కన్నీటి విలువను పెంచే ‘సీరియల్స్’

సీరియల్ చూసినా ఏమున్నది స్టోరీ, సమస్త సీరియళ్ళూ పగలు - ప్రతీకారాల మయం’ అన్నది నేటి ప్రేక్షకుల ఉవాచ. ‘ఆడదానికి ఆడదే శత్రువు’ అన్నది నేటి సీరియల్స్ నిర్మాణ సూత్రం. అందుకే మొదటి ఎపిసోడ్ మొదలుకొని అంతం ఎప్పుడో తెలియని ఆఖరి ఎపిసోడ్ వరకు స్ర్తి పాత్రలు రగిలిపోతూ.. కాలిపోతూ ఉండడం జరుగుతుంది.
వెండితెరకు అచ్చిరాని లేడీ విలన్లు బుల్లితెరకు మాత్రం మాంఛి క్రేజ్‌ని తెచ్చిపెడుతున్నారు. మానవతా విలువలు ఎన్నో ఉన్నా వాటన్నింటికీ స్థానమిచ్చి అనైతిక విలువలకు పెద్దపీట వేయడం సీరియల్ నిర్మాతలు - దర్శకుల ప్రతిభకు నిదర్శనం. పెట్టుబడులు రెట్టింపుగా రాబట్టుకోవాలంటే ఆడవాళ్లు ఆగ్రహంతో ఊగిపోవాలి... ఆడవాళ్లు ఏరులు పారేలా ఏడ్వాలి. అప్పుడే రేటింగ్స్ పెరుగుతాయనేది ఓ అంచనా. ఈ అంచనాలు బోల్తాపడి పైలెట్ ఎపిసోడ్స్ పూర్తి కాకుండానే దుకాణం సర్దేసిన సీరియళ్లూ ఉన్నాయి.


డజన్ల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు పుట్టుకొస్తున్న తరుణంలో తరుణీమణులను ఆకట్టుకోవడానికి సరైన ఆయుధం సీరియల్ ఒక్కటే. అందుకే వెన్న పూసిన కత్తిలాంటి టైటిల్స్ పెట్టి సీరియల్‌ని రంగప్రవేశం చేయిస్తున్నారు. ఒక ఛానల్‌లో ప్రసారం కాబోయే సీరియల్‌కి మరో ఛానల్‌లో విపరీత ప్రచారాలు చేస్తూ మహిళలను మొదటి ఎపిసోడ్‌కి ఆహ్వానిస్తున్నారు. వచ్చాక బాగోదు కనుక ఓ వారమైనా దానిని ఫాలో అవ్వడం కామన్. ఈలోపే వారిని కట్టిపడేసేలా కథ-కథనం ఉండాలి.
 

వస్త్రాలు, ఆభరణాలు ఇష్టపడని మగువలుంటారా? అందుకే పట్టుచీరలు - బంగారు బిళ్లలు సీరియల్‌కి జత చేసి మరింతగా ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి ఛానల్స్. ఒక్కసారి అలవాటుపడితే అంతే సంగతి కదా! ఇంత చేసినా లాభం లేక త్వరగానే ముగిసిపోయిన సీరియల్స్ కూడా ఉన్నాయి. అంటే కానుకల మీద చూపిన శ్రద్ధ కథ మీద పెట్టలేదన్న మాట. సొంతంగా నిర్మాణం చేపట్టే ఛానల్స్ ఖర్చును అదుపులో పెట్టుకుని లాగించేస్తుంటే సీరియల్ నిర్మాణమే పరమావధిగా చేపట్టే సంస్థలు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్‌గా తీసి జయాపజయాలను మూట కట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సీరియల్స్ ఫారిన్ లొకేషన్‌కి కూడా పోతున్నాయంటేనే దాని ప్రభావం ఏమిటో ప్రేక్షకులకే తెలియాలి.
 

సినిమా నిర్మాణ సంస్థలు.. ప్రముఖ దర్శకులు.. ప్రముఖ ఆర్టిస్టులు ఇలా ఎందరో బుల్లితెరపైకి వచ్చేస్తున్నారు. వెండి తెర దానంతట అదే వదిలేస్తుంది. మరి బుల్లితెరను వారే వదిలించుకోవాలి. అంతటి పవర్ బుల్లితెరకు ఉంది. సీరియల్స్‌లో నటిస్తూ అవకాశాలను అంది పుచ్చుకుని నిర్మాతలుగా మారిన నటీనటులు.. టెక్నీషియన్లు కూడా ఉన్నారు.
 

సీరియల్స్‌కి ప్రధాన పెట్టుబడి ‘కన్నీరు’. మొదట్లో అది రావడానికి ఆర్టిస్ట్‌కి గ్లిజరిన్ అవసరం కావచ్చు. కాని రోజూ అదే పనిగా కన్నీరు కార్చాలన్నది సీరియల్ నియమంగా ఉండటంతో గ్లిజరిన్ అవసరం లేకుండానే జలజలా కార్చడం అలవర్చుకుంటున్నారు. పేరుకే 30 నిమిషాల నిడివి ఎపిసోడ్‌గా వున్నా దానిలో కనిపించే సరుకు 18-20 నిమిషాలు మాత్రమే. దానిలో కూడా రిపీట్‌గా ఎడిటింగ్ చేసే క్లోజప్ షాట్స్ ఎక్కువ. రోజుకి రెండు పేజీల డైలాగ్స్ కూడా ఎక్కువే. ప్రతిరోజు పగ.. ప్రతీకారం.. కన్నీళ్లు ఇవే తప్ప ఒక్కరోజూ ప్రశాంతంగా ఉండే ఎపిసోడ్ మచ్చుకైనా కనిపించదనేది నగ్నసత్యం.


సీరియల్స్‌తో బుల్లితెరను ఏలుతున్న వారు కనిపెట్టిన ఏకైక టెక్నిక్ మానవ సంబంధాలలో ‘నెగెటివ్ రిలేషన్స్’. ఇదే అన్ని సీరియల్స్‌కి ముడి సరుకు. కోడలిని రాచి రంపాన పెట్టే అత్త, కన్నకూతురిని హింసించే తల్లి, చెల్లిని కాల్చుకు తినే అక్కగారు, భర్తను వేధించే భార్య ఇలా ఎన్నో కథనాలలు ప్రధానాంశంగా ఆడదాన్ని విలన్‌ని చేస్తూ చూపిస్తుంటే ఆ ఆడవాళ్లే మహా ముచ్చటపడుతూ చూడటం విశేషం.
 

సమాచార చట్టం.. గృహహింస చట్టం ఇలా ఎన్నో విషయాలు ఆడవారి స్వేచ్ఛకు, ఉన్నతికి సోపానాలుగా ఉంటే వాటన్నింటిని తుంగలో తొక్కేసే సీరియల్ కథనాలు ఆడవారికి నచ్చడం విడ్డూరం. వాటిని నెత్తిన పెట్టుకుని పనులను పక్కన పడేసి, అతిథులను లెక్కచేయకుండా టీవీలనే అతుక్కుపోయి జీవించడం మహా దారుణం. ఈ తరహా అంశాలపై కార్టూన్లు కోకొల్లలుగా వచ్చినా ఆడవాళ్లకు సీరియల్స్ కాలక్షేపంగా కనిపించినా లోలోపల ఎన్నో మానసిక, శారీరక రుగ్మతలకు కారణవౌతాయని గ్రహించరు.
 

చారిత్రాత్మక, భక్తి.. హాస్య సీరియల్స్‌కి లభించే చోటు, సమయం ఏమిటో తెలియంది కాదు. ఈ మధ్యకాలంలో వీటి విలువను కూడా ప్రేక్షకులు గమనిస్తున్నారు. ఏదేమైనా ఆడవారి కన్నీటికి వున్న విలువను ఒకనాడు వెండితెర కాసులను పోగేసుకుంటే నేడు బుల్లితెర చక్కగా క్యాష్ చేసుకుంటోంది. మానవ సంబంధాలలో నిత్యం కనిపించే భావోద్వేగాలను వేలాది ఎపిసోడ్స్‌గా బుల్లితెరపై చూసుకోవడం మహిళలకే కాదు వారితోపాటు పయనించే మగవారికి కూడా క్రమక్రమంగా అలవాటై పోవడం కొసమెరుపు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top