డయాబెటిస్‌తో పాటు కనిపించే దంత సమస్యలు - జాగ్రత్తలు

డయాబెటిస్ ఉన్నప్పుడు శరీరంలోని అన్ని అవయవాల గురించి శ్రద్ధ తీసుకున్నట్లే దంతాలపై కూడా తగినంత శ్రద్ధ తీసుకోవాలి. మిగతా అన్ని అవయవాలపై చూపినట్లే చక్కెరవ్యాధి పంటిపై దుష్ర్పభావం చూపవచ్చు. మిగతావాళ్లతో పోలిస్తే డయాబెటిస్ రోగుల్లో చిగుళ్లవ్యాధులు, నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మరింత ఎక్కువ. డయాబెటిస్ ఉన్నప్పుడు దంతాల ఆరోగ్యం కోసం ముందుజాగ్రత్త తీసుకోవాలి.

మంచి ఓరల్ హెల్త్ కోసం పూర్తిగా ఆరోగ్యకరమైన వారు సైతం ప్రతి ఆర్నెల్లకోమారు డెంటిస్ట్‌ను కలవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇక డయాబెటిస్ ఉంటే... అది మరింత అవసరమన్నమాట. డయాబెటిస్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు శరీరంలోని చక్కెర పాళ్లను పరిశీలించుకుంటూ ఆ రికార్డును తరచూ డెంటిస్ట్‌కు చూపించడం చాలా ముఖ్యం.

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారంతో...  
మనం ఏదైనా తిన్నప్పుడు మన నోట్లోని బ్యాక్టీరియా దానిపై చేరి పాచి (ప్లాక్)లా ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం తిన్న ఆహారంలో చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా పెరుగుదల మరీ ఎక్కువ. వాటి నుంచి యాసిడ్స్ తయారై, అవి పంటిపై దుష్ర్పభావం చూపడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఇదే క్రియ అదేపనిగా జరగడం వల్ల పంటి ఎనామిల్‌లో క్యావిటీస్ ఏర్పడతాయి. ఇక నియంత్రణ లేని చక్కెరతో నోటిలోని లాలాజలంలోనూ చక్కెర ఎక్కువై బ్యాక్టీరియా మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. దాంతో ప్లాక్ మరింత పెరిగి అది బ్రషింగ్‌తో తొలగించలేని ‘గార’ (టార్‌టార్)లా రూపొందుతుంది. ఈ పరిస్థితి వల్ల ఒక్కోసారి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్, ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీయవచ్చు.

డయాబెటిస్‌కు, చిగుళ్ల సమస్యలకు సంబంధం ఇలా... 
డయాబెటిస్ ఉన్నవారికి శరీరంలోని వ్యాధినిరోధకశక్తి కూడా తగ్గుతుంది. దాంతో చిగుళ్ల కణజాలంపై దుష్ర్పభావాలు పడే అవకాశం ఎక్కువ. ఫలితంగా చిగుళ్లకు సంబంధించిన సమస్యలు రావచ్చు. అది క్రమంగా పంటిని గట్టిగా పట్టి ఉంచేందుకు దోహదపడే పంటి ఎముక వరకు పాకే అవకాశం ఉంది. అందుకే చక్కెరను నియంత్రించుకోకపోవడం వల్ల మిగతా అవయవ భాగాలు ప్రమాదానికి గురైనట్లే పళ్లు కూడా ప్రభావితం అయ్యే అవకాశాలు అధికం. ఉదాహరణకు రక్తంలో మిగతా వాళ్లతో పోలిస్తే రక్తంలో చక్కెర పాళ్లు అనియంత్రితంగా ఉండేవాళ్లలో చిగుళ్ల సమస్య మరీ ఎక్కువగానూ, తీవ్రంగానూ ఉండే అవకాశాలు మరింత ఎక్కువ.


ఇక చక్కెరవ్యాధి వల్ల వ్యాధినిరోధక శక్తి ఎలాగూ తగ్గుతుందని స్పష్టంగా తెలుసు. కాబట్టి మిగతా అన్ని వ్యాధుల్లాగే చిగుళ్ల వ్యాధి (పెరియొడాంటైటిస్) వచ్చే అవకాశాలు ఎలాగూ ఎక్కువేనని అర్థం చేసుకోవచ్చు.

నోటికి రుచి తెలియకపోవడం వల్ల...
తమకు మునపటిలా ఆహారపదార్థాల రుచి తెలియడం లేదని చాలామంది డయాబెటిక్ రోగులు చెబుతుంటారు. ఇలాంటి వాళ్లు మునపటి రుచిని ఆస్వాదించడం కోసం మరింత ఎక్కువగా తీపి ఉండే పదార్థాలను తీసుకుంటారు. వంటలో మునపటి రుచిని ఎలాగైనా ఆస్వాదించాలనే తపనతో మరింతగా ఎక్కువ రిఫైన్‌డ్ కార్బోహైడ్రేట్‌లను తీసుకుంటారు. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు. అందుకే నోటి రుచి మారినట్లుగా గమనించే డయాబెటిస్ రోగులు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

నోరు తడారిపోతుంటే... 
నోటిలో ఉరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు తడిగా ఉంటుంది. ఈ లాలాజలం నోటిలో ఉండే ఆహారపదార్థాలను కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ రోగుల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘జీరోస్టోమియా’ అంటారు. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా గూడుకట్టినట్లుగా ఒకేచోట పెరగడం (కొలొనైజ్ కావడం) సాధారణంగా కనిపించే దుష్పరిణామం. (ఇదే లక్షణం తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారిలోనూ కనిపిస్తుంది). ఇలా నోరు పొడిబారిపోవడం అన్నది దీర్ఘకాలంపాటు సాగితే నోటిలోని మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూస్) దెబ్బతినడం, నొప్పిరావడం మామూలే. ఫలితంగా దంతక్షయం (టూత్ డికే), చిగుళ్ల వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే దంతవైద్యులను కలవాలి. నోటిలో తగినంత లాలాజలం ఊరని రోగులకు ప్రత్యామ్నాయంగా కొన్ని చికిత్సలు సూచిస్తారు. దాంతోపాటు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత(టాపికల్)గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు.

ఇటీవల మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చక్కెర లేని గమ్స్, చక్కెర లేని మింట్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్‌ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లకు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్‌ను చాలా పరిమితంగా తీసుకోవడం, ఆల్కహాల్‌ను మానివేయడం మరింత మేలు చేస్తుంది.

వీళ్లలో తొలిదశలోనే నివారణ మరింత ముఖ్యం... 
నోటికి, దంతాలకు, చిగుళ్లకు సంబంధించిన అనేక సమస్యల నివారణ కోసం క్రమం తప్పకుండా దంతవైద్య నిపుణులను క్రమం తప్పకుండా సంప్రదిస్తూ, అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. సాధారణ ఆరోగ్యవంతులు కూడా క్రమం తప్పకుండా సంప్రదిస్తూ ఉండటం అవసరం. వారితో పోలిస్తే ఇక డయాబెటిస్ ఉన్నవారు దంతవైద్యనిపుణులను కలవడం మరింత ఎక్కువ అవసరం అని గుర్తించాలి.

డయాబెటిస్ రోగుల్లో వచ్చే నోటి సమస్యలు... 
ఓరల్ క్యాండిడియాసిస్ : ఇది నోటిలో వచ్చే ఒకరకం ఫంగల్ ఇన్ఫెక్షన్. నోటిలో డెంచర్స్ వాడేవాళ్లతో పాటు డయాబెటిస్ రోగుల్లోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధి వచ్చినవారు దంతవైద్యులను కలిస్తే యాంటీ ఫంగల్ మందులతో దీన్ని తగ్గిస్తారు. అయితే ఇది కనిపించినవారు నోటి పరిశుభ్రతను పాటించడం అవసరం.
 
లెకైన్ ప్లానస్ : 
ఇది నోటిలో కనిపించే ఒకరకమైన చర్మవ్యాధి. దీనివల్ల నోటిలోని పైపొర దోక్కుపోయినట్లుగా అవుతుంది. నోటిలో పుండ్లు (అల్సర్స్)కూడా వచ్చి, నొప్పిగా ఉంటుంది. ఇది వచ్చినవారికి పూర్తిచికిత్స సాధ్యం కానప్పటికీ పైపూత (టాపికల్) గా వాడదగ్గ కొన్ని రకాల అనస్థిటిక్ ఔషధాలతో బాధలను చాలామట్టుకు తగ్గించి, పరిస్థితిని మెరుగుపరచవచ్చు.

డయాబెటిస్ రోగులు డెంటిస్టుకు చెప్పాల్సిన విషయాలు...
మీకు చక్కెరవ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందా? అయితే ఎప్పుడు? ఎంతకాలంగా?
మీ చక్కెరపాళ్లు నియంత్రణలోనే ఉన్నాయా? లేకపోతే ఎంత?
మీ మెడికల్ హిస్టరీలో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నాయా?
మీరు మందుల చీటీ (ప్కిస్క్రిప్షన్ ప్రకారం) తీసుకున్న మందుల వివరాలు.
ఒకవేళ మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా (ఆన్ కౌంటర్) ఏమైనా మందులు తీసుకుంటుంటే ఆ వివరాలు.

డయాబెటిస్‌తో పాటు కనిపించే దంతసమస్యల్లో కొన్ని సాధారణమైనవి ఇవి...  
దంతక్షయం (టూత్ డికే)
చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు (పెరియొడాంటల్ డిసీజెస్)
లాలాజల గ్రంథులు సరిగా పనిచేయకపోవడం (సెలైవరీ గ్లాండ్స్ డిస్‌ఫంక్షన్)
నోరు తడి ఆరిపోవడం.
ఫంగల్ ఇన్ఫెక్షన్స్
లెకైన్ ప్లానస్, లెకైనాయిడ్ రియాక్షన్స్ (మంటతో ఉండే ఒక రకం చర్మ సమస్యలు)
నోటి ఇన్ఫెక్షన్స్ వచ్చి వెంటనే తగ్గకపోవడం
నోటికి రుచి సరిగ్గా తెలియకపోవడం.
    
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top