మెనోపాజ్‌ సమస్యల నుంచి బయటపడటానికి యోగాలోని మార్గాలు

మెనోపాజ్‌.. కుంగదీసే భావోద్వేగాలు. వూహించని శారీరక మార్పులు. రకరకాల భయాలు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి యోగాలోని మార్గాలు.
కపాలభాతి



వజ్రాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచి గాలిని ముక్కుతో వేగంగా వదలాలి. పొట్ట లోపలికి లాగాలి. గాలిని బయటకు వదలాలి. ఇలా రోజుకు ఐదు నుంచి పది నిమిషాలు చెయ్యాలి. అయితే హెర్నియా సమస్య ఉన్నవాళ్లు కపాలభాతి చెయ్యకూడదు. దీనివల్ల శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ సమృద్ధిగా అందుతుంది. మెనోపాజ్‌లో వచ్చే భావోద్వేగాలు చాలామట్టుకు తగ్గుతాయి.
మహాస్వాధీష్ఠాన ముద్ర



సుఖాసనంలో కూర్చుని రెండు చేతుల ఉంగరం వేళ్లను బొటన వేలితో కలపాలి. తర్వాత రెండు చేతుల చిటికెన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచాలి. తక్కిన వేళ్లను పైకి నిదానంగా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్లు మూసుకొని, గాలిని లోపలికి తీసుకొని మెల్లగా వదలాలి. ఇలా పన్నెండు సార్లు చెయ్యాలి. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మూడు సార్లు ఇలా చెయ్యాలి. మెనోపాజ్‌ దశలో, నెలసరి సమయంలో దీనిని చేయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. హార్మోన్‌ల కారణంగా తలెత్తే భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి.
చక్రాసనం 






రెండు కాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి. తరవాత కుడి కాలి పాదాన్ని ఎడమ మోకాలి పక్కన పెట్టాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. కుడిచేతిని వెనక్కి పెట్టుకొని ఉంచాలి. ఎడమచేత్తో కుడి మోకాలిని పొట్టవైపు ఒత్తి పట్టుకోవాలి. శ్వాస వదులుతూ తలను భుజాలని నడుం కుడివైపునకి వెనక్కి తిప్పాలి. తిప్పిన తర్వాత నాలుగు నుంచి ఆరుసార్లు శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలాలి. తర్వాత.. శ్వాస తీసుకొంటూసమస్థితికి రావాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి. ఇదే విధంగా ఎడమవైపు కూడా చెయ్యాలి. మెనోపాజ్‌ సమస్యలకి ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది.
కమరచక్రాసనం 



కూర్చుని రెండు కాళ్లు దూరంగా పెట్టి... కుడిచేత్తో ఎడమ పాదాన్ని ఎడమ చేత్తో కుడిపాదాన్ని పట్టుకోవాలి. ఇలా మార్చిమార్చి చెయ్యాలి. ఇలా ఇరవై నుంచి నలభైసార్లు చెయ్యవచ్చు. దీనివల్ల పొట్ట, నడుం దగ్గర ఉండే అధిక కొవ్వు తగ్గడమే కాకుండా మెనోపాజ్‌ దశలో ఉండే సమస్యలు తగ్గుముఖం పడతాయి.
షుప్త గోరక్షాసనం 



వెల్లకిలా పడుకొని రెండు కాళ్లు మడిచి రెండు చేతులతో రెండు పాదాలని దగ్గరకు పెట్టి... తలని భుజాలని పైకి లేపి రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకోవాలి. శరీర బరువంతా నడుము మీద ఉంటుంది. చేతులు వంచకూడదు. మోచేతులు నిటారుగా ఉంచాలి. ఇలా పది నుంచి ఇరవై సెకన్ల వరకు ఉండాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస పీల్చుకొంటూ తలని కాళ్లని కింద పెట్టాలి. ఇలా ఐదు నుంచి ఆరు సార్లు చెయ్యాలి. మెడ నొప్పి ఉన్నవాళ్లు తలని పైకి లేపకూడదు. ఆ ఆసనంతో గుండెకు రక్త సరఫరా బాగుంటుంది. ఇది అండాశయాలను, గర్భాశయాన్ని ధృడంగా చేస్తుంది.      
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top