... మరీ అంత దుష్టమైనవీ, నష్టదాయకమైనవీ కావు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక బిడ్డ చేసే మొదటి పోరాటం ఈ జాండిస్‌తోనే. దీన్ని ఓ వ్యాధిగా అనుకోవడం కంటే, లోకంలో ఎదురయ్యే అనేక ఛాంలెజ్‌లలో విజేతగా మారడానికి ప్రకృతి ఇచ్చే ఫస్ట్ అవకాశంగా భావించవచ్చు. తల్లికి పథ్యం మొదలుకొని, బిడ్డకు సూర్యకాంతిని చూపడం వరకు వీటిపై అనేక అపోహలు ఉన్నాయి.

 బిడ్డ పుట్టిందనగానే ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబసభ్యులందరూ ఆనందంతో తీపిని పంచుకుంటారు. ముద్దు పేర్లతో పాపాయి చుట్టూ చేరిపోతారు. కళ్లలో ఒత్తులు వేసుకొని బిడ్డను చూస్తూ, ప్రతి కదలికను ఆనందిస్తుంటారు. తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుంది. మిలమిలల్లాడే చిన్నారి కళ్లు, కుంకుమ అద్దినట్టుగా ఉండే వేళ్లు, గోళ్లు, గులాబీ పువ్వుకన్నా సుకుమారమైన ఒళ్లు కొన్ని గంటల తర్వాత మెల్ల మెల్లగా పసుపు వర్ణంలోకి మారుతుంటే చెప్పలేనంత ఆందోళన. ఏమైందో అన్న కంగారు. భయంతో తల్లిమనసు తల్లడిల్లిపోతుంది.

వైద్యులు పరీక్షించి ‘కామెర్లు’ అని చెప్పగానే పెద్దల గుండెల్లో గుబులు మొదులవుతుంది. ఎలా చూసుకోవాలో, ఏ మందులు వాడాలో, ఎందుకు ఈ వ్యాధి తమ బిడ్డకే వచ్చిందో అని గాబరా పడిపోతుంటారు. కాని ఈ ‘పుట్టు కామెర్లు’ బిడ్డను గట్టిగా నిలబెట్టడానికే అని తెలిస్తే ... ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకోవచ్చు.


పుట్టిన శిశువుల్లో 60 శాతం మందికి పచ్చకామెర్లు వస్తుంటాయి. ఇది అత్యంత సాధారణం. పెద్దలకు వచ్చే కామెర్లలాంటివే అనుకొని ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. తొమ్మిది నెలలు గర్భంలో ఉన్న శిశువు తల్లి అందించే గాలి, ఆహారం తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా పెరుగుతుంటుంది. బయటకు వచ్చిన వెంటనే తనకు తానుగా గాలి పీల్చాలి, ఆహారం తీసుకోవాలి, వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి. 


వీటన్నింటినీ తట్టుకొని నిలబడటానికి శక్తిని పుంజుకోవాలి. ఈ శక్తిని ఇంకా ఎదిగీ ఎదగని కాలేయం త్వరగా అందివ్వలేదు. దీనికి తోడు పుట్టగానే ఎర్రరక్తకణాలు తగ్గుతాయి. శరీరంలో బిలిరుబిన్ ఎక్కువవుతుంది. ఫలితంగా కళ్లు, గోళ్లు, చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారుతాయి. ఆరోగ్యవంతంగా పుట్టిన పిల్లల కన్నా బరువు తక్కువగా ఉండి, నెలలు నిండకముందే పుట్టిన వారికైతే ఈ సమస్య కాస్త ఎక్కువ.

పూర్తి నెలల్లో పుట్టిన పిల్లల్లో రెండో రోజు నుంచి మొదలై 3 నుంచి 5 రోజుల వరకు ఎక్కువగా ఉండి 5వ రోజు నుంచి తగ్గుముఖం పడతాయి. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14 రోజుల వరకు కామెర్లు కనపడతాయి. కాలేయం పనితీరు మెరుగు పడి బిలిరుబిన్ స్థాయి (2 ఎంజీ) రావడానికి నెల రోజులు పట్టవచ్చు. ఆ తర్వాత ఈ సమస్య ఉండదు. నవజాత శిశువుల్లో కనిపించే కామెర్లను నియోనేటల్ హైపర్ బిలిరుబినిమియా, ఫిజియలాజిక్ జాండీస్ అని కూడా వ్యవహరిస్తారు.

లక్షణాలు: 

చర్మం, గోళ్లు పసుపు రంగులోకి మారడం
కంటిలోని తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారడం
సాధారణమైన దాని కంటే ఎక్కువసేపు బిడ్డ నిద్రపోవడం

పుట్టిన మొదటి రోజే కనిపిస్తే...

పుట్టిన మొదటి రోజే బిడ్డలో కామెర్లు కనిపించడం అంత సాధారణ విషయం కాదు. ఈ కామెర్లు రెండు వారాల కంటే ఎక్కువ అంటే తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణ అవసరం. శిశువు వయసు, బిలిరుబిన్ ఎంత మొత్తంలో ఉంది? కామెర్లకు కారణమేమిటి? అనే వాటిని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.

చికిత్స:

కామెర్ల తీవ్రతను తగ్గించడానికి ఈ కింది సూచనలు పాటించాలి.
తల్లిపాలు తరచుగా ఇస్తూ ఉండాలి.
ఫొటో థెరపీ ఇవ్వాలి.
తీవ్ర పరిస్థితిలో రక్తాన్ని మార్పిడి చేయాల్సి రావచ్చు.
ప్రత్యేక మందుల వాడకం వల్ల కాలేయం పనితీరును మెరుగుపరిచి, పసుపు వర్ణం తగ్గేలా చేయవచ్చు.
 

కామెర్లు రెండు వారాల కన్నా ఎక్కువ కొనసాగితే, అప్పుడే పుట్టిన బిడ్డల రసాయనిక చర్య గైలాక్టోసిమియా, కంజెనిటల్ హైపోథైరాయిడ్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ దశలో శిశువు కుటుంబంలో ఉన్నవారి ఆరోగ్యచరిత్ర, శిశువు బరువు పరిశీలించవలసి ఉంటుంది. శిశువు విసర్జించిన మలం కూడా పరిశీలించవలసి ఉంటుంది. 

కొన్ని ఆసక్తికరమైన విషయాలు:
తీవ్రమైన సూర్యకాంతికి బిడ్డను కొన్ని గంటల పాటు చూపడం వల్ల చర్మంపై మచ్చలు రావచ్చునని ఇటీవలి కాలంలో తేల్చారు. కనుక తీవ్రమైన సూర్యకాంతి బిడ్డలకు తగలనీయకూడదు.
కొన్ని సంవత్సరాల క్రితం జాన్స్ హోప్‌కిన్స్ విశ్వవిద్యాలయం బిడ్డల చర్మాన్ని పసుపుగా మార్చే బిలిరుబిన్ అనే పదార్ధం శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్ అని నిరూపించారు. ఇది బిడ్డ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అంటే కణనాశనం కాకుండా కామెర్లు ఒక అడ్డుగోడలా పనిచేస్తాయన్నమాట. అయినప్పటికీ కామెర్లకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
పుట్టిన మొదటి రోజులలో బిడ్డకు నీరు తాగించడం వల్ల కామెర్ల తీవ్రత పెరుగుతుంది. కాబట్టి నీళ్లు పట్టించడం కన్నా తల్లిపాలనే ఇవ్వాలి.

ఫొటోథెరపీ...  

శిశువుని ఎండలో ఉంచడం, అతినీలలోహిత కిరణాల తాకిడికి గురి చేయడం, ఎక్కువ వేడిలో ఉంచడం వంటివి మంచిది కాదు. 12 మి.గ్రా కన్నా బిలిరుబిన్ ఎక్కువగా ఉంటే ఆ పరిస్థితిని చక్కదిద్ద డానికి కాంతిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకు బ్లూలైట్స్‌తో ఫొటోథెరపీ చికిత్స ఇవ్వాల్సి రావచ్చు. 3-5 రోజులు ఈ థెరపీ ద్వారా బిలిరుబిన్‌ను సాధారణ స్థాయికి తీసుకువస్తారు.

బిలిరుబిన్ స్థాయి పెరగకుండా వైద్యులు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ పెరిగిన బిలిరుబిన్ తగ్గకపోతే అది రక్తం ద్వారా మెదడుకు చేరి సెరిబ్రల్‌పాల్సీకి దారి తీసే ప్రమాదాలు ఉంటాయి. ఈ స్థితి 25 మి.గ్రా కన్నా బిలిరుబిన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు జరగవచ్చు. ఈ ప్రమాదం తలెత్తకుండా రక్తమార్పిడి, ఇంజక్షన్లు, ఫొటోథెరపీ వంటి పద్ధతుల ద్వారా వైద్యులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top