సిమ్‌కార్డుతో టాక్‌టైం మాత్రమే కాదు.. నేరాలు ఘోరాలు కూడా ఉచితం! ఏమంటారు?


ఒకప్పుడు...కేవలం సెల్యులార్ నెట్‌వర్క్ ప్రొవైడర్ దగ్గర మాత్రమే లభిస్తూ దర్జా ఒలకబోసిన సిమ్ కార్డు మొహం ఇప్పుడు చిన్నబోయింది. మరీ ఎంత చీప్ అయిపోయిందంటే.. ఇప్పుడు ఏ వీధిలో చూసినా సిమ్‌కార్డు లభిస్తోంది. నిజానికి సెల్‌ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చిన కొత్తలో సిమ్ కార్డు పొందడమంటే పాస్‌పోర్టు పొందినంత కష్టమయ్యేది. అప్లికేషన్ పూర్తి చేసి, దానిపైన ఫొటో అంటించి, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్ జిరాక్స్ కాపీలు జతపరిచినా మళ్లీ 'వెరిఫికేషన్' అనేవాళ్లు. దానికో రెండ్రోజులు పట్టేది. ఆ తర్వాతే స్లిమ్‌గా ఉండే సిమ్ కార్డు చేతిలో పడేది.

ఇప్పుడు...పాన్‌షాప్‌లో క్రేన్ వక్కపొడి దొరికినంత సులభంగా సిమ్‌కార్డు దొరుకుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలలో చిన్న చిన్న దుకాణాలలో కూడా లభిస్తోంది. హైటెక్ నగరమైన హైదరాబాద్‌లో అయితే సిమ్‌కార్డు ఏకంగా వీధికెక్కింది. కొన్నిచోట్ల ఆయా నెట్‌వర్క్ ప్రొవైడర్లకు సంబంధించిన ఏజెన్సీల వారు రోడ్డు పక్కనే చిన్న గొడుగు లాంటిది పెట్టుకుని సిమ్ కార్డులు విక్రయించడం కనిపిస్తోంది.


ఎందుకిలా?
సెల్యులార్ నెట్‌వర్క్ ప్రొవైడర్ల నడుమ తలెత్తిన పోటీ తత్వమే సిమ్ కార్డు ఇంత చీప్ అయిపోవడానికి కారణం. సబ్‌స్క్రయిబర్ల సంఖ్య పెంచుకోవాలన్న తాపత్రయమే వారి చేత తక్కువ ధరకే సిమ్ విక్రయించేలా చేస్తోంది. ఎవరికి వారు అధిక వినియోగదారులు తమ నెట్‌వర్క్‌నే వినియోగించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పండుగలు, జాతీయ పండుగల దినాలలో రెట్టింపు టాక్‌టైం వంటి ఆఫర్లను కూడా అందించడానికి ఆయా నెట్‌వర్క్ ప్రొవైడర్లు వెనకాడడం లేదు.

ఆఫర్ల వెల్లువ..
మార్కెట్‌లోకి వచ్చిన తొలినాళ్లలో ప్రీపెయిడ్ సిమ్‌కార్డు ధర రూ.299 ఉండేది. బిఎస్ఎన్ఎల్ అనంత్ పీప్రెయిడ్ సిమ్‌కార్డు పొందాలంటే రూ.1000 చెల్లించాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఏ సెల్యులార్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ప్రీపెయిడ్ సిమ్‌కార్డు అయినా రూ.10, రూ.5, రూ.1కే లభిస్తోంది. కొన్ని చోట్ల అయితే సిమ్‌కార్డు ఫ్రీ. మొబైల్ వినియోగదారులకు ఉచితంగా ఇస్తూ మొట్టమొదటి రీఛార్జికి మాత్రం డబ్బు వసూలు చేస్తున్నారు. అంతేకాదు, రూ.1 సిమ్‌కార్డుకు రూ.30-60 వరకు టాక్‌టైం ఇస్తుండడంతో వినియోగదారులు కూడా ఆకర్షితులవుతున్నారు. ప్రైవేటు నెట్‌వర్క్ ప్రొవైడర్ల పోటీని తట్టుకునేందుకు ఈమధ్య బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్‌లకు సంబంధించి సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఉన్న వారికి ఫ్రీగా సిమ్‌కార్డు అందిస్తోంది. అంతేకాదు, ఈ సిమ్ నుంచి ల్యాండ్‌లైన్‌కి కాల్స్ ఉచితం అని కూడా సెలవిస్తోంది.

  • పాన్‌షాప్‌లో వక్కపొడి దొరికినంత సులభంగా ఇప్పుడు సిమ్‌కార్డు దొరుకుతోంది.
  • సెల్యులార్ నెట్‌వర్క్ ప్రొవైడర్ల నడుమ తలెత్తిన పోటీ తత్వమే దీనికి కారణం.
  • డ్యూయల్ సిమ్ ఫోన్ల వాడకం వల్ల సిమ్ కార్డుల కొనుగోలు కూడా పెరిగింది.
  • ఏ సెల్యులార్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ప్రీపెయిడ్ సిమ్‌కార్డు అయినా ఇప్పుడు రూ.1కే లభిస్తోంది.
  • రూ.1 సిమ్‌కార్డుకు రూ.30-60 వరకు టాక్‌టైం లభిస్తోంది.
  • తమ ల్యాండ్‌లైన్ ఉన్న వారికి బిఎస్ఎన్ఎల్ ఫ్రీగా సిమ్‌కార్డు ఇస్తోంది. పైగా ఈ సిమ్ నుంచి ల్యాండ్‌లైన్‌కి అపరిమిత కాల్స్ ఉచితం.
  •   'మొబైల్ నంబర్ పోర్టబులిటీ' నేపథ్యంలో కొత్త సబ్‌స్క్రయిబర్లపైనే నెట్‌వర్క్ ప్రొవైడర్లు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఫలితంగా ఆఫర్ల వెల్లువలో సిమ్ కార్డు ధర అనూహ్యంగా పడిపోయి వినియోగదారులకు టాక్ టైంను పండిస్తోంది.
  •   చాలామంది మొబైల్ వినియోగదారులు ఔట్‌గోయింగ్ టాక్‌టైం అయిపోగానే సిమ్‌కార్డును పారవేస్తున్నారు.
  •  ఇలాంటి సిమ్‌కార్డులు సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో పడితే, వాటితో వారు ఏవైనా నేరాలకు పాల్పడితే.. వాటి అసలు యజమానులకే ప్రమాదం.

ఎవరికెంత లాభం?
పోటీ వాతావరణం కారణంగా వినియోగదారులను ఆకట్టుకోవడమే ఇప్పుడు నెట్‌వర్క్ ప్రొవైడర్ల ప్రధాన లక్ష్యంగా మారింది. దీంతో ఇటు సెల్యులార్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు మాత్రమే కాక, అటు మొబైల్ వినియోగదారులు కూడా లాభపడుతున్నారు. 'మొబైల్ నంబర్ పోర్టబులిటీ' అమలులోకి వచ్చిన నేపథ్యంలో చేజారిపోతున్న సబ్‌స్క్రయిబర్ల కంటే కూడా కొత్తగా వచ్చి చేరుతున్న సబ్‌స్క్రయిబర్లపైనే ఎవరికి వారు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీంతో సిమ్ కార్డు ధర అనూహ్యంగా పడిపోయి వినియోగదారులకు టాక్ టైంను పండిస్తోంది.

తక్కువ డబ్బుకు ఎక్కువ టాక్‌టైం వస్తుండడంతో సిమ్‌కార్డుల కొనుగోలు జోరందుకుంది. "నా జేబులో ఎప్పుడూ మూడు నాలుగు సిమ్‌కార్డులు ఉంటాయి. ఏ నెట్‌వర్క్ ఫోన్‌కు కాల్ చేయాలంటే ఆ నెట్‌వర్క్ సిమ్‌కార్డు ఉపయోగిస్తుంటాను. దీనివల్ల కాల్ రేట్ చాలా తక్కువ అవుతుంది. టాక్‌టైం ఉన్నంత వరకు మాట్లాడి తర్వాత సిమ్‌కార్డు చెత్తకుండీలోకి విసిరేస్తాను. జస్ట్ రూపాయి పెడితే ఏ నెట్‌వర్క్ సిమ్‌కార్డు  అయినా దొరుకుతోంది కాబట్టి నో ప్రాబ్లం..'' అంటాడు అమీర్‌పేట్ ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్న వెంకట్.

విద్రోహుల చేతుల్లో పడితే?
చాలామంది మొబైల్ వినియోగదారులు ఔట్‌గోయింగ్ టాక్‌టైం అయిపోగానే సిమ్‌కార్డును ఒక పనికి రాని వస్తువుగా చూస్తూ వీధుల పాలు చేస్తున్నారు. నిజానికి ఔట్‌గోయింగ్ టాక్‌టైం అయిపోయినా సిమ్‌కార్డుకు కొంతకాలం ఇన్‌కమింగ్ సౌకర్యం ఉంటుంది. ఇలాంటి సిమ్‌కార్డులు సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో పడితే ఎంత ప్రమాదమో దాన్ని విసిరి పారేసే వారు ఆలోచించాలి. ఇతరులు ఎవరైనా దాన్ని చేజిక్కించుకుని ఎక్స్‌ట్రా టాక్‌టైం(టాప్ అప్) వేయించి దాన్ని వినియోగించుకునే వీలుంటుంది. ఇలా వినియోగించుకునే వారు ఒకవేళ ఏదైనా నేరానికి పాల్పడితే, పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా విచారిస్తే.. ఆ నేరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా దాని అసలు యజమాని ఇరుక్కోవలసి వస్తుంది. దీని అర్థం ఏమిటంటే.. సిమ్‌కార్డుతో టాక్‌టైం మాత్రమే కాదు.. నేరాలు ఘోరాలు కూడా ఉచితం! ఏమంటారు?

 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top