ఈటీవీలో ప్రసారమవుతున్న ‘అభిమాని’ - కత్తిలాంటి గేమ్ షో - విశ్లేషణ


అతివృష్టి - అనావృష్టి అనే పదాలకి కొన్ని కొన్ని సందర్భాలలో టీవీ కార్యక్రమాల విషయంలో సమాధానాలు దొరుకుతున్నాయి. కొన్ని ప్రోగ్రామ్‌లు సమాచార లేమివల్ల తాము పాల్గొన్నవి సైతం చూడడానికి నోచుకోలేదని ప్రముఖుల అభిప్రాయం వెలిబుచ్చిన సందర్భాలూ ఈ మధ్య చూశాం. ఇంకొన్ని విషయాల్లో ఫలానా ప్రోగ్రాం ఇప్పుడొస్తుంది అని సమాచారం ప్రచార మాధ్యమాల్లో విరివిగా అందివ్వడమే కాకుండా, ప్రత్యేకంగా సదరు కార్యక్రమానికి కర్టెన్ రైజర్ అంటూ అందులోని విశేషాంశాలను ప్రముఖంగా పేర్కొనడం జరుగుతోంది. అలా ఈ మధ్యకాలంలో గణనీయ స్థాయి ప్రచారాన్ని కల్పించిన ‘అభిమాని’ (ఈటీవీలో ప్రతి మంగళవారం రాత్రి 9.30కి ప్రసారమవుతోంది) కార్యక్రమం మార్చి 29న ఆరంభమైంది. ఈ ప్రోగ్రామ్‌కు ఉపనామంగా ‘కత్తిలాంటి గేమ్ షో..’ అని పెట్టడంలో ఇటీవలి కాలంలో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్న గేమ్ షో తత్వం కూడా దీనిలో ఉందని నిర్వాహకులు చెప్పకనే చెపుతున్నారు.
 

ఓ మనిషిని మరో వ్యక్తి అభిమానించడం అనే విషయం ఎప్పుడు జరుగుతుంది? ఆ వ్యక్తిలో మనకు నచ్చే అంశాలూ, ఆకర్షణీయ పరిస్థితులూ ఉన్నప్పుడే జరుగుతుంది. మిగతా స్థాయి వ్యక్తిగత అభిమానాలు ఎవరికి వారి పర్సనల్ స్థాయిల్లో ఉన్న ఓ సినీ వ్యక్తిని ఆ కోణంలో అభిమానించే వారికి సంబంధించి ఎక్కువగా బహిరంగంగానే వ్యక్తమవుతూంటాయి. అలా అభిమానించే వ్యక్తుల్నీ, వారితో నిస్వార్థ అభిమాన సంపదని తన పరం చేసుకున్నా అదృష్టవంతుణ్ణీ ఒక వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం ఇది.. అని ప్రారంభంలో వివరించారు. ఆ క్రమంలో తొలి భాగంలో కోట్లాది మంది అభిమానాన్ని పొందిన అదృష్టవంతుడుగా నటుడు ఎన్టీఆర్ వచ్చారు. నిర్ణీత వడపోతల అనంతరం ఎంపిక చేసిన అభిమానులకు ఏర్పరచిన రౌండ్ల ప్రకారం పోటీలో విజేతగా నిల్చిన వ్యక్తి తామెంతగానో అభిమానించే నటుని ద్వారా బహుమతి పొందడం జరుగుతుంది.

సన్నిహిత పరిశీలన.. ఇందులో పాల్గొనే అభిమానులు ఈ ప్రోగ్రామ్ కోసం ఎంతో కసరత్తు చేసినట్లు స్పష్టమవుతోంది. సాధారణంగానే ఇలాంటి గేమ్ షోల్లో పాల్గొనే అయిడియా కానీ, అవకాశం ఉంటుందని కానీ ఊహించని రోజుల్లోనే తాము అభిమానించే నటుని చిత్ర విషయాలు అంటే ఆ చిత్ర నాయిక, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, తదితర సాంకేతిక సభ్యుల నామ వివరాలతోపాటు విడుదల తేదీని సైతం కంఠతా పట్టేయడం జరుగుతూ వుండేది. ఇప్పుడు అలాంటి వివరాల వ్యక్తీకరణకు ఈ షో ద్వారా పెద్ద వేదిక దొరికింది. ఇది ఎంతవరకూ ఎవరికి ప్రయోజనకారి? అన్న పెద్దపెద్ద చర్చలు వద్దు. అయితే ఇలాంటి వాటివల్ల ఈ తరహా ఎక్సర్‌సైజ్ పెరుగుతుందని మాత్రం గట్టిగా చెప్పచ్చు. ‘కొంచెం తేడా..’ రౌండ్‌లో వివిధ రకాల ఎన్టీఆర్ ఫొటోలు చూపి అందులో వున్న తేడాల్ని చెప్పండని అడగడం జరిగింది. అలాగే మరో రౌండ్‌లో ఎన్టీఆర్‌కు చెందిన ప్రశ్నలూ, ఇంకో దాంట్లో ఆ నటుడికి చెందిన వివిధ అంశాలు రెండు విభాగాలుగా ఇచ్చి జత చేయండని ప్రశ్నించడం, మరోటి ‘టైటిల్ కొట్టు గురూ..’ అంటూ ఉంది. విభాగమేదైనా పాల్గొన్న నటుడి గురించి పలు కోణాలు తెలిస్తేనే గానీ సమాధానాలు చెప్పలేరు. దీటుగానే పాల్గొన్న అభిమానులు స్పందించారు. ఆ స్పందన ఎలా ఉందంటే అభిమాన నటుడే ఆశ్చర్యపోయేటట్లుగా.. ఎన్టీఆర్‌కు ఇష్టమైన పెంపుడు జంతువేది? అంటే శునకం అని చెప్పి ఊరుకోకుండా అభిమాని మీ ఇంటి వద్ద రెండు జాతి రకం శునకాలు ఉన్నాయంటూ చెబితే ఎన్టీఆరే నువ్వెప్పుడు గమనించావ్? అంటూ ఉత్సుకతతో అడగడం జరిగింది.
 

అభిమాన గాఢత..
తెలుగునాట నటుడిపై ఉండే అభిమాన స్థాయి గురించి వేరే చెప్పనక్కరలేదు గానీ ఇందులో ఇంకా అందరికీ తెలియని అంశాలు ప్రస్తావించారు. ఎన్టీఆర్‌ని ఎంతగానో అభిమానించే ఓ మధ్యతరగతి గృహిణి ఇటీవల విడుదలైన ఆయన చిత్రం ‘శక్తి’ విజయవంతం కావాలంటూ నిర్వహించే ప్రత్యేక పూజకు తోటి మహిళా మణులను బొట్టుపెట్టి పిలవడం వంటివి ఇందులో చూపారు. అలాగే మరో వూళ్లో సీనియర్ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండ్రూపాయలకు కిలో బియ్యం పథకం వల్ల లబ్ధి పొందిన కుటుంబపు పెద్ద తన కొడుకుని నువ్వెప్పుడూ ఎన్టీఆర్‌ను వీడకు అని చెప్పడం, అదే రకంగా ఆ అభిమానాన్ని ఎన్టీఆర్ కుటుంబంపై కొనసాగించడం వంటివి చూపారు. వీటన్నిటికీ చారిత్రక నేపథ్యాలు భిన్నమైనా స్థూలంగా వారివారి నిస్వార్థ అభిమానాల్నే ప్రతిబింబిస్తోంది. ఈ అభిమానం పట్ల ప్రత్యుత్తరమిస్తూ ఒక్క మాటలో ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ముకుళిత హస్తాలతో అనడమూ చూపారు.



యాంకరింగూ అదే తీరా? ఈ కార్యక్రమానికి రాజీవ్ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సినీ నటుడు కాక ముందు టీవీ ద్వారా చిరపరిచితుడు రాజీవ్. పదేళ్ల అనంతరం తిరిగి చిన్న తెరకొచ్చానని చెబుతున్న రాజీవ్ కాస్త వైవిధ్య వ్యాఖ్యానపు తీరుని అందిస్తారనుకుంటే నిరాశపరిచారు. అదే తీరు ఉచ్ఛ స్థాయి ఉచ్ఛారణ, అతిశయోక్తుల సమాహారం. ఇప్పటి అనేకానేక యాంకరింగ్‌లలో తరచూ కన్పించే బిగ్గర అరుపులూ, వగైరా ఇందులోనూ దర్శనమిచ్చాయి.
 

ప్రయోజన రీతినీ చూడాలి.. ప్రధానంగా ఇలాంటివన్నీ వినోద మూలమైనవైనా దాదాపు గంటన్నర పాటు వారం వారం జరిగే ఈ కార్యక్రమంలో కొంత ప్రయోజనకర శాతాన్ని జోడించాలి. వ్యాఖ్యానంలో శృతి మించిన అతిశయోక్తులకు స్థానం ఇవ్వకూడదు. మామూలుగానే తానభిమానించే వ్యక్తి తారసపడగానే ఓ విధమైన ఉద్వేగానికి గురవుతాడు సంబంధిత మనిషి. దాన్ని మరీ ప్రేరేపించేలా.. ఇక దీని అనంతరం.. ఈ నటుడు కరకమలాల ద్వారా మీకు బహుమతి.. ఊహించుకుంటేనే బోలెడు ఎగ్జైటింగ్.. లాంటి వ్యాఖ్యానాలు చెప్పడం బాపతు రేంజ్ తగ్గించాలి. అదే విధంగా, ఒక నటుణ్ణి అభిమానించడం, విషయాలు తెలుసుకోవడం, అవసరమైనప్పుడు చెప్పడం వరకూ ఓకే గానీ, అదే జీవితం కాకూడదని, దైనందిన కార్యకలాపాలపై శ్రద్ధను వీడకూడదనీ, లాంటి స్ఫూర్తి వాక్యాలు అభిమాన నటునితో చెప్పిస్తే బావుంటుంది.
 

టైటిల్ సాంగ్ ఓకే.. ఒకడే.. ఒకడే.. అంటూ అభిమాని, వారభిమానించే వ్యక్తి గురించి వారిలో ఉండే భావాలూ వల్లిస్తూ రామజోగయ్య శాస్ర్తీ పాట ఇక్కడ సందర్భపరంగా ఓకే.. కానీ ఈ సందర్భంగా ఈ మధ్య వచ్చిన ‘నాగవల్లి’ చిత్రంలో ఉన్న ‘అభిమాని లలేనిదే హీరోలు లేరులే!’ అన్న పాటా ప్రేక్షకులకు గుర్తు రావడం తథ్యం. అయితే ఈ పాటలో (ఒకడే..) కూడా ‘ప్రాణం ధారపోయడం..’ వంటి పదాల తీవ్రతని తగ్గిస్తే బావుండేది. ఆలాగే మధ్యమధ్యలో వ్యాఖ్యాతకీ, ఎన్టీఆర్‌కీ ఉన్న అనుబంధ విశేషాల నిడివీ తగ్గించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top