ఇంట్లో కలిగే చిన్న చిన్న గాయాలకు ప్రాథమిక ఉపశమనం(ప్రాథమిక చికిత్స పద్ధతులు )

కూరలు తరుగుతున్నప్పుడు చేయి తెగితే: 
చాలామంది మహిళలకు ఎదురవుతుందీ సమస్య. అలాంటప్పుడు వెంటనే ధారలా పడుతున్న కుళాయి నీటి కింద చేయిని ఉంచడం మనకు తెలిసిందే. కానీ దానివల్ల రక్తస్రావం మరింత అధికమవుతుంది. అందుకే.. గాయమైన చోటును మరో వేలితో గట్టిగా నొక్కి పెట్టాలి. దీన్ని ప్రెషర్‌ బ్యాండేజీ అంటారు. అలా కనీసం నాలుగు నిమిషాలు ఉంచాలి. క్రమంగా రక్తస్రావం తగ్గుతుంది. ఆ తరవాత పట్టీ లాంటిది చుట్టుకోవచ్చు. నేరుగా పట్టీ చుట్టకుండా దూదిని ఉంచి.. ఆ తరవాత పట్టీ కట్టాలి. దూది ఉంచినా కూడా రక్తస్రావం అవుతుంటే దానిపైన మరొకటి ఉంచాలి తప్ప.. మార్చకూడదు. 
నూనె చిందితే:
వంట చేస్తున్నప్పుడు వేడివేడి నూనె చిందడం.. వేణ్నీళ్లు చేయిజారి మీదపడిపోవడం.. వంటి సమస్యలు కొన్నిసార్లు తప్పవు. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు సన్నగా వచ్చే కుళాయి నీటి కింద గాయమైన భాగాన్ని ఉంచాలి. ఈ జాగ్రత్త చిన్నచిన్న కాలిన గాయాలకు మాత్రమే. ఎలాంటి ఆయింట్‌మెంట్‌, క్రీం రాయకూడదు. గాయాలు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
కాలు బెణికితే: 
గబగబా ఇంటిపనులు చేస్తున్నప్పుడు, మెట్లెక్కి దిగుతున్నప్పుడు తూలడం, కిందపడటం, కాలు బెణకడం జరుగుతుంటుంది.అలాంటప్పుడు ప్రతీది ఫ్రాక్చర్‌ కాదు. భరించలేని నొప్పి, వాపు, కాలుకదల్చలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఫ్రాక్చర్‌ లేదా ఎముక పక్కకు జరిగి ఉండవచ్చని పరిగణించాలి. కేవలం బెణికితే భయపడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు వెంటనే నడవడానికి ప్రయత్నించకూడదు. బెణికిన చోట ఉన్న జాయింట్‌ పై, కింది భాగాలను ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదు. వెడల్పాటి కర్ర లేదా అట్టతో బెణికిన చోటుకు ఆసరాలా చేసుకుని ఆ తరవాత వైద్యుల్ని సంప్రదించాలి. ఈ సూచన ఫ్రాక్చర్‌కూ వర్తిస్తుంది. మెడకు గాయమైతే.. దాన్ని కదల్చకుండా ఉంచాలి. లేదంటే ఆ ప్రభావం వెన్నెముకపై పడవచ్చు. అలాగే తలకు దెబ్బతగిలితే.. అంతకన్నా ముందు వాళ్లు స్పృహలో ఉన్నారా లేదా అన్నది నిర్థారించుకునేందుకు మాట్లాడించాలి.
ముక్కు నుంచి రక్తస్రావం: 
పిల్లలకే కాదు.. పెద్దవాళ్లకూ కొన్నిసార్లు ఈ సమస్య ఎదురవుతుంది. దీనిని నియంత్రించాలంటే... తలను కొద్దిగా కిందకు వంచి ముక్కు మధ్య భాగాన్ని వేళ్లతో నొక్కిపెట్టాలి. అలా కనీసం నాలుగు నిమిషాలు ఉండాలి కాబట్టి.. నోటి నుంచి గాలి తీసుకోవాలి. క్రమంగా రక్తస్రావం తగ్గుతుంది.
పదార్థం అడ్డు తగిలితే:  
భోంచేస్తున్నప్పుడు.. కాస్త గట్టిగా ఉన్న పదార్థం ఏదైనా శ్వాస తీసుకునే గొట్టంలోకి చేరడం.. ఊపిరి అందక ఇబ్బందిపడటం చాలామందికి అనుభవమే. ఆ ఉక్కిరిబిక్కిరి తగ్గాలంటే వీపు మీద నెమ్మదిగా కొట్టినట్లు చేయాలి. లేదంటే... కొద్దిగా ముందుకు వంచి.. పొట్టపై భాగంలో నొక్కినట్లు చేస్తే.. చాలు.. సమస్య అదుపులో వచ్చేస్తుంది.
కళ్లల్లో దుమ్ము: 
ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు కళ్లల్లో దుమ్ము పడటం సహజం. అలాంటప్పుడు దుమ్ము పడిన కన్నును శుభ్రం చేయాలి. ఆ వెంటనే మెత్తని వస్త్రంతో కంటిని కాసేపు మూసేయాలి. అంతేకానీ రుద్దకూడదు. దానివల్ల కన్ను ఎర్రగా మారిపోతుంది.
చెవిలో చీమలు దూరితే: 
నేలపై పడుకున్నప్పుడు ఇలాంటి సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. దాన్ని బయటకు లాగేందుకు చెవిలో పిన్నులు, ఇయర్‌బడ్స్‌ లాంటివి పెడితే కర్ణభేరికి హాని తప్పదు. అందుకే చాలా కొద్దిగా నీళ్లు తీసుకుని చెవిలో పోసి.. ఆ తరవాత ఓ పక్కకు వంచినట్లు చేయాలి. నీళ్లతోపాటు చీమ కూడా వెలుపలికి వచ్చేస్తుంది.
తీవ్రమైన జ్వరానికి:
ఈ సమస్య పిల్లల్లో ఎక్కువ. జ్వరంతో ఒళ్లు కాలిపోతున్నప్పుడు చాలామంది తడి వస్త్రాన్ని నుదుటిపై వేస్తుంటారు. బదులుగా ఏం చేయాలంటే... మరీ మందంగా ఉన్న దుస్తులు ధరించేలా చూడాలి. ఆ తరవాత పడుకోబెట్టి పైన పలుచని దుప్పటి కప్పాలి. మరీ చల్లగా అలాగని వేడిగా లేని గోరువెచ్చని నీటిలో వస్త్రాన్ని ముంచి.. శరీరమంతా ఒకేసారి కాకుండా.. చేతులు, కాళ్లు, వీపు, నుదురు... ఇలా ఒక్కోభాగాన్ని తుడవాలి. క్రమంగా ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గుతుంది.
పిల్లలు కిందపడితే: 
 ఆటపాటల్లో భాగంగా పిల్లల మోకాళ్లు, కాళ్లకు తరచూ చిన్నచిన్న గాయాలవుతుంటాయి. ఆ భాగాన్ని ముందుగా యాంటీసెప్టిక్‌ లోషన్‌తో శుభ్రం చేయాలి. దుమ్ముపడే ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లయితే కట్టుకట్టాలి. సాధ్యమైనంతవరకు ఆ భాగానికి విశ్రాంతి ఇస్తేనే.. గాయం త్వరగా మానుతుంది.
పాము, కుక్క కాటు: 
సాధారణంగా పాము ఎక్కువగా కాళ్లదగ్గరే కాటేస్తుంది. దాన్నుంచి వచ్చిన విషం మిగతా శరీరానికి చేరకుండా కాటేసిన చోటుకు అటూఇటూ బిగుతుగా కట్టు కట్టేస్తాం. కానీ అది పొరబాటు. వైద్యులు వచ్చేదాకా కాలును కదిలించకుండా ఉంచాలి. కుక్క కరిస్తే.. ఆ భాగాన్ని ముందుగా నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తరవాత వైద్యుల్ని సంప్రదించాలి.



ఫస్ట్‌ఎయిడ్‌ బాక్సు ఉందా?
అత్యవసర పరిస్థితుల్లో.. సొంతంగా చికిత్స చేసుకునేందుకు ఇంట్లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు తప్పనిసరి. అందులో... ఈ వస్తువులు తప్పనిసరిగా ఉండాలి.
* దూది
* బ్యాండేజి

* బ్యాండెయిడ్‌ పట్టీలు

* వైద్యుల సలహాతో పారాసిటమాల్‌ వంటి మాత్రలు

* ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు

* గ్లూకోజ్‌ పొడి

* యాంటీసెప్టిక్‌ లోషన్‌
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top