వర్షాలతో పాటు వచ్చే వ్యాధులు - నివారణ

ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి. కొద్దిరోజుల్లో వర్షాలు పడనున్నాయనే వార్తలు అందరికీ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో వర్షాలతో పాటు వచ్చే వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు వర్షాలు పడితే చాలు అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతాయి. దోమలు విజృంభిస్తే జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు పరుగెత్తాల్సి వస్తుంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
వాతావరణ మార్పుల వల్ల ఎన్నో వ్యాధులు సంక్రమిస్తుంటాయి. వర్షాకాలంలో తాగునీరు కలుషితం అవుతుంది. దోమలు విజృంభిస్తాయి. దీనివల్ల డెంగ్యూలాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు తొందరగా అంటువ్యాధులు, విషజ్వరాల బారినపడుతుంటారు. వర్షాకాలంలో ఎక్కువగా అతిసార, డెంగ్యూ, మలేరియా, జపనీస్ ఎన్‌కెఫలైటిస్, జాండిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చిన్న పిల్లలు న్యుమోనియా, బ్రాంకైటిస్ బారినపడుతుంటారు.

చెవిలో ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణిలు, వయసు పైబడిన వారు అతిసారం బారినపడితే తొందరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. రెండు రోజులకు మించి జ్వరం, వాంతులు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ని కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

అతిసారం
కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల అతిసారం వ్యాపిస్తుంది. జ్వరం, విరేచనాలు, కడుపునొప్పి, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు అతిసారం సోకినపుడు కనిపిస్తాయి. తగిన చికిత్స సమయంలో అందించకపోతే మూత్రపిండాలు చెడిపోవడం కూడా జరుగుతుంది. డీహైడ్రేషన్ వల్ల మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి సమయంలో వీలైనంత త్వరగా డీహైడ్రేషన్‌కు లోనయిన వ్యక్తికి చికిత్స అందించాల్సి ఉంటుంది. కొబ్బరినీరు, ఎలక్ట్రాల్ పౌడర్, ఇన్‌ఫెక్షన్లు ఉంటే యాంటీబయోటిక్స్ వాడాల్సి వస్తుంది. సపోర్టివ్ కేర్ అందిస్తే త్వరగా కోలుకుంటారు.

డెంగ్యూ
ఈ వ్యాధి దోమ కాటు వల్ల వస్తుంది. ముఖ్యంగా పగటి పూట కుట్టే దోమల వల్ల డెంగ్యూ విస్తరిస్తుంది. జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు డెంగ్యూ బారిన పడిన వ్యక్తిలో ఉంటాయి. రెండు మూడు రోజుల తరువాత శరీరంపైన రాషెస్ కనిపిస్తాయి. మూడునాలుగు రోజుల తరువాత ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. చికిత్స తీసుకోకపోతే జాండిస్, ఊపిరితిత్తులో ఇన్‌ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్, హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది.

డెంగ్యూ బారినపడిన వ్యక్తికి మొదట ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. ఈ వ్యాధి చికిత్సలో యాంటిబయోటిక్స్ పాత్ర ఎక్కువగా ఉండదు. 20 వేల కంటే తక్కువ స్థాయికి ప్లేట్‌లెట్స్ పడిపోయినపుడు ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. రక్తపోటు పడిపోతే వెంటిలేటర్ సపోర్టు అవసరం అవుతుంది. సపోర్టివ్ కేర్ ద్వారా రోగి కోలుకునేలా చేయవచ్చు. డెంగ్యూ బారిన పడి వ్యక్తికి ఇతర అవయవాలకు ఇన్‌ఫెక్షన్లు సోకనట్లయితే కోలుకున్న తరువాత ఐదారు రోజుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య దానంతట అదే సాధారణ స్థాయికి చేరుకుంటుంది.

మలేరియా
వర్షాకాలంలో ఎక్కువ మంది మలేరియా బారినపడుతుంటారు. ఇది కూడా దోమల వల్లనే వ్యాప్తి చెందుతుంది. జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. గ్రామాలలో చాలా మంది జ్వరం రాగానే పారసిటామల్ లాంటి మాత్రలు వేసుకుని తగ్గిపోతుందిలే అనుకుంటారు. కానీ మలేరియా జ్వరం సాధారణ మందులు వాడటం వల్ల తగ్గదు. యాంటీ మలేరియల్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుంది. జ్వరం విడవకుండా ఉన్నప్పుడు వెంటనే వైద్యున్ని కలిసి తగిన చికిత్స తీసుకుంటే పరిస్థితి విషమించకుండా ఉంటుంది.

జపనీస్ ఎన్‌కెఫలైటిస్
ఇది ఎక్కువగా పిల్లలలో వస్తుంది. ఇది కూడా దోమ కాటు వల్లనే సోకుతుంది. దీన్ని మెదడు వాపు వ్యాధి అని కూడా అంటారు. జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. సిట్ స్కాన్, సిఎస్ఎఫ్ అనాలసిస్ పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదు. సపోర్టివ్ కేర్ ద్వారానే వ్యాధిని తగ్గించాల్సి ఉంటుంది. ఒకవేళ మెదడు వాపు ఎక్కువైతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

నివారణ
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈగలు వాలడానికి అవకాశం ఉన్న ప్రాంతాలలోని ఆహారం తినకూడదు. భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. జ్వరం వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. పిల్లలు వానలో తడవటం మూలంగా జలుబు తద్వారా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వర్షంలో తడవకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు మీ దరిచేరవు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top