కాస్త కొత్తగా... సాక్షి టీవీలో వచ్చే ‘లెజెండ్స్’

చాలా సందర్భాల్లో వివిధ ఛానల్స్‌లో వచ్చే ఇంటర్వ్యూల గురించి ప్రస్తావించుకునేటప్పుడు అవి ఎంతగా అసంతృప్తిని ప్రేక్షకులకు పంచుతున్నాయో అనివార్యంగా చెప్పుకోవాల్సి వచ్చేది. కానీ, అలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి చాలావరకూ తప్పించిన కార్యక్రమం ‘లెజెండ్స్’ (సాక్షి టీవీలో ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 9.30కి ప్రసారమవుతున్నది) పేరును బట్టే ఇందులో ప్రముఖులే పాల్గొంటారని తెలుస్తోంది. అందుకు తగ్గ స్థాయిలోనే ఈ ప్రోగ్రాంను దాదాపు నిర్వహించడం అభినందనీయం. సాధారణంగా ప్రసిద్ధుల్ని చేసే ఇంటర్వ్యూల్లో వైవిధ్యాన్ని తీసుకురావడం కష్టం. ఎందుకంటే వారప్పటికే ప్రసిద్ధులు కనుక వివిధ దృశ్య, ముద్ర, శ్రవ్య మాధ్యమాల ద్వారా అనేకానేకాంశాలు అందరికీ తెలిసి ఉంటుంది. ఇంకేం కొత్త కోణాలు ఆవిష్కరిస్తాం అనే ఓ బాపతు నైరాశ్యం ఇంటర్వ్యూ చేసేవారినీ ఆవహిస్తుంది. ఏదో మొక్కుబడిగా నాలుగు ప్రకటనలూ, ఇతరేతర సరంజామాలతో ప్రోగ్రామ్ పని పూర్తి చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా సంపూర్ణ ఉత్సాహంతో సమర్పించిన ప్రోగ్రాంగా ‘లెజెండ్’ను పేర్కొనడానికి ఏ మాత్రం అభ్యంతర పడనక్కర్లేదు. ఇందులో క్రమంగా ఏప్రిల్ 1,2,3 తేదీల్లో ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, తర్వాత వారంలో గాయని ఎస్.జానకిలతో జరిపిన ఇంటర్వ్యూలు వచ్చాయి.
 
అదో తరగని గని
బాలు పేరు చెప్పగానే నలభై ఏళ్లుగా ఆయనకున్న గళ అనుభవాలూ, పరిణామ క్రమాలూ సామాన్య ప్రేక్షకుడికి కూడా గుర్తుకొస్తాయి. అందులో చాలామటుకు అందరికీ తెలిసినవే అయినా, అందులోంచి తెలియని విషయాలనూ ఈ ప్రోగ్రాం ఫోకస్ చేసింది. తొలినాళ్లలో బాలూ మార్గదర్శి కోదండపాణి తన కోసం పడిన తపన వద్ద నుంచి తిరిగి వారికే పాడడానికి కాల్షీటు ఇవ్వడానికి కుదరని పరిస్థితిని చెప్పలేక చెప్పలేక చెప్పిన వైనాన్ని చెప్పిన తీరూ తదితరాల్ని కళ్లకు కట్టినట్లు బాలూ చెప్పారు. అలాగే తనకిష్టం లేని తీరులో పాటలో పదాలు వుంటే పాడనని చెప్పిన విధానం వగైరాల్ని చెప్పడం వల్ల బాలూ నిబద్ధత సరళి తెలిసింది. అయితే పదాల అర్థాలు విస్తృతం కనుక, వారు పాడిన పాటల్లోని కొన్ని పదాల్లోనూ అపసవ్యతలు ఉన్నాయని పరిశీలకులు పేర్కొనడమూ మనకు తెలుసు. అయితే బాలూయే ఓ సందర్భంలో ‘నేనిలాంటి నిర్ణయం (అపసవ్య పదాల్ని ఉచ్ఛరించడానికి చెప్పడానికి నాకు చాలా సమయం పట్టింది.. అన్నది) ఓ స్థాయికొచ్చిన తర్వాత తీసుకున్నాను కానీ సీతారామశాస్ర్తీ కలం పట్టినప్పటి నుంచి ఆ స్థాయి నిర్ణయానికి కట్టుబడి వున్నారు’ అన్నదీ ఇక్కడ పేర్కొనడం సముచితం తనకు, నటుడు, కృష్ణకీ ఉన్న తొలినాళ్ల అనుబంధం, అనంతరం ఓ సందర్భంలో వచ్చిన మాట పట్టింపు, అనంతర పరిణామాలూ, తిరిగి అవన్నీ మటుమాయమైన సంగతీ చాలా ఆత్మీయంగా వివరించారు. సంగీత దర్శకుడు సత్యంతో వచ్చిన ఘర్షణా, సమసిపోయిన తీరునీ దాపరికం లేకుండా వివరించారు బాలు.

సాధారణంగా సృజనాత్మకత ఉన్నచోటే కోపం ఎక్కువగా ఉంటుందంటారు.. కానీ మీకు కోపం లేదు? ఎలా సాధ్యపడింది? అన్న ఇంటర్వ్యూయర్ ప్రశ్నకు ఎస్పీ.. ‘అంటే నాకు సృజనాత్మక లేదనే అర్థమా?’ అంటూ చమత్కరించారు. ఇలాంటి సంభాషణా మొదలైనవి ఇద్దరూ (ఇంటర్వ్యూ చేసేవారు, సమాధానాలు చెప్పేవారు) పాల్గొంటున్న ప్రోగ్రామ్‌లో లీనమైతేనే సాధ్యం. అదిక్కడ కుదిరింది. ఈ సంభాషణకు కొనసాగింపుగా ‘అందరూ అనుకుంటారు.. నాకు కోపం లేదని కానీ, వాస్తవానికి నేను కోపిష్టినే..’ అంటూ వివరించారు. అయితే అదే సమయంలో జీవితంలో ఓర్పు గొప్ప మార్పు తెస్తుంది అన్నది అందరూ ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సిన విషయం.
 
గాయకుడికి భాషా సంస్కారం ముఖ్యం..
గాయకుడికే కాదు.. ప్రతి జీవికీ భాషా సంస్కారం అత్యవసరం. అది వుంటేనే జీవితం సంస్కార సహితంగా సాగుతుంది. భాషపై సింగర్‌కి వుండాల్సిన పట్టుని బాలూ బాగా వివరించారు. అది లేని గాయకులు పాడుతున్న పాటలు తేలిపోతున్న విషయాన్నీ చెప్పారు. తన గొంతు టిష్యూల సమస్యప్పుడు సతమతమైన తీరు, తన పుత్రుని పురోగతి విషయంలోనూ తాను ప్రభావితం చేయని విషయాన్ని చెప్పారు. ఈ తరహా విషయాల మూలాలకు వెళ్లడం మన ఉద్దేశం కాదు కానీ, ప్రతిభన్నది ప్రభావాలకు లోనయ్యే అంశం కాదు అన్నది అందరూ అంగీకరించేది.

అప్పటి పాటలే గుర్తు...
మీ ప్రారంభ దినాల పాటలు గుర్తున్నాయా? వుంటే వాటి పల్లవులు పాడరా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా అప్పటి పాటలే నాకు గుర్తు అంటూ అలవోకగా వాటిని బాలూ ఆలపించిన తీరు ముచ్చటేసింది. ఒకరకంగా ఇప్పటి పాటలపై బాలూ తెలిపిన నిరసనగా కూడా దీన్నర్థం చేసుకోవచ్చు. ఆఖరుగా బాలసుబ్రహ్మణ్యం ‘నేనెప్పుడైతే సంగీత దర్శకుడు సూచించిన విధానానికి నా గొంతు సంతృప్తికరంగా సమాధానపరచలేదని అనిపించినపుడు స్వచ్ఛందంగా పాటలు పాడటం విరమించుకుంటాను’ అన్నారు. ఆ రోజు రాకూడదని అభిమానులుగా ఆశిద్దాం.
 
ఇంకా వాస్తవ ధోరణి
ఏప్రిల్ 8న ప్రసారమైన ఎస్.జానకి (గాయని)తో జరిపిన ఇంటర్వ్యూ అయితే పూర్తిగా భూవాస్తవ రీతి (గ్రౌండ్ రియాల్టీ)లో సాగింది. తాను తనకు పాడకూడదని నిబంధన విధించిన నటి సావిత్రికి పాడే అవకాశం వచ్చినా తాను పాడనని చెప్పిన మాటల్నీ జానకి ఇందులో చెప్పారు. ఆ కారణంగానే సుప్రసిద్ధ గీతం ‘నీ లీల పాడదె..’ (మురిపించే మువ్వలు) పాడే అవకాశం వచ్చినా ఆ పాట సావిత్రిపై చిత్రీకరిస్తున్న దృష్ట్యా రెండు నెలలు పాడకుండా జాప్యం చేసిన సంగతినీ అరమరికలు లేకుండా వివరించారు.
 
గొంతు మార్చనక్కర్లేదు..
‘అలాగే చాలామంది గాయనీ గాయకులు అది అభినయించే నటీనటుల కనుగుణంగా గొంతు మార్చి పాడతాం’ అని చెప్తారు. నా దృష్టిలో గాయకులకు వుండే గొంతుకొకటే అందులోంచే అన్ని భావాలూ పలికించాలి. అందుకోసం మనం ఉన్న గొంతుతోనే పాడబోయే పాట తీరులో తన్మయమై పాడితే ఫలవంతమవుతుంది అని జానకి చెప్పింది ప్రత్యక్షర సత్యం. ఈ సందర్భంగానే తాను వివిధ వయో రీతులు గల పాత్రలకు విభిన్న తరహాలో పాడిన పద్ధతినీ (సప్తపదిలో ‘గోవుల్లు తెల్లన..’ అంటూ పసిపాపగా పాడిన విధానం) తెలిపారు.
 
కష్టమైన పాట..
 ఈ సందర్భంగా తన కెరీర్‌లో ‘హైమవతి’ అన్న కన్నడ చిత్రానికిగాను పల్లవే రెండు రాగాల మేళవింపు (తోడి అభోగి) తో వున్న శివ..శివ.. అన్నది కష్టతరమైనదిగా చెప్పి దాన్ని వెంటనే ఆలపించారు.
 
కార్యక్రమ రక్తికి ఇదీ కారణమే..
కార్యక్రమ నిర్వాహకురాలు (స్వప్న) స్వతహాగా పరిణతి చెందిన గాయని కావడంతో కూడా ఈ ప్రోగ్రాం చక్కటి స్థాయిలో రావడానికి ఉపకరించింది. దానికి తగ్గట్లుగా జానకీ, స్వప్నని ఒక్క పాట అంటూ అడిగి ప్రసిద్ధ గీతం సాకీని పాడించుకున్నారు.
 
పరిశోధన ప్రశంసనీయం
మామూలుగా గేప్ ఫిల్లర్స్‌గా సంబంధిత వ్యక్తికి చెందిన అంశాల్ని తెలపడం ఇలాంటి ఇంటర్వ్యూల విషయంలో జరుగుతుంది. అయితే ఈ ధోరణికి భిన్నంగా ఇందులో అతి సూక్ష్మ విషయాలు సైతం ఆసక్తికరంగా వివరించారు. జానకి విషయానికి వస్తే వీరి స్వగ్రామం గుంటూరు జిల్లా రేపల్లె వద్ద ఉన్న ‘పల్లెపట్ల’ అన్న దాని దగ్గర్నించీ, ఆమె తొలిసారిగా పాట పాడిన చిత్రం ‘విలయన్ విలాదియట్టు’ (ఈ తమిళ చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదట) .. అన్న అన్ని విషయాలూ తెలిపారు.
 
ఈ ప్రోగ్రామ్ పట్ల ఉన్న ఒకేఒక ఫిర్యాదు ఏమిటంటే దీన్నిలా మూడు రోజులకు విస్తరింపజేయడం. అలా కాకుండా వారు కేటాయించుకున్న సమయాన్ని ఒక రోజుకు కుదిస్తే బావుంటుంది. లేకపోతే మనకెంతగా మూడు రోజులూ చూడాలని ఉన్నా అనివార్య పరిస్థితుల వల్ల అన్ని రోజులూ చూడడానికి అవకాశం దొరక్క పోవచ్చు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top