పర్యాటకం ---- థ్రిల్లింగ్ శ్రీలంక


శ్రీలంకలో సరదాగా కాలం గడపడానికి అనేక టూరిస్ట్ అట్రాక్షన్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు థ్రిల్లింగ్‌గా కాలం గడపడానికి ఈ కింది సౌకర్యాలు ఉన్నాయి. ఐతే గోల్ఫింగ్ లాంటి కొన్ని సగటు మధ్యతరగతి తెలుగువారికి పనికిరాకపోవచ్చు.
గోల్ఫింగ్:

బ్రిటిష్‌వారి క్రీడ అయిన గోల్ఫ్ ఆట ఆడటానికి ఏషియాలోని రెండో పురాతన గోల్ఫ్‌కోర్స్ శ్రీలంకలోనే ఉంది. దీని పేరు రాయల్ గోల్ఫ్ కోర్స్. దీన్ని 1897లో బ్రిటిష్‌వారు స్థాపించారు. ఇదేకాక శ్రీలంకలో ఇంకా మరో రెండో గోల్ఫ్ కోర్స్‌లు ఉన్నాయి. నువెర గోల్ఫ్ కోర్స్ టీ తోటలు గల ప్రదేశంలో, విక్టోరియా ఇంటర్నేషనల్ గోల్ఫ్ అండ్ కంట్రి రిసార్ట్ కేండీ నగర సమీపంలో ఉన్నాయి.
వేల్ అండ్ డాల్ఫిన్ వాచింగ్:

ప్రపంచంలో అతి పురాతన, అతి పెద్దదైన జలచరాలైన డాల్ఫిన్స్‌ని, బ్లూవేల్స్‌ని శ్రీలంకలోని దక్షిణ, తూర్పు, పడమర తీరాల్లోంచి సముద్రం మీదకి ఎక్స్‌కర్షన్‌కి వెళ్ళి చూడచ్చు. డొండ్ర పాయింట్, ట్రింకోమలీ, కాల్‌పిటియ అనే ప్రదేశాల్లో డాల్ఫిన్స్ సమృద్ధిగా జీవిస్తున్నాయి.
డైవింగ్: 

ఇండియన్ ఓషన్‌లో శ్రీలంక తీర ప్రాంతంలోని నీరు ఇరవై మీటర్లు (అరవై ఐదు అడుగులు) దాకా స్పష్టంగా కనిపిస్తుంది. సముద్ర గర్భంలోని రీఫ్‌లని, 18వ శతాబ్దంలో మునిగిన ఓడలు అవశేషాలని స్కోర్కెలింగ్, స్కూబా డైవింగ్ చేస్తూ దర్శించవచ్చు. వెయ్యి కిలోమీటర్ల పొడవుగల బీచ్‌లలో అనేకరకాల వినోదాలు అందుబాటులో ఉన్నాయి.
స్విమ్మింగ్:

శ్రీలంక చుట్టూ ఉన్న 1300 కిలోమీటర్ల సముద్ర తీరంలో అనేకానేక బీచ్‌లు, చుట్టూ తాటిచెట్ల సముదాయాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. అక్కడ నించి సముద్రంలోకి వెళ్ళి ఈది రావచ్చు. ఏప్రిల్ నించి నవంబర్ దాకా ఈదడానికి నీరు వేడిగా, సౌకర్యంగా ఉంటుంది.
వైట్ వాటర్ రేఫ్టింగ్: 

వర్జిన్స్ బ్రెస్ట్ అని బ్రిటీష్‌వారు పేరుపెట్టిన నదిలో రబ్బర్ రేఫ్ట్‌లో ప్రయాణించి కిల్లర్ ఫాల్ అనేచోట తొంబై అడుగుల కిందకి ఈ రేఫ్ట్‌లో దిగే అనుభవం గుండెదిటవుగలవారికే ప్రత్యేకం. వేగంగా ప్రవహించే ఆ నీటిమీద రేఫ్ట్‌లో కొంతదూరం సాగాక ప్రయాణం ప్రశాంతంగా మారుతుంది. పక్కనే వెదురు, కొబ్బరి, తాటి, ఇతర పళ్ళ చెట్ల సముదాయాల పక్కనే రుచికరమైన బఫే లంచ్ చేయచ్చు.
రాక్ క్లైంబింగ్: 
శ్రీలంక ద్వీపం మధ్యభాగంలో ఉన్న కొండల మీదకి ఎక్కే ట్రెక్కింగ్, క్లైంబింగ్ ఆటని కూడా ఆస్వాదించవచ్చు. కొండలని తాళ్ళ సహాయంతో ఎక్కుతూంటే కింద అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తూంటాయి. జలపాతాలు, టీ తోటలు, చెరువులు అక్కడనించి చూడచ్చు.
బెలూనింగ్:

పంచరంగుల బెలూన్‌లోకి ఎక్కి నిశ్శబ్దంగా ఆకాశంలోకి ఎగిరి, కింద విస్తరించుకున్న అడవులని, కొండలని చూడచ్చు. బెలూన్ గాలి వాటాన్నిబట్టి ప్రయాణిస్తుంది.
సెంక్చురీస్:

క్రీస్తు పూర్వం 237లో శ్రీలంక రాజు దేవనం పియటిప్ప ప్రపంచంలోని తొలి వైల్డ్‌లైఫ్ సేంక్చుర్‌ని నిర్మించాడు. దీని గురించి బౌద్ధుల మత గ్రంథాల్లో పేర్కొనబడింది. శ్రీలంకలో మొత్తం 65,610 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కువ భాగం వన్యమృగాలు, అడవులు, కొండలు, వాగులు, చెరువులు, నదులుగల ప్రాంతమే. శ్రీలంకలోని 14% భూభాగం సేంక్చురీలకే అంకితం చేసారు. శ్రీలంకలో వీటిలోని 600 చిరుతలు. 3000 ఏనుగులు, వేలకొద్దీ నల్ల తోడేళ్ళు, ఇంకా వివిధ వన్యమృగాలని చూడచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top