కడుపులో పాపాయి కోసం....ఏం తినాలి... ఏ మేరకు తినాలి.....ఎంత బరువు ఉండాలి..

తొమ్మిది నెలలు.. అమ్మ తినే పోషకాహారమే కడుపులో పాపాయి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తుంది. ఈ ఆహారం ఒక్క శిశువు శ్రేయస్సుకే కాదు.. తల్లి ఆరోగ్యానికీ ఎంతో కీలకం. ఈ సమయంలో ఏం తినాలి... ఏ మేరకు తినాలి... ఎంత బరువు ఉండాలి.. వంటి ముఖ్యాంశాల అవగాహన ప్రతి తల్లికి ఎంతో అవసరం.

నవమాసాల్లో క్రమంగా పెరిగే బరువు ఆరోగ్యదాయకం. సాధారణంగా బీఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) సూచిక ఆధారంగా బరువు పెరగాల్సి ఉంటుంది. దీన్ని నిపుణుల పర్యవేక్షణలో తెలుసుకొంటే మేలు.

తల్లీబిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే తొలి మూడు నెల్లలో తీసుకోవాల్సిన ఆహారం ఇది..
తొలి మూడు నెలల్లో ఫొలేట్‌ ఎంతో కీలకం. ఈ ఫొలేట్‌ పుష్కలంగా అందాలంటే తాజా ఆకుకూరలు తినాలి. ముఖ్యంగా తోటకూర, పుదీనా, పాలకూర నుంచి పోషకం అందుతుంది. సెనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు.. ఇవీ ఫొలేట్‌ అందించే ప్రధాన ఆహారాలే. అలాగే నువ్వుల నూనె సోయా నూనెల నుంచీ పొందవచ్చు.

జింక్‌:  
చిక్కుడు జాతి గింజల నుంచి జింక్‌ పుష్కలంగా అందుతుంది. సోయా, వేరుసెనగ, సోయా పనీర్‌తో చేసిన టోఫు, పుట్టగొడుగులు, నువ్వులు, దోస గింజల నుంచి ఈ పోషకాన్ని స్వీకరించవచ్చు.
మెగ్నీషియం: 
బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌, సోయాపిండి, వీట్‌బ్రాన్‌, తాజా ఆకుకూరలు, టోఫు, చిక్కుడు జాతి గింజలు, తృణధాన్యాల నుంచి మెగ్నీషియం పుష్కలంగా అందుతుంది.

ఈ పోషకాల వల్ల తల్లికి రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉంటుంది. ప్రసవం తేలిగ్గా అవుతుంది. ప్రసవానంతర సమస్యలు తగ్గుతాయి. పాలు బాగా వృద్ధి చెందుతాయి. దాంతో పాటు బిడ్డ బరువు పెరుగుతుంది. చక్కని ఎదుగుదల ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి ఇనుమడిస్తుంది.

రెండో దశలో..
నాలుగు నెలల నుంచి ఆరునెలల కాలంలో శరీరానికి అందే కెలొరీల శాతాన్ని పెంచాల్సి ఉంటుంది. మాంసకృత్తులు, మేలు చేసే ఒమెగా-3 కొవ్వులు, డి, బి విటమిన్లు, ఫొలేట్స్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఇనుము వంటి ఖనిజలవణాలు ఈ సమయంలో అవసరమవుతాయి. ముఖ్యంగా 'బి' విటమిన్లు ఉండే దంపుడు బియ్యం, మొలకెత్తే గింజలు, గుడ్డు తీసుకోవాల్సి ఉంటుంది.


ప్రసవం వరకు
రెండోదశలో తీసుకొన్న ఆహారంతో పాటు విటమిన్‌ 'ఇ'ని అధికంగా తీసుకోవడం మొదలుపెట్టాలి. వాటితో పాటు డీహెచ్‌ఏ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

సాధారణ గర్భిణులు తీసుకొనే ఆహారం..
* పాలు, పెరుగు వంటి ఆహారాన్ని రోజులో నాలుగు కప్పులు వరకు తీసుకోవచ్చు. చేప, గుడ్డు, మాంసం, టోఫు వంటివాటిని రోజులో రెండు దఫాలు కొద్దికొద్దిగా తీసుకొంటే సరిపోతుంది.
* ముదురు రంగులో ఉండే కాయగూరలు.. పండ్లు, క్యారెట్‌, బీట్‌రూట్‌లు అధికంగా తీసుకోవాలి. 

* గర్భం ధరించిన తర్వాత ఉపవాసాలు.. అలసిపోయి ఆహారం తీసుకోకపోవడం వంటివి ఎంత మాత్రం చేయకూడదు. అలాగే పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమయంలో సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకాన్ని నివారించవచ్చు. * రోజువారీ ఆహారంతో పాటు ఐదు నుంచి ఆరు సార్లు కాయగూరలు.. పండ్లు తీసుకోవాలి. రక్తహీనతను నివారించేందుకు ఇనుము అధికంగా ఉండే తాజా ఆకుకూరలకి ప్రాధాన్యం ఇవ్వాలి. * పాలు.. గుడ్లు.. మొలకెత్తిన ధాన్యాలు. ఫెర్మెంటేషన్‌ ప్రక్రియ జరిగిన పదార్థాలు తీసుకోవాలి. నీటిని అధికంగా తీసుకోవాలి. * వేపుళ్లకు దూరంగా ఉండాలి. కొంతమందికి ఈ సమయంలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు సరిపడని పదార్థాలకి దూరంగా ఉండటమే మేలు. కెఫీన్‌ అధికంగా ఉండే టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.

ఆహార నియమాలివి... * కొంతమందికి వాంతులు.. తలతిప్పడం వంటి సమస్యలుంటాయి. అటువంటి వారు ఆహారాన్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో ఆరుసార్లు తినాలి. ఆహారాలకు మధ్య పానీయాలు అధికంగా తీసుకోవాలి. ఘాటైన వాసనలు వెలువరించేవి... నూనెలు అధికంగా వాడేవి తీసుకోకపోవడం మేలు. 
గుండెలో మంటగా ఉంటే..  
కొంతమందికి ఏం తిన్నా గొంతుకలోకి వచ్చినట్టుంటుంది అటువంటి వారు.. ప్రతీ ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలితినాలి. నిదురించే ముందు ఒక దిండును ఎత్తుగా పెట్టుకోవాలి. కొద్దిగా పాలు.. లేదా వేడినీళ్లు తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
మలబద్ధకానికి.. 
పీచు అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్‌, బీన్స్‌, గింజలు ఇవి మలబద్ధకాన్ని నివారిస్తాయి. నిపుణులు వివరించిన వ్యాయామాలతో పాటు అధికంగా నీటిని తీసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top