పిల్లలకు సాధారణంగా వచ్చే దంత సమస్యలు, చికిత్సలు, జాగ్రత్తలు

పిల్లలకు అత్యంత ప్రియమైన చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్‌తో దంతాలకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. పిల్లలనూ, తల్లిండ్రులనూ కొరికేస్తాయి. వాటికి చికిత్స తప్పనిసరి. కానీ ఎప్పుడు చేయించాలన్నదే సమస్య. ఈ చికిత్సలకు వేసవి సెలవులే మంచి సమయం. పిల్లల్లో దంతాలూ, నోటి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించడానికి ఇదొక అవకాశం. ఈ సమయంలో స్కూళ్లు ఉండవు కాబట్టి చికిత్స కారణంగా పిల్లల చదువులు వృథా కావు. పైగా వారు ఇంటి పట్టునేఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మందులు ఇవ్వడం సులభం. పిల్లల విశ్రాంతికీ ఇది అనువైన టైమ్. పిల్లలకు సాధారణంగా వచ్చే దంత సమస్యలు, చికిత్సలు, జాగ్రత్తలు.

ఎదిగే వయసులో పిల్లలకు నోటిలో వచ్చే మార్పులు, దవడ ఎముకలకు సంబంధించిన సమస్యలు, దంతాల ఎదుగుదలలో లోపాలు సాధారణంగా కనిపిస్తాయి. దీనికి తోడు పిల్లలు బాగా ఇష్టపడే జంక్‌ఫుడ్, చాక్లెట్లు, స్వీట్స్, కూల్‌డ్రింక్స్ నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సరైన సమయంలో నోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోతే అది దంత సమస్యలకు దారి తీస్తుంది. నోట్లో వేలు పెట్టుకోవడం పిల్లల్లో సాధారణం. ఈ అలవాటు దంత సమస్యలకు కారణమవుతుంది. నోట్లో వేలుపెట్టుకోవడం వల్ల దవడ ఎముకలు, పలువరస షేప్ మారిపోతుంది. ఆ అలవాటును మానిపించాలి. ఫలితంగా దాని వల్ల వచ్చే కొన్ని సమస్యలను నివారించవచ్చు.

సాధారణంగా పిల్లల్లో కనిపించే దంతసమస్యలు:

పిప్పిపళ్లు

చిగుళ్ల జబ్బులు


పాలపళ్లు సరైన సమయంలో ఊడకపోవడం


ఎత్తుపళ్లు


ముఖానికి దెబ్బలు తగలడం వల్ల వచ్చే సమస్యలు 


పిప్పిపళ్లు , చిగుళ్ల జబ్బులు:  
దాదాపు 82 శాతం మంది పిల్లలు పిప్పిపళ్లు, చిగుళ్ల జబ్బులతో బాధపడుతుంటారు. పిల్లలు తీసుకునే ఆహారం, సరిగా బ్రష్ చేసుకోకపోవడం... వంటి అనేక అంశాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడి తినే స్వీట్లు, జంక్‌ఫుడ్ తాలూకు అవశేషాలు దంతాల మధ్య ఇరుక్కుపోయి, వాటి కారణంగా బ్యాక్టీరియా లక్షల సంఖ్యలో పెరిగి అది దంతసమస్యలకు కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా, చక్కెర పదార్థాలతో కలిసి నోటిలో కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. దాంతో పంటిలో రంధ్రాలు ఏర్పడతాయి. అది పిప్పిపళ్లకు దారితీస్తుంది.

ఈ పిప్పిపళ్లు మొదటిదశలో ఇబ్బంది పెట్టకపోయినా రంధ్రాలు పెద్దవి అవుతున్నకొద్దీ అక్కడ ఆహారం చిక్కుకుపోవడం ఎక్కువవుతుంది. దాంతో అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చి నొప్పిమొదలవుతుంది. పిప్పిపళ్ల వల్ల నొప్పి, ఆహారాన్ని నమలడానికి ఇబ్బంది కలుగుతుంది. దాంతో పిల్లలు నొప్పికి భయపడి పడి అన్నం తినడాన్ని తప్పించుకోవాలని చూస్తారు. నొప్పిని సరిగా వెలిబుచ్చలేని అశక్తత వల్ల వాళ్లిలా చేస్తుంటారు. సరైన సమయంలో చికిత్స చేయించకపోతే పళ్లలో వచ్చే ఇన్ఫెక్షన్ ఎముక వరకు చేరవచ్చు. దాంతో మున్ముందు రావాల్సిన శాశ్వతదంతాలు పాడయ్యే ప్రమాదం ఉంది. 


పళ్లలో చిక్కుకున్న ఆహారపదార్థాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల దంతాలకే కాకుండా చిగుళ్లకు కూడా సమస్యలు వస్తాయి. నోట్లో విపరీతంగా పెరిగిపోయిన బ్యాక్టీరియా, ఆహారపదార్థాలతో కలిసి మురికి... ప్లాక్, క్యాలికులస్‌గా చిగుళ్ల చివర్లలో చేరుతుంది. చిగుళ్లు చాలా సున్నితమైనవి. ఈ మురికి చేరడం వల్ల చిగుళ్లకు వాపు రావచ్చు. ఒక్కోసారి చిగుళ్ల నుంచి రక్తస్రావం, నోటిదుర్వాసన రావడం వంటి సమస్యలు కూడా రావచ్చు. చిన్నవయసులోనే చిగుళ్ల జబ్బు వస్తే పిల్లలు జీవితకాలం దృఢమైన పళ్లు లేక ఇబ్బంది పడవలసి రావచ్చు.

చికిత్స: 

నోటిలో రంధ్రాలకు ఫిల్లింగ్‌తో పాటు, సమస్యను బట్టి అనేక రకాల ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్స తీసుకోవడానికి వేసవి సెలవులు మరింత ఉపయుక్తంగా ఉంటాయి.

ఎత్తుపళ్లు, సంబంధిత సమస్యలు :

ఎత్తుపళ్ల వల్ల పిల్లలు ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఈ సమస్య కూడా ఎదిగే వయసులోనే మొదలవుతుంది. నోట్లో వేలు అలవాటును మాన్పించడం ద్వారా ఇది నివారించదగిన సమస్యే అయినప్పటికీ, నిర్లక్ష్యం వల్ల తీవ్రమవుతుంది. అవగాహనలోపం వల్ల కూడా తల్లిదండ్రులు దీన్ని అశ్రద్ధ చేస్తారు.

ఎత్తుపళ్లకు కారణాలు :

చాలావరకు వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికిగానీ, లేదా ఇద్దరికీ ఎత్తుపళ్లు ఉంటే పిల్లల్లో కూడా 70 శాతం వచ్చే అవకాశం ఉంది. 


నోట్లో వేలుపెట్టుకోవడం, పెదవులు కొరకడం, నాలుకతో పళ్లను ముందుకు తోయడం, నోటితో గాలిపీల్చడం వంటివి దీనికి కొన్ని కారణాలు. అప్పుడే ఎదుగుతున్న దవడ ఎముకలు ఒత్తిడి పడుతున్న వైపునకు మైనంలా ఒంగిపోతాయి. ఈ కారణంగానే పై దురలవాట్లు ఉన్న పిల్లల్లో దవడ ఎముకల షేపు మారిపోయి ఈ సమస్య వస్తుంది.

ఎత్తుపళ్ల సమస్యను ఎదిగే వయసులోనే సరిచేయడం సులభం. చికిత్స ఫలితాలు కూడా నూరు శాతం ఉంటాయి. ఎదిగే వయసులో వచ్చే ‘గ్రోత్ స్పర్ట్స్’ చికిత్సకు ఎంతగానో ఉపయోగపడతాయి. చికిత్స త్వరగా, సమర్థంగా పూర్తయ్యేందుకు ఈ అంశం తోడ్పడుతుంది.

ఎత్తుపళ్ల సమస్య రెండురకాలుగా ఉండవచ్చు:
కేవలం పళ్లు మాత్రమే ఎత్తుగా ఉండటం

పళ్లతో పాటు దవడ ఎముకలు కూడా ఎత్తుగా ఉండటం

నవ్వినప్పుడు చిగుళ్లు ఎక్కువగా కనిపించడం, నిద్రపోతున్నప్పుడు పెదవులు తెరచుకుని ఉండటం, పెదవులు బాగా ముందుకు వచ్చినట్లుగా కనపడటం వంటివి ఎముక ఎత్తు పెరిగిందని చెప్పడానికి గుర్తులు.

చికిత్స : 

పళ్లు ఎత్తుగా ఉన్నా, పళ్ల మధ్య సందులు ఉన్నా, ఒంకరటింకరగా ఉన్నా, ఎగుడుదిగుడుగా ఉన్నా, సరిగా రాకున్నా వాటిని క్లిప్పులతో సరిచేయవచ్చు.

ఎదిగే వయసులో పళ్లను, దవడలను ఎలాంటి శస్తచ్రికిత్సలు లేకుండా ప్రత్యేకమైన క్లిప్స్‌తో సరిచేయవచ్చు. అదే ఎదిగిన పిల్లల్లో దవడ ఎముకలు ఎత్తుగా ఉంటే దాన్ని సరిచేయడానికి సర్జరీ అవసరం కావచ్చు.

పిల్లలకు అమర్చాల్సిన క్లిప్పులు అందరిలో ఒకేలా ఉండవు. వ్యక్తిగతమైన పరీక్షలతో వాటిని నిర్ణయించాల్సి ఉంటుంది.

ఈ సెలవుల్లో ఒకసారి దంతవైద్యుడిని కలవడం పిల్లల దంతాల ఆరోగ్యానికి మరింత మంచిది.


పాలపళ్లు సరైన టైమ్‌లో ఊడకపోవడం... 

సాధారణంగా పాలపళ్లు ఊడిపోవడానికి ప్రతి పంటికీ ఒక సమయం ఉంటుంది. శాశ్వత దంతం తయారై బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పాలపన్ను ఊడుతుంది. ఊడిన 3 నుంచి 4 నెలల్లో శాశ్వత దంతం వచ్చేస్తుంది. ఏ కారణం వల్లనైనా పాలపన్ను ఊడకపోతే, దానికి ముందువైపో, వెనకగానో శాశ్వత దంతం వస్తుంది (కొన్నిసార్లు పాలపన్ను ఊడకపోవడం వల్ల శాశ్వత దంతం బయటకు రాలేక చిగురులోనే చిక్కుకుపోవచ్చు కూడా). దాంతో రెండు వరసల్లో పళ్లు కనపడతాయి. అందుకే ఆరేళ్లు దాటిన పిల్లలను దంతనిపుణులకు తరచూ చూపిస్తూ పాలపళ్లు సరైన సమయంలోనే ఊడిపోతున్నాయో లేదో పరీక్ష చేయిస్తూ ఉండాలి. అవసరాన్ని బట్టి వారి పర్యవేక్షణలో అవసరమైన చికిత్స చేయించాలి.

పరీక్షలు : 

ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎక్స్-రే సహాయంతో పాలపళ్లు, శాశ్వత దంతాలను, శాశ్వతదంతాలు చిక్కుకుపోయిన తీరును తెలుసుకోవచ్చు.

ముఖానికి దెబ్బలుతగలడంవల్ల వచ్చే సమస్యలు

పిల్లలు ఆటలు ఆడుకునేటప్పుడు లేదా గొడవలు పడి పోట్లాడుకున్నప్పుడు ముఖానికి దెబ్బలు తగలడం సాధారణం. కొన్నిసార్లు పళ్లు విరగవచ్చు, ఊడి వచ్చు. దెబ్బలు తీవ్రమైతే పెదవులు చీలడం, ముక్కు వంకర కావడం కూడా జరగవచ్చు. దెబ్బలు తగిలినప్పుడు వెంటనే చికిత్స చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే పలువరస షేపు మారడం, పళ్లపై గుర్తులు మిగిలిపోవడం వంటివి జరగవచ్చు. అందుకే పన్ను విరిగినా, ఊడినా వెంటనే ఆ ముక్కను మంచినీళ్లలో ఉంచి దంతవైద్యులను కలవాలి.   
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top