నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే...?

బలహీనంగా, నీరసంగా, డల్‌గా కనపడేందుకు కొన్ని కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది నిద్ర. పగలంతా పనిచేసి అలసిపోయిన మెదడు తన అలసటను, ఒత్తిడిని నిద్ర ద్వారా తీర్చుకుని, పూర్తిగా రీఛార్జ్ అయి, పొద్దున్న లేచేసరికి హుషారు కలిగిస్తుంది. చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. శరీరతత్వాన్ని బట్టి కొందరికి ఆరు గంటలు, ఇంకొందరికి ఏడు గంటలు, మరికొందరికి ఎనిమిది గంటలు నిద్ర అవసరమవుతుంది. కొందరికి మాత్రం నాలుగైదు గంటల నిద్ర సరిపోతుంది. ఎవరి అవసరాలను బట్టి వారికి తగినంత నిద్ర లేకపోతే మాత్రం హార్మోన్లు, మెదడులోని రసాయనాలు సరిగా విడుదల కాక రోజంతా నిస్సత్తువగా ఉంటుంది. శక్తినంతా ఎవరో హరించినట్లు నీరసంగా అనిపిస్తుంది. అందుకే నిద్రలేమిని దూరం చేసుకుని, కంటినిండా హాయిగా నిద్రపోవాలి. 

ఎక్సర్‌సైజ్, యాక్టివిటీ: 
డల్‌గా ఉండేవారు వ్యాయామం చేయడం, ఏదో ఒక వ్యాపకం కల్పించుకుని దానితో బిజీగా ఉండటం వల్ల ఒంటికి మేలుచేసే ఎండార్ఫిన్లు, థైరాయిడ్, గ్లైకోజెన్ తగిన మొత్తంలో విడుదలవుతాయి. ఫలితంగా చురుగ్గా ఉండగలుగుతారు. ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శరీరం తగినంత ఆక్సిజన్‌ను గ్రహించగలుగుతుంది. దానిమూలంగా అప్రమత్తత అలవడుతుంది. అందుకే ఏ పనీ లేకుండా ఉండేవారు బోర్‌గా ఉండి, తొందరగా అలసిపోతారు. ప్రతివారు రోజుకు కనీసం 45 నిమిషాల పాటైనా ఒళ్లు అలసిపోయేలా ఎక్సర్‌సైజ్ చేయాలి. ఇలా వారానికి కనీసం ఐదు రోజులపాటు ఎక్సర్‌సైజ్ చేయవలసి ఉంటుంది.

సమతుల ఆహారం:

వేళకు తగినంత తిండి తినగలిగితే శరీరానికి కావలసిన మొత్తంలో చక్కెర నిల్వలు విడుదలవుతాయి. రోజంతా పనిచేస్తాం. కానీ రోజులో మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే ఆహారం తీసుకుంటాం. అది కూడా శరీరానికి కావలసినంత లేకపోతే తొందరగా అలసట కలుగుతుంది.

నిద్ర లేవగానే వీలయినంత తొందరగా అంటే 7 నుంచి 8.30లోగా కార్బోహైడ్రేట్లు తదితర పోషకాలు ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. దానివల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది. శరీరానికి కావలసిన శక్తి వనరులు చేకూరి, అలసట లేకుండా హుషారుగా పని చేయగలుగుతుంది. పండ్లు, కూరలు, గింజధాన్యాలు తప్పక తీసుకోవాలి. మాంసాహారులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వేళప్రకారం తిండి, వేళప్రకారం నిద్ర ఉంటే ఎవరైనా సరే హుషారుగా ఉండగలుగుతారు. మీకు పుట్టుకతో వచ్చిన ఆహారపు అలవాట్లు పాటించడం మంచిది. ఎవరినో చూసి, వాటిని మార్చుకోనక్కరలేదు.  



ఆరోగ్యకరమైన అలవాట్లు: 
ఆల్కహాల్, స్మోకింగ్, మాదక ద్రవ్యాలు తదితరాలను తీసుకోవడం ఒక విధమైన మానసిక బలహీనత. వీటికి అలవాటు పడకుండా ఉంటే మనస్సును, శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవడం: బీపీ, షుగర్, ఆస్త్మా, టీబీ వంటి వాటి బారిన పడకుండా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మనస్సు, శరీరమూ కుంగిపోకుండా ఎల్లప్పుడూ చురుగ్గా ఉండేలా చూసుకోగలం.


ఆలోచన ధోరణి: 

కొంతమంది ఏ కారణమూ లేకపోయినా డల్‌గా ఉంటారు. ఈ ధోరణిని మార్చుకోవాలి. చిన్నచిన్న విషయాలకు బెంగపడకుండా, అన్నింటికీ ఆందోళన చెందకుండా... నాకేమీ కాదు, నాకేజబ్బూ లేదు అనుకోవడం వల్ల కూడా చురుగ్గా ఉండగలగడం సాధ్యమవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top