రక్తహీనత సమస్యలు యోగతో ఉఫ్‌

మహిళల్లో సాధారణంగా తలెత్తే సమస్య రక్తహీనత. దీనివల్ల వెన్నునొప్పి, నిస్సత్తువ, తలతిరగడం వంటి అనేక ఇబ్బందులు. వీటి నుంచి ఉపశమనం పొందడం, రక్తవృద్ధికి తోడ్పడటమే లక్ష్యంగా కొన్ని ఆసనాలు. ఈ ఆసనాలతో పాటూ చక్కని పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి.
పశ్చిమోత్తాసనం


పశ్చిమం అంటే వీపు. తాన అంటే లాగుట అని అర్థం. వీపుని లాగి ఉంచే ఆసనం కాబట్టి దీనిని పశ్చిమోత్తాసనం అంటారు. కూర్చుని రెండు కాళ్లు ముందుకు చాచి ఉంచాలి. తర్వాత రెండు చేతులు పైకిపెట్టి మెల్లగా శ్వాస వదులుతూ ముందుకు వంగి కాలి వేళ్లను తాకిస్తూ తలని కిందకి పెట్టాలి. కాలి వేళ్లను పట్టుకొని తలని సాధ్యమైనంత వరకు మోకాళకి తాకించడానికి ప్రయత్నించాలి. అలా ఎంత సేపు ఉండగలిగితే అంత సేపు ఉండి.. మెల్లగా శ్వాస తీసుకొంటూ యథాస్థితికి రావాలి. ఇలా రెండు మూడు సార్లు చెయ్యాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక చురుగ్గా ఉంటుంది. ఇది కఠినమైన ఆసనం కనుక ఎక్కువ పొట్ట ఉన్నవాళ్లు, అధిక బరువు, వెన్నెముక సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా
సాధన చెయ్యాలి. ఈ ఆసనం నిత్యం సాధన చేస్తూ మంచి ఆహారం తీసుకొంటే రక్తహీన తతో తలెత్తే సమస్యలు తగ్గుతాయి. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌, వెన్నెముక జారిన వాళ్లు దీనిని చెయ్యకూడదు. 
వృక్షాసనం


ఇది నిలబడి చేసే ఆసనం. ముందుగా కుడి పాదాన్ని రెండు చేతుల సాయంతో ఎడమ తొడమీద పెట్టాలి. తర్వాత జాగ్రత్తగా నిలబడుతూ రెండు చేతులను పైకిపెట్టి నమస్కార ముద్రలో ఉంచాలి. శ్వాస సాధారణంగా తీసుకోవాలి. కళ్లు మూసుకొని ఉండాలి. కొత్తగా చేసేవారు దృష్టిని నాసికాగ్రంపై నిలపాలి. పది నుంచి ఇరవై సెకన్లు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి. తిరిగి ఇదే విధంగా ఎడమకాలితో కూడా చెయ్యాలి. ఈ ఆసనం చెయ్యడం వల్ల పాదాలు బలపడతాయి. రక్తహీనత తగ్గి.. శరీరం ధృడంగా అవుతుంది.
 
కపోతాసనం


ముందుగా వజ్రాసనంలో కూర్చొని.. కుడికాలిని వెనక్కి తిప్పిపెట్టి.. రెండు చేతులు ఎడమ మోకాలికి ఇరువైపులా పెట్టాలి. కుడి కాలి మోకాలు వెనక్కి వంచి, మెడపైకి పెట్టి తల పైకి చూస్తూ ఉండాలి. ఇలా పదిసెకన్లు ఉన్న తర్వాత మెల్లగా వజ్రాసనంలోకి రావాలి. తిరిగి అదే విధంగా ఎడమ కాలితో కూడా చెయ్యాలి. ఈ ఆసనం వల్ల.. రక్తం వృద్ధి చెందుతుంది. నిస్సత్తువ తగ్గి రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు.
 
వజ్రముద్ర


సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చుని బొటన వేలిని మధ్య వేలి గోరుదగ్గర పెట్టాలి. ఉంగరం వేలు చిటికెన వేలు మడిచి మధ్యవేలి పక్కన పెట్టాలి. చూపుడు వేలు ముందుకు చాచి ఉంచాలి. దీనిని రెండు చేతులతోనూ ధరించాలి. ఐదునిమిషాల చొప్పున రోజులో మూడుసార్లు ధరిస్తే మంచిది. కొంచెం సేపు పనిచేయగానే అలసిపోయేవారికి ఈ ముద్ర ఒక వరం. క్లోమగ్రంధిలోని లోపాల్ని ఇది సరిచేస్తుంది. కణాలు చురుగ్గా మారతాయి. మలినాలు పోయి.. రక్తం శుద్ధి అవుతుంది. రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది.
 
ధనురాసనం


బోర్లాపడుకొని.. రెండు కాళ్లు వెనక్కి మడిచి రెండు చేతులతో.. అంటే కుడిచేత్తో కుడి మడమని ఎడమ చేత్తో ఎడమ మడమని పట్టుకొని కాళ్లను కొంచెంగా పైకి లేపుతూ తలెత్తి పైకి చూడాలి. ఇలా చేయడం వల్ల శరీరం అంతా కూడా పొట్ట మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆసనంలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా కాళ్లను వదిలి ఉపశమనం పొందాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి. ఈ ఆసనం చెయ్యడం వల్ల శరీరానికి కొత్త శక్తి వస్తుంది. రక్తహీనత తగ్గుతుంది.
 
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top