కంటిలోచాలామందికి గ్లకోమా ఉన్నట్లే తెలియదెందుకు...?


కంటి ఆకృతిని పరిరక్షించడానికి కంటిలో ఒకరకమైన ద్రవం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దాన్నే ‘యాక్వస్ హ్యూమర్’ అంటారు. అది నిత్యం ఉత్పత్తి అయ్యే క్రమంలో కొత్తద్రవం ఉత్పత్తి అయిన కొద్దీ పాతది బయటకు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఇది బయటకు వెళ్లడంలో ఏదైనా అడ్డుపడితే? అప్పుడు కంటి నరంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతుంటుంది. ఇలా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ నరం దెబ్బతింటుంది. అలా దెబ్బతినడం వల్ల వచ్చే ప్రమాదాన్ని ‘గ్లకోమా లేదా గ్లుకోమా’ అంటారు. మనం నేరుగానే కాదు... పక్కలకు కూడా చూడగలం. దీన్నే ఫీల్డ్ ఆఫ్ విజన్ లేదా విజువల్ ఫీల్డ్ అంటారు. మనమిలా పక్కగా చూడగల విస్తృతి, సామర్థ్యం గ్లకోమా వ్యాధి వల్ల క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక రోజులో జరిగేది కాదు. అందుకే తమ చూపు తగ్గిపోవడాన్ని చాలామంది చాలాకాలం వరకు గమనించలేరు.
గ్లకోమాలో రకాలు...
1. ప్రైమరీ గ్లకోమా
2. సెకండరీ గ్లకోమా
3. కంజెనిటల్ గ్లకోమా / పీడియాట్రిక్ గ్లకోమా 
1. ప్రైమరీ గ్లకోమా:
  నిర్దిష్టమైన కారణం ఏదీ లేకుండా ఈ వ్యాధి కనిపిస్తే దాన్ని ప్రైమరీ గ్లకోమా అంటారు. ఇందులోనూ మళ్లీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా (పీఓఏజీ) అని, క్లోజ్‌డ్ యాంగిల్ గ్లకోమా (పీీసీఏజీ) అని రెండు రకాలున్నాయి. ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో యాక్వస్ హ్యుమర్ ద్రవం చాలా నెమ్మదిగా బయటకు వెళ్తుంది. అందువల్ల అంధత్వం కూడా చాలా నెమ్మదిగా వస్తుంది. అందుకే దీన్ని ఇంగ్లిష్‌లో నిశ్శబ్దంగా చూపును దెబ్బతీసే దొంగ (స్నీక్ థీఫ్ ఆఫ్ ది సైట్)గా చెబుతుంటారు. క్లోజ్‌డ్ యాంగిల్ గ్లకోమాలో కంటి ముందు ఉండే ‘యాంగిల్’ భాగం అకస్మాత్తుగా సన్నబడిపోతుంది లేదా మూసుకుపోతుంది. దాంతో యాక్వస్ బయటకు ప్రవహించడానికి అవకాశం లేక కంటినరంపై ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ తరహా కేసుల్లో నొప్పి, కన్ను ఎరబ్రారడంతో పాటు చూపును కాస్త వేగంగా కోల్పోతారు.
2. సెకండరీ గ్లకోమా: 
ఈ తరహా గ్లకోమా కంటికి దెబ్బతగలడం (ట్రామా), కంటి కటకం (లెన్స్) దెబ్బతినడం, కంటిలో ఇన్ఫెక్షన్స్ వంటి కారణాల వల్ల వస్తుంది.
3. కంజెనిటల్ గ్లకోమా : 
ఇది చిన్నపిల్లల్లో వచ్చే గ్లకోమా. కొంతమందిలో పుట్టుకతోనే కంటిలో ఉండే యాక్వస్ ద్రవం బయటకు ప్రవహించదు. దాంతో కనుగుడ్డు మామూలు కంటే పెద్దదిగా ఉంటుంది. దీన్నే బూఫ్తాల్మస్ అంటారు. ఈ జబ్బు ఉన్న పిల్లల్లో కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. పిల్లలు కాంతిని చూడలేరు. ఈ పరిస్థితిని ఫొటోఫోబియా అంటారు. 
గ్లకోమా లక్షణాలు:
క్రమక్రమంగా చూపును కోల్పోవడం

ఇరుపక్కలా చూసే సామర్థ్యం (ఫీల్డ్ ఆఫ్ విజన్) క్రమంగా తగ్గడం

ఏదైనా చదువుతూ, చదువుతూ పక్కకు చూడాల్సి వచ్చినప్పుడు వెంటనే సరిగ్గా కనపడకపోవడం, వెంటవెంటనే అద్దాలు మార్చాల్సిన పరిస్థితి రావడం.

ఓ మోస్తరు నుంచి తీవ్రమైన తలనొప్పి

కన్ను ఎరబ్రారడం, కంట్లోంచి నీరు కారడం

లైట్ చుట్టూ రంగుల కాంతిపుంజాలు కనిపించడం
ఇందుకు మూడు రకాలుగా
చికిత్స చేయవచ్చు :  
1. వైద్యచికిత్స: 
కంట్లో చుక్కల మందులు వేయడం (ఈ చుక్కల మందులు జీవితాంతం వాడాలి)
2. లేజర్ చికిత్స:
  కొన్ని రకాల గ్లకోమాలకు మాత్రమే ఈ చికిత్స ఉపయోగపడుతుంది
3. శస్తచ్రికిత్స:
  పై పద్ధతుల వల్ల కంటిలోని ఒత్తిడి- ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ నియంత్రణలోకి రాకపోతే శస్తచ్రికిత్స అవసరమవుతుంది.

ఈ చికిత్సల ద్వారా కంటిలో ఉండే యాక్వస్ ద్రవం ఒత్తిడిని స్థిరంగా ఉంచడం వల్ల ఇకపై చూపు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకసారి గ్లకోమా ఉన్నట్లు తెలుసుకున్న తర్వాత ఆ రోగులు జీవితకాలం పాటు క్రమం తప్పకుండా కంటి వైద్యనిపుణుడితో ఫాలో-అప్‌లో ఉండటం, వారు సూచించినట్లుగా పరీక్షలను క్రమం తప్పకుండా చేయిస్తూ ఉండటం అవసరం. ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి తీసుకునే చికిత్స క్రమాన్ని డాక్టర్లు నిర్ణయిస్తుంటారు. మందులను మారుస్తుంటారు.
కనుక్కోవడానికి పరీక్షలివే
1.రొటీన్ ఐ ఎగ్జామినేషన్స్:
  అంటే ఇవి సాధారణ కంటి పరీక్షలు అన్నమాట.
 
2.ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ మెజర్‌మెంట్:
  కంట్లోని యాక్వస్ హ్యుమర్ ద్రవం కంటిపై కల్పించే ఒత్తిడికి కొలిచే పరీక్ష ఇది. ఇలా కొలవడాన్ని ‘టోనోమెట్రీ’ అని కూడా వ్యవహరిస్తారు. దీన్ని టోనోమీటర్ అనే సాధనంతో కొలుస్తారు. కంటిలో ఆక్వస్ ద్రవం ఏర్పరిచే ఒత్తిడిని ‘ఎంఎం ఆఫ్ హెచ్‌జీ’ అనే ప్రమాణాలలో కొలుస్తారు. సాధారణంగా ఇది 10 నుంచి 21 వరకు ఉంటే నార్మల్. అంతకంటే ఎక్కువగా ఉంటే యాక్వస్ ద్రవం ఒత్తిడిని కలగజేస్తోందని అర్థం.
3.ఫీల్డ్ టెస్ట్: 
మన కన్ను నేరుగా ముందుకు మాత్రమే గాక... పక్కలకు కూడా చూడగలుగుతుంది. దాదాపు 120 డిగ్రీల వరకు మనం పక్కకు చూడగలం. కానీ గ్లకోమా వచ్చినప్పుడు మనం పక్కకు చూసే పరిధి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఏ మేరకు తగ్గిందన్న విషయాన్ని ఫీల్డ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు. దీనికి ఉపయోగించే సాధనాన్ని ‘పెరీమీటర్’ అంటారు. ఇప్పుడు ఫీల్డ్ టెస్ట్ చేయడానికి అత్యంత ఆధునికమైన ఆటోమేటెడ్ కంప్యూటరైజ్‌డ్ ఫీల్డ్ అనలైజర్ అనే సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల గ్లకోమా తీవ్రత ఎంత ఉంది అన్న విషయాన్ని చాలా ముందుగానే (అర్లీస్టేజెస్‌లో) తేలికగా తెలుసుకోవచ్చు.
4.ఫండస్ టెస్ట్:
  కంటి నరం (ఆప్టిక్ నర్వ్) ఏమేరకు దెబ్బతిన్నది అనే విషయాన్ని అంచనా వేయడం కోసం ఉపయోగించే పరీక్ష ఇది. దీన్ని ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రామ్ (ఓసీటీ) అనే పరీక్షతో నిర్ణయిస్తారు. జీడీఎక్స్ (గ్లకోమా డయాగ్నస్టిక్ టెస్ట్) పరీక్ష ద్వారా కూడా కంటి నరం ఏ మేరకు దెబ్బతిన్నది అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. 
5.గోనియోస్కోపీ: 
కంటిలోని యాంటీరియర్ చాంబర్ యాంగిల్‌ను పరీక్షించే పద్ధతిని గోనియోస్కోపీ అంటారు. దీనివల్ల ఒక వ్యక్తికి భవిష్యత్తులో గ్లకోమా వచ్చే అవకాశం ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. సాధారణంగా 40 ఏళ్లు పైబడ్డ ప్రతివారికి ఈ పరీక్ష చేయాలి. దీని ద్వారా రోగులకు ఒక మేలు జరుగుతుంది. దృష్టి కోల్పోతున్న విషయాన్ని రోగులు గుర్తించక ముందే ఆ విషయాన్ని వైద్యులు కనుగొంటారు.
చాలామందిలో గ్లకోమా ఉన్నట్లే తెలియదెందుకు...?
గ్లకోమా ఉన్న రోగులకు చాలా కాలం గడిచేవరకు ఆ సంగతే తెలియదు. దీనికి అనేక కారణాలున్నాయి. అవి...

చాలామంది రోగుల్లో గ్లకోమా ఉన్నప్పటికీ బయటకు ఏ లక్షణాలూ కనిపించవు.

దాదాపు సగం మంది రోగుల్లో గ్లకోమా ఉన్నప్పటికీ ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ (ఐఓపీ) పరీక్షలో నార్మల్ అని రావచ్చు. ఈ కండిషన్‌ను నార్మల్ టెన్షన్ గ్లకోమా లేదా లో టెన్షన్ గ్లకోమా అని వ్యవహరిస్తారు.

కొన్నిసార్లు గ్లకోమా కండిషన్‌ను క్యాటరాక్ట్ (కంటిలోని తెల్ల పువ్వు) అని పొరపాటు పడే (మిస్‌డయాగ్నోజ్) అవకాశాలుంటాయి.

కొన్నిసార్లు క్యాటరాక్ట్‌తో కలిసి గ్లకోమా ఉండవచ్చు. అలాంటిప్పుడు క్యాటరాక్ట్‌కు మాత్రమే చికిత్స తీసుకుని దీన్ని విస్మరించవచ్చు. అలాంటి సందర్భాల్లోనూ గ్లకోమా క్రమంగా పెరిగి అంధత్వానికి దారితీయవచ్చు.  

గ్లకోమాను కనుగొనేందుకు అవసరమైన అధునాతన పరీక్షలు గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా అందుబాటులో లేకపోవడం... ఈ అంశాలన్నీ గ్లకోమా వల్ల అంధత్వం పెరగడానికి దోహదపడుతున్నాయి.
రిస్క్ ఎవరిలో ఎక్కువ...
నలభై ఏళ్లు పైబడిన వారిలో

కుటుంబ చరిత్రలో గ్లకోమా ఉన్నవారిలో

డయాబెటిస్ ఉన్నవారిలో

దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడుతున్నవారిలో

కంటికి దెబ్బ తగిలిన వారిలో


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top