డయాబెటిస్ కారణంగా చర్మానికి వచ్చే సమస్యలు

డయాబెటిస్ అంటే...
మన రోజువారీ పనులకు శక్తి కావాలి. మనకు అవసరమైనప్పుడు ఆ శక్తి ఆహారం ద్వారా వస్తుంది. శరీరానికి శక్తి అవసరం అయినప్పుడు అది చక్కెర రూపంలో రక్తంలోకి వెలువడుతుంది. మనకు శక్తి అవసరం లేనప్పుడు మనం తీసుకున్న ఆహారం కాలేయంలోనూ, కండరాల్లో, కొవ్వుల రూపంలో నిల్వ ఉంటుంది. మనకు అవసరం లేని సమయాల్లో ఇలా వెలువడే చక్కెరను నియంత్రించడానికి ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ అవసరం. ఈ హార్మోన్ లోపించడం వల్ల వచ్చేదే డయాబెటిస్. అసలు ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం వల్ల వచ్చేది టైప్-1 డయాబెటిస్ వ్యాధి కాగా... ఇన్సులిన్ ఉత్పత్తి క్రమంగా మందగించడం వల్ల వచ్చేది టైప్-2 డయాబెటిస్. ఇటీవల మన దేశంలో టైప్-2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టైప్-1లో ఇన్సులిన్ ఇంజెక్షన్లతోనే చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే టైప్-2లో మలిదశలో ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరమైనా తొలి దశల్లో దీన్ని మందులతో నియంత్రణలో ఉంచవచ్చు. 

డయాబెటిస్‌తో సాధారణ దుష్ర్పభాలివే...
రక్తంలో చక్కెర పాళ్లు ఎక్కువకాలం ఉంటే అది శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతినవచ్చు. అది కళ్లపై చూపే దుష్ర్పభావం వల్ల రెటినోపతి అనే కంటి వ్యాధి రావచ్చు. అది అంధత్వానికి దారితీయవచ్చు. మూత్రపిండాలపై దుష్ర్పభావం చూపడం వల్ల నెఫ్రోపతి అనే కండిషన్‌కు దారతీయవచ్చు. నరాలపై డయాబెటిస్ ప్రభావం వల్ల న్యూరోపతి అనే సమస్యలు వచ్చి తిమ్మిర్లు, మంటలు రావచ్చు. సాధారణంగా ఇది తొలుత చర్మంపై వచ్చే సమస్యలాగా అనిపించినా, అది నరాలకు సంబంధించిన రుగ్మత. కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు పెరిగి రక్తనాళాలు దెబ్బతిని మెదడుకు రక్తం చేరకపోతే పక్షవాతం వంటివీ రావచ్చు. దీర్ఘకాలంగా గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండెపోటు వచ్చి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.  

చర్మంలో మార్పులూ డయాబెటిస్‌కు సూచనలే...
అన్ని అవయవాలలాగే చక్కెర వ్యాధి చర్మంపై కూడా తన ప్రభావం చూపిస్తుంది. విపరీతమైన ఆకలి, అతిగా దాహం కావడం చాలామంది డయాబెటిస్ లక్షణాలుగా భావిస్తారు. అయితే సాధారణంగా ఎక్కువగా ఉండే ఆకలిని, అతి దాహాన్ని డయాబెటిస్‌కు సూచనగా గుర్తించడంలో చాలామంది విఫలమవుతారు. అయితే చర్మం కూడా డయాబెటిస్‌కు ఒక సూచన. సాధారణంగా చర్మంలో కనిపించే మార్పులతోనూ డయాబెటిస్‌ను గుర్తుపట్టవచ్చు.

చర్మంపై చూపే దుష్ర్పభావాలివే... చర్మంపై చక్కెర చూపే దుష్ర్పభావాలు రెండు రకాలుగా ఉంటాయి.
మొదటిది :
  చాలామంది మధ్యవయస్కులై, బరువు ఎక్కువగా ఉన్నవారిలో... మెడపై ఉండే చర్మం దళసరిగా మారుతుంది. అది మందం పెరగడమే కాకుండా నల్లగా కూడా అవుతుంది. దీన్నే వైద్యపరిభాషలో ‘అకాంథోసిస్ నెగ్రికాన్స్’ అంటారు. 

చాలామంది ఇలా చర్మం నల్లబారడాన్ని బంగారు ఆభరణాలు వేసుకోవడం కారణంగా వచ్చే అలర్జీగా భావిస్తుంటారు. బంగారు ఆభరణాలు ఒరుసుకుపోవడం వల్లనో, ఎండకు అతిగా ఎక్స్‌పోజ్ కావడం వల్లనో అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి ఇలాంటి చాలా సందర్భాలలో అది షుగర్ వల్ల కావచ్చునేమో అని అనుమానించాలి.

ఇక మరికొందరిలో చర్మంపై పులిపిరి కాయల వంటివి కనిపిస్తాయి. చాలామంది వాటిని పులిపిరులుగానే పరిగణిస్తుంటారు. ఒకేచోట ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో కనిపించవచ్చు. యుక్తవయస్కుల్లో ఇవి కనిపించినప్పుడు వాటిని పులిపిరికాయలుగా భావించి నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి చర్మవ్యాధి నిపుణులకు చూపించడం, చక్కెర పరీక్ష చేయించుకోవడం అవసరం.

రెండో రకం :
  చక్కెరవ్యాధి వల్ల రక్తనాళాల్లో ప్రమాదకరమైన ప్రోటీన్లు క్రమంగా పోగుపడి రక్తనాళాల చివరలు మందమై చర్మం చివరల్లో పుండుగా మారవచ్చు. సాధారణంగా పాదాలకు ఈ పుండ్లు ఎక్కువగా పడుతుంటాయి. ఈ పుండ్లు క్రమంగా తీవ్రమై క్రమంగా గ్యాంగ్రీన్‌గా మారవచ్చు. దాంతో ఒక్కోసారి ఆ పుండు తీవ్రమైతే కాలినే తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.

ఇతర ఇన్ఫెక్షన్స్ : 
డయాబెటిస్ కారణంగా చర్మంపై ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ మామూలు వ్యక్తులో కూడా కనిపించినా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో రోగనిరోధరక శక్తి తగ్గడం, చక్కెరపాళ్లు వల్ల ఇవి ఎక్కువగా కనిపించవచ్చు. అవి... 
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ :
  స్ట్రెప్టోకాక్సి, స్లెఫాలోకాక్సి వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చర్మంపై గడ్డలు, ఇతర ఇన్ఫెక్షన్స్ రావచ్చు. చాలా అరుదుగా సీడోమొనాస్ అనే బ్యాక్టీరియా చెవిలోకి వెళ్లి మాలిగ్నెంట్ ఒటైటిస్ ఎక్స్‌టెర్నా అనే ప్రమాదకరమైన కండిషన్‌కు దారితీయవచ్చు.

ఫంగల్ ఇన్ఫెక్షన్స్:
  చాలామందిలో మర్మావయవ ప్రాంతాల్లో, కాలివేళ్ల మధ్యన క్యాండియా అనే ఫంగస్ వల్ల దురదలు రావచ్చు. చక్కెర వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య తరచూ వస్తుంది. చాలామందిలో కాలి గోళ్లు, ముఖ్యంగా బొటనవేలి గోరు రంగు కోల్పోయి మందంగా మారుతుంది. చాలా అరుదుగానే అయినా కొంతమందిలో చక్కెర అదుపులో లేకుండా పోయి రక్తంలో మలినాలు పేరుకుపోయే కండిషన్ (కీటోఅసిడోసిస్) రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో రైనోసెరెబ్రల్ మ్యూకార్ మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ముక్కులో మొదలైవేగంగా మెదడుకి వ్యాపించి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.

ఒంటిపై దురదలు :
 చక్కెర పాళ్లు పెరగడం అన్నది నేరుగా దురదను కల్పించకోయినా... పెద్ద వయసువాళ్లలో చక్కెర ఉన్నప్పుడు దురదలు రావడం మామూలే. వయసు పైబడటం, కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడానికి మందులు వాడుతున్నందున చర్మం పొడిబారిపోవడం కూడా చర్మం దురదలకు కారణం. చక్కెర కారణంగా మూత్రపిండాల వ్యాధి మలిదశలో బాగా ముదిరినప్పుడు కూడా ఇలా ఒంటిపై విపరీతమైన దురదలు రావచ్చు.

స్పర్శజ్ఞానంలో మార్పులు : 
చక్కెర వ్యాధి వల్ల చర్మం చివర్లలో రక్తప్రసరణ సరిగా కాకపోవడం వల్ల ఒక్కోసారి స్పర్శలో మార్పులు కూడా సంభవించవచ్చు.

మిగతా అవయవాలన్నిటితోపాటు చర్మంపై కూడా చక్కెర దుష్ర్పభావం తగ్గించాలంటే మొదట చేయాల్సింది దాన్ని నియంత్రించుకోవడమే.
చర్మంపై మార్పులను గుర్తించినప్పుడు...
చర్మంపై దళసరి నల్ల మచ్చలు కనిపించడం, చర్మం బాగా ముడుచుకుపోయినట్లుగా ఉండే పులిపిరి కాయల్లాంటివి కనిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. రక్తంలో చక్కెరను నియంత్రించే ఇన్సులిన్ సక్రమంగా పనిచేయడం లేదనడానికి ఇది ఓ సూచనగా పరిగణించాలి. ఇలా చర్మం మందంగా మారుతున్నప్పుడు అది రక్తంలో పెరుగుతున్న చక్కెర పాళ్లకు ఒక సూచనగా భావించి వెంటనే పరీక్షలు చేయించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top