శోభి మచ్చలు రాకుండా ముందుజాగ్రత్తలు,

శోభకూ... శోభికీ తేడా ఆ ‘ఇ’కారమే. ఆ - ‘ఇ’కారంతోనే అందంగా కనిపించే చర్మం వికారమవుతుంది. శోభి మచ్చలు హాని చేయవు. కానీ వికారంగా కనిపించేలా చేస్తాయి. చాలామట్టుకు వాటంతట అవే తగ్గుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తగ్గకుండా ఇబ్బంది పెడతాయి. కొన్ని సూచనలు, మరికొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు మచ్చలు రాకుండా చూసుకోవచ్చు. వచ్చినా తేలిగ్గా తగ్గించుకోవచ్చు. అలా మచ్చ రాకుండా తీసుకోవాల్సిన ‘ముందుజాగ్రత్త’లు.

శోభి లేదా తెల్లమచ్చలు అనేది చర్మానికి వచ్చే అతి సామాన్యమైన వ్యాధి. ఇది చాలా సందర్భాల్లో దానంతట అదే తగ్గిపోయినా... ఒక్కోసారి ఎక్కువరోజులు ఉంటుంది. ఇది చర్మం పైపొరమీద వచ్చే ఒక రకమైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. సాధారణంగా పెద్ద వయసు వారిలోను, మధ్యవయస్సు వారిలోను కనిపిస్తుంది. దీనికి ఆడమగ భేదం లేదు. చర్మం మీద రంగులో మార్పులు వచ్చే కారణంగా దీనిని వెర్సికలర్ అని, తెలుగులో శోభి లేదా తెల్లమచ్చలు అని అంటారు.
ఎవరిలో ఎక్కువ...!
తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, వేడి వాతావరణంలో ఉండేవారిలో
స్టెరాయిడ్లు తీసుకునేవారిలో

పౌష్టికాహార లోపం ఉన్నవారిలో

ధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో (ఈస్ట్, చర్మం మీద ఫంగస్ మొదలైనవి రాకుండా వ్యాధినిరోధక వ్యవస్థసరిగా రక్షణ కల్పించ లేకపోయినప్పుడు)

గర్భవతులలో

చెమటపట్టే శరీరధర్మం ఉన్నవారిలో

జిడ్డు చర్మం ఉన్న వారిలో

హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో... ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

కొందరిలో వంశపారంపర్యంగా వస్తుంది. అంతేకాక ఆరోగ్యవంతులకు కూడా ఒక్కోసారి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్దగా కంగారుపడవలసిన అవసరం లేదు.
కారణాలు:
చర్మం లోపల ఉండే మెలసీజియా ఫర్‌ఫర్ అనే ఫంగస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది చర్మం మీద ఉండే నూనెలను, మృతకణాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ ఫంగస్ మాత్రం అందరి చర్మంలోనూ ఉన్నా కొంతమందిలో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది. దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కొందరి శరీరం మీద మచ్చలు వస్తాయి. వాతావరణం తేమగా, వేడిగా ఉన్నప్పుడు ప్రధానంగా వేసవిలో ఈ వ్యాధి కనిపించడానికి అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఇది ఫలానా కారణంగా వస్తుందని ఇప్పటికీ నిర్ధరించలేదు.

తెల్లమచ్చలు కనిపించడం వల్ల నలుగురిలో కి వెళ్లడానికి కొంత ఇబ్బందిగా అనిపించడం సాధారణం. ఈ వ్యాధిలో చర్మం సహజరంగును కోల్పోయి, మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు ముదురు ఎరుపు, లేత గోధుమ, తెలుపు వర్ణాలలో ఉంటాయి. ఒక్కోసారి ఈ మచ్చలున్న చోట దురదగా అనిపించి చికాకుగా అనిపించవచ్చు. అయినప్పటికీ దీనివల్ల ఇబ్బంది ఉండదు. ఎక్కువ చెమట పట్టడం, అధికవేడి కారణంగా ఈ దురదలు రావచ్చు. ఈ మచ్చలు సాధారణంగా వీపు, భుజాలు, చేతులు, ఛాతీ, మెడ ప్రాంతాలలో కనిపిస్తాయి. అప్పుడప్పుడు ముఖం మీద కూడా కనిపిస్తాయి. చిన్నపిల్లలలో ఈ లక్షణాలు ముఖం మీద కనిపిస్తాయి. చర్మం మీద ముదురురంగు మచ్చలు ఏర్పడినప్పుడు, ఆ ప్రాంతంలో చర్మం సహజరంగు కోల్పోవడం సర్వసాధారణం. 

వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఈ మచ్చల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మచ్చల తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కొందరిలో తెల్ల రంగులో చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తే, మరికొందరిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అవి చూడటానికి సహజంగానే అనిపించినప్పటికీ ఒక్కోసారి సమస్యాత్మకంగా ఉంటాయి.
చికిత్స, నివారణ: 
ఈ సమస్యను చాలా తేలికగా నివారించవచ్చు. చికిత్స చాలా సులభం. ఈ మచ్చలు తొందరగా తగ్గిపోవడానికి అనేక మార్గాలున్నాయి. వేడి నీటితో స్నానం చేయడం, వ్యాయామం చేయడం వంటి చిట్కాలు పాటించడం వల్ల ఈ మచ్చలు త్వరగా తగ్గుముఖం పడతాయి. అయితే చర్మపురంగు యథాస్థితికి రావడానికి మాత్రం చాలారోజులు పడుతుంది. వాతావరణం సాధారణస్థితిలోకి అంటే అధిక ఉష్ణోగ్రత నుంచి సాధారణ ఉష్ణోగ్రత స్థాయికి వచ్చేసరికి రంగులో మార్పు వస్తుంది. అదృష్టవశాత్తూ, శోభి లేదా తెల్లమచ్చలు అంటువ్యాధి కాదు. ఒకవేళ ఈ వ్యాధి వచ్చినప్పటికీ కొద్దిరోజులకే తగ్గిపోతుంది.

ఈ వ్యాధి సోకిన వారందరికీ చికిత్స ఒకేలా ఉండదు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స సూచిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, వ్యాధి సోకిన వ్యక్తికి సంబంధించిన మెడికల్ హిస్టరీ... వంటి వాటిని ఆధారం చేసుకుని చికిత్స ఉంటుంది. అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నివారణకి తేమ వాతావరణం అనేది తప్పనిసరి. వాటితోటు శరీరంలో సహజంగా ఉండే నూనెలు కూడా దీనిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.

 
కొందరు శోభిని చూసి తామర (రింగ్‌వార్మ్) గా భ్రమపడుతుంటారు. తామర వ్యాధి సోకిన భాగంలో మచ్చకు చుట్టూ అంచులు స్పష్టంగా కనపడతాయి. అలాగే దురద కూడా ఉంటుంది. వీటినే కొందరు విటిలిగో, పిటీరియాసిస్ ఆల్బా, సోరియాసిస్‌గా కూడా భ్రమపడుతుంటారు. అందువల్ల డెర్మటాలజిస్టులు ‘కెఓహెచ్’ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన చర్మవ్యాధి అనేది నిర్ధరించి, దానికి తగిన చికిత్స సూచిస్తారు.

ఇన్‌ఫెక్షన్ తగ్గాక కూడా శరీరపు రంగు యథాస్థితికి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. ఇది మళ్లీ మళ్లీ రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువచెమట పట్టకుండా చూసుకుంటూ, కెటొకోనటోల్ ఉండే పౌడర్‌ను కొన్ని నెలలు వాడితే మంచిది. ఈ సూచనలు పాటించి అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.
జాగ్రత్తలు
ఈ వ్యాధి రాకుండా నివారించడానికి కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. అవి...

చర్మాన్ని నిరంతరం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

శరీరం మీద అధిక తేమ ఉండకుండా జాగ్రత్తపడాలి

గోరువెచ్చని నీటితో కాని, కొద్దిగా వేడిగా ఉన్న నీటితో కాని స్నానంచేయాలే కాని వేడివేడి నీటితో స్నానం చేయకూడదు. మరుగుతున్న నీటితో స్నానం చేయటం వలన చర్మం చిట్లినట్టుగా అయ్యి లోపల ఉండే నూనె పదార్థాలు ఉత్తేజితమయ్యి, నూనె గ్రంథులు ఏర్పడి, అధిక నూనెను బయటకు విడుదల చేస్తాయి. దీని వల్ల చర్మం మీద ఉన్న ఫంగస్ రెట్టింపవుతుంటుంది

ఎక్కువ చెమట పట్టకుండా జాగ్రత్తపడాలి

శరీరం మీద నూనె కాని నూనెకు సంబంధించిన పదార్థాలను కాని పూయకూడదు

బిగుతుగా, గాలిచొరకుండా ఉండే వస్ర్తాలను ధరించకూడదు.
మందులు
ఫంగస్ చర్మపు పైపొర మీద ఉంటుంది కనుక, చర్మానికి పై పూతగా వాడే మందులు బాగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ మచ్చలు ఎక్కువగా ఉంటే, యాంటీ ఫంగల్ మందులను కడుపులోకి తీసుకోవలసి ఉంటుంది. మందులు వాడాక ఈ మచ్చలు తగ్గినట్టు అనిపించినప్పటికీ, కొంతకాలం తరవాత మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కనక ఈ ఫంగస్ పూర్తిగా తగ్గడానికి మందులు వాడడం తప్పనిసరి.

లులిఫిన్ వంటి యాంటీ ఫంగల్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని సుమారు పదిరోజుల పాటు రోజుకి ఒకసారి చొప్పున మచ్చలున్న చోట అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే క్లోట్రిమాజోల్, కెటొకోనజోల్ వంటి క్రీమ్స్‌ను రెండు వారాలపాటు రోజుకి రెండుసార్లు చొప్పున వాడవచ్చు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉంటే, ఓరల్ ట్యాబ్లెట్లను తీసుకోవలసి ఉంటుంది. ఏ మందులనైనా నిపుణులైన డెర్మటాలజిస్టు సలహా, సూచనల మేరకు తీసుకోవలసి ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top