మహాశివరాత్రి రోజున జాగరణ.. ఉపవాసం ఎందుకు?

మహాశివరాత్రి అనగానే ఉపవాసం, జాగరణ లేదా జాగారం గుర్తుకువస్తాయి. జాగరణ అంటే జాగ్రత్త.. మెలకువ.. చైతన్యం లాంటి అనేక అర్థాలు వున్నాయి. మన పూర్వీకులు లేదా పెద్దలు ఏర్పాటుచేసిన అనేకానేక సంప్రదాయాలు లేదా ఆచారాలు అన్నీ ఇంతో అంతో మానవ ఆరోగ్యంతో, ప్రాపంచిక, ప్రకృతి ధర్మాలతో ముడిపడి వున్నవని అందరికీ తెలిసిందే. అయితే దాన్ని తర్కించడానికి కానీ, యోచించి వాటిలో వున్న మంచిని గ్రహించడానికి కానీ ఎవరికీ తీరుబాటూ లేదు. ఎవరైనా చెపితే వినే ఓపికా లేదు. శివరాత్రికి కూడా అటువంటి ఏర్పాట్లు మనవాళ్లు చేసారు. శివరాత్రితో చలి శివోహం అంటూ పారిపోతుందన్నది సామెత. నిజమే మాఘం ముగిసి, ఫాల్గుణం ప్రవేశించిన వేళ, చలికాలం ముగిసి వేసవికి అంకురార్పణ జరుగుతున్న సమయంలో మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. సహజంగానే మానవ శరీరం రుతువుల సంధికాలంలో కాస్త ఒడిదుడుకులకు లోనవుతుంది. మన దేశం నుంచి వేరే దేశం వెళ్లినపుడు ఎలా అయితే ప్రకృతి ధర్మానికి అనుగుణంగా మన శరీరం కాస్త ఇబ్బంది పడుతుందో, ఇదీ అలాగే. ఈ కారణంగానే వేసవికి వర్షాకాలానికి నడుమ, వర్షాకాలానికి శీతాకాలానికి మధ్య, శీతాకాలానికి వేసవికి మారినపుడు వ్యాధులు ప్రబలుతుంటాయి. శీతాకాలంలో పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. వేసవిలో పగటి సమయం ఎక్కువ, రాత్రి సమయం తక్కువ. ఈ రెండు కాలాలకు సంబంధించి, ఆహారం జీర్ణం కావడంలో తేడా వుంటుంది. అలాగే బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీర స్పందన వుంటుంది. ఈ తేడాకు శరీరం అలవాటు పడాలనే ఉద్దేశంతో, సరిగ్గా ఈ సంధికాలంలో వచ్చే శివరాత్రి రోజున ఉపవాసం వుండడం, రాత్రంతా జాగరణ చేయడం ఓ ఆచారంగా వుంచారు. మంచి విషయం మంచిగా చెపితే వినని వారికి ఓ భయం అనేది వుండాలి. ఇంట్లో తల్లి తన పిల్లలకు తండ్రి పేరు చెప్పి భయపెట్టినట్లు. భగవంతుడికి మంచి విషయాలకు ముడిపెట్టి ఆచారాలుగా మారిస్తే, జనం కచ్చితంగా పాటిస్తారని ఆనాటి పెద్దలు విశ్వసించారు. కానీ ఎటొచ్చీ భగవంతుడిపైనే విశ్వాసం సన్నగిల్లుతున్నపుడు, ఇక అతగాడికి సంబంధించిన ఆచారాలు మంచివైనా సరే ఎవరు పట్టించుకుంటారు?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top