స్విమ్మింగ్‌పూల్స్‌ వద్ద వచ్చే ఆరోగ్య సమస్యలు-జాగ్రత్తలు

ఈత డ్రస్సుతో ఇబ్బందులు :
ఒక్కోసారి నీటి వల్లనే గాక ఈత సమయంలో వేసుకునే దుస్తులతో కూడా అలర్జీ రావచ్చు. ఒంటికి పట్టినట్లుగా ఉండే ఈ డ్రస్ వల్ల, గాగుల్స్ వల్ల కూడా శరీరంపై అలర్జీలు రావచ్చు. అలాంటప్పుడు డ్రస్ వల్ల అలర్జీ వచ్చిందని గుర్తిస్తే దానికి పడని అలాస్టిక్ మెటీరియల్‌తో కాకుండా వేరేవి వాడటం వల్ల అలర్జీని నివారించవచ్చు.
స్విమ్మర్స్ షోల్డర్ : 

గడ్డం గీసుకోకుండా ఈదేవారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈత సమయంలో గరుకుగా ఉండే గడ్డం గీయని గదమ... భుజాలకు రాసుకోకుండా జాగ్రత్త పడాలి. ఒక్కోసారి అలా మాటిమాటికీ రాసుకుంటూ ఉండటం వల్ల నీళ్లలో తడిసి మృదువుగా మారిన భుజాల చర్మం గడ్డం వల్ల దోక్కుపోయి చర్మం ఎర్రబారుతుంది. దీనివల్ల భుజం మీద ర్యాష్ కూడా రావచ్చు. దీన్నే ‘స్విమ్మర్స్ షోల్డర్’ అంటారు.
కళ్లు జాగ్రత్త : 

ఈతకొలనులోని నీళ్లలో క్రిమిసంహారిణిగా పనిచేయడం కోసం క్లోరిన్ వంటి రసాయనాలు కలుపుతుంటారు. ఈ క్రిమిసంహార రసాయనాలు (డిస్ ఇన్ఫెక్షన్ బైప్రాడక్ట్స్ -డీబీపీ) కొందరి చర్మంపై దుష్ర్పభావం చూపేందుకు అవకాశం ఉంది. ఈ డీ బీపీ రసాయనాలు పెద్దల కంటే... చర్మం లేతగా ఉండే పిల్లలపై ఎక్కువగా దుష్ర్పభావాలు చూపే అవకాశం ఉంది.

ఈతకొట్టే సమయంలో చాలామంది మునిగి ఈత కొడుతూ నీళ్లలోపల కళ్లు తెరుస్తుంటారు. దీనివల్ల పెద్దగా సమస్య లేకపోయినా... ఒక్కోసారి నీళ్లను శుభ్రంగా ఉంచేందుకు వాడే క్లోరిన్ వంటి రసాయనాలు కళ్లలోకి వెళ్లడం వల్ల కళ్లు ఎర్రబారడం, కెమికల్ కంజక్టివైటిస్ వంటి కంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రసాయనాలు వాడిన నీళ్లలో ఈదులాడే సమయంలో ఆ నీళ్లు కంటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
లోదుస్తులు మార్చకపోతే : 

పల్లెల్లోని బావులు, చెరువుల్లో కేవలం అండర్‌వేర్‌తో ఈత కొట్టేవారు చాలా సందర్భాల్లో ఈత పూర్తయ్యాక వెంటనే లోదుస్తులు మార్చరు. అనుకోకుండా ఈతకు వెళ్ళడంవల్లనో లేదా మరే కారణాలవల్లనో లోదుస్తులు మార్చకపోవడం వల్ల పిరుదుల కింది భాగంలో గడ్డలు రావచ్చు. ఒక్కోసారి రోమాల మూలాల్లో పొక్కుల వంటివి కూడా రావచ్చు. అందువల్ల ఈత పూర్తికాగానే లోదుస్తులు మార్చుకుని వెంటనే పొడిబట్టతో శరీరభాగాలను శుభ్రం చేసుకోవాలి.


సముద్రపు నీటితో ఇబ్బందులు : 
తీరప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు ఈ సెలవుల్లో ప్రత్యేకంగా సముద్రస్నానం చేయడానికి వెళ్తుంటారు. సముద్రస్నానం తర్వాత మామూలు నీటితో విధిగా స్నానం చేయాలి. ‘సీ వీడ్స్’ వంటి వాటితో అలర్జీ రావచ్చు. లేదా కొన్ని రకాల జీవుల కాటు వల్ల గాయం అయ్యే అవకాశాలు ఉంటాయి. మరికొందరిలో అప్పటికే చర్మంపై గాయాలు ఉంటే వాటికి సముద్రపు ఉప్పు నీళ్లు తగలడం వల్ల అవి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.
ఇతర సమస్యలు ఇలా...
కొందరిలో నేరుగా ఈత వల్ల కాకుండా ఈతకు సంబంధం ఉండే ఇతర సమస్యలు కూడా రావచ్చు. ఎక్కువసేపు ఈదులాడిన తర్వాత మన చర్మంపై సహజంగా స్రవించే నూనె సీబమ్ కడుక్కుపోయి, చర్మం పొడిబారిపోతుంది.

ఒక్కోసారి నీళ్లలో ఎక్కువసేపు నానుతూ ఉండటం వల్ల శరీరంలోని లవణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు చర్మం ముడతలు పడిపోయే అవకాశాలు ఉండవచ్చు. దీన్ని నివారించాలంటే ఈత పూర్తయిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్లు రాయాలి.

కొంతమందిలో ఈత వల్ల సైనసైటిస్, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అలాంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించాలి. 


జాగ్రత్తలివి...
ఈతకు వెళ్లే సమయంలో కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలను నివారించవచ్చు. అవి...

స్విమ్మింగ్‌పూల్‌లోకి వెళ్లకముందు, స్విమ్మింగ్ పూర్తయ్యాక శుభ్రంగా తలస్నానం చేయాలి.

తల తడవకుండా క్యాప్ పెట్టుకోవాలి. అలాగే చెవుల్లోకి నీళ్లు పోకుండా ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి.

ఈతకొలను నీటిలో కలిపే క్లోరిన్ సరైన పాళ్లలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

ఈత సమయంలో శరీరానికి నేరుగా సూర్యకాంతి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.

సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యేవారు సన్‌స్క్రీన్‌లను విధిగా రాసుకోవాలి. 


 ఈత సమయంలో చెవుల జాగ్రత్త...
స్విమ్మింగ్‌పూల్స్‌లో ఈతకొట్టే సమయాల్లో కేవలం చర్మం విషయంలోనే కాదు... చెవుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు చెవుల్లోకి ప్రవేశించి చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి వీలైతే ఇయర్‌ప్లగ్స్ పెట్టుకోవాలి. చెవుల్లోకి నీరు చేరకుండా చూసుకుంటూ, ఈత పూర్తయ్యాక చెవులను పొడిబట్టతో శుభ్రం చేసుకోవాలి.
స్విమ్మింగ్‌పూల్స్ వద్ద వచ్చే ఆరోగ్య సమస్యలు :
ఫంగల్ ఇన్ఫెక్షన్స్: ఒక్కోసారి బట్టలు మార్చుకునే చోట్ల అపరిశుభ్రత వల్ల కూడా పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఒక్కోసారి వార్ట్స్ (పులిపిరికాయలు) వంటివి కూడా రావచ్చు. అందుకే ఆ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి.
వెంట్రుకలు రంగు కోల్పోవడం... 

నిత్యం స్విమ్మింగ్‌పూల్‌లోని నీటిలో ఈదులాడేవారి వెంట్రుకలు సహజరంగును కోల్పోయి పేలవంగా అయిపోయే అవకాశాలు ఎక్కువ. వెంట్రుకలను క్లోరిన్ రసాయనం బ్లీచ్ చేయడం వల్ల, ఎండ వల్ల ఇలా మారేందుకు అవకాశం ఎక్కువ.
మొటిమలు రావడం : 

ఈత కొట్టే వారిలో చాలామందికి మొటిమలు కూడా రావచ్చు. ఈ మొటిమలను ఆక్వాజనిక్ యాక్నే అంటారు. 

 కురుపులు రావడం : 
కొన్నిసార్లు ఈత తర్వాత చర్మంపై చిన్న చిన్న గుల్లలు, కురుపులు రావడం మామూలే. కొన్ని సందర్భాల్లో అవి ముదిరి చీము పట్టే అవకాశాలు కూడా ఎక్కువే. సూడోమొనాస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ గుల్లలు, కురుపులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, క్లోరిన్ ఎక్కువగా వేసినప్పటికీ ఈరకం బ్యాక్టీరియాను నిర్మూలించడం సాధ్యం కాదు. ఈ సమస్య వల్ల గుల్లలు, కురుపులు వస్తే డాక్టర్‌ను సంప్రదించి తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స తీసుకోవాలి.
శ్వాసకోశ సమస్యలు : 

 ఈతకొలను వల్ల అలర్జీ రావడం చాలామందిలో సాధారణంగా కనిపించే అంశం. ఈ అలర్జీ వల్ల కొందరిలో బ్రాంకైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులు సైతం తలెత్తే అవకాశం ఉంది. అలాంటివారు డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top