గోళ్లను అందంగా, ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని నియమాలు

గోళ్లను అందంగా తీర్చిదిద్దడానికి రకరకాల జాగ్రత్తలు తీసుకున్నా అవి ఒక్కోసారి పెళుసుగా మారి విరిగిపోతుంటాయి. అవి అందంగా, ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.

గోళ్లు తేమను కోల్పోయి.. పెళుసుగా మారితే వంటనూనెతో తరచూ మర్దన చేసి అరగంటయ్యాక టూత్‌బ్రష్‌తో రుద్దాలి. వాటిల్లో ఉన్న మట్టి, దుమ్ము బయటకు వచ్చేస్తాయి. గోళ్లకు తేమ అందుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇక పెళుసు బారిన గోళ్లను సక్రమంగా షేప్‌ చేయాలంటే అరగంట ముందు ఉప్పునీటిలో కాళ్లు, చేతులను ఉంచాలి. కత్తిరించడానికి అనువుగా మారతాయి.

నిమ్మచెక్కతో చూడచక్కన : 
వాడేసిన నిమ్మచెక్కతో గోళ్లను రుద్దాలి. వీలైతే వాటిని వేళ్లకు టోపీలాపెట్టి అరగంటయ్యాక తీసేయాలి. ఆ ప్రాంతంలో చర్మానికి గాయాలు, పుండ్లు అయితే నిమ్మచెక్కలను ఉపయోగించకపోవడం మంచిది. వెనిగర్‌ కూడా నఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేయడానికి దోహదపడుతుంది. వేళ్లను శుభ్రంగా కడిగి తుడుచుకొన్నాక, వెనిగర్‌ కలిపిన నీటిలో కాసేపు ఉంచి.. మర్దన చేసి కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పెళుసుబారకుండా.. దృఢమవుతాయి.

చక్కగా పెరుగుతాయిలా : 
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి కొబ్బరినూనెతో మర్దన చేసి సాక్సులు వేసుకోవాలి. మర్నాడు షాంపూతో రుద్ది శుభ్రపరచుకుంటే ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. రెండు చెంచాల తేనెలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి వేళ్లకు పూతలా వేసి పావుగంటయ్యాక మర్దన చేసి గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే చక్కగా పెరుగుతాయి. ఆముదం, ఆలివ్‌నూనె వేడిచేసి చేతులను వేళ్లను ముంచి పావుగంటయ్యాక బయటకు తీసి మర్దన చేయడం వల్ల చక్కటి పోషణ అందుతుంది.

చిరు జాగ్రత్తలే మేలు:
  కొందరు మాటిమాటికీ హ్యాండ్‌ వాష్‌లు ఉపయోగిస్తుంటారు. వాటిలోని ఘాటైన రసాయనాలు గోళ్లకు హానిచేస్తాయి. బదులుగా గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవడం అలవాటు చేసుకుంటే బ్యాక్టీరియా నశిస్తుంది. వేణ్నీళ్లతో రక్తప్రసరణ చక్కగా ఉంటుంది..
ఆహారమూ ముఖ్యమే : 
విటమిన్‌, పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్‌ 'ఎ', క్యాల్షియం, ఇనుము తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉండాలి. బఠాణీలు, గుడ్లు, పెరుగు, మష్రూమ్స్‌, అరటిపండ్లు, క్యాలీఫ్లవర్‌ తీసుకుంటే నఖాలకు చక్కటి పోషకాహారం అందుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top