కాబోయే తల్లిలో ఉండే చిన్న చిన్న సమస్యలు - పరిష్కారాలు

వికారం.. వాంతులు.. అజీర్ణం.. మలబద్ధకం.. కాళ్లవాపు.. గర్భం ధరించింది మొదలు ఇలాంటివెన్నో బాధిస్తాయి.. కాబోయే తల్లిలో ఈ సమస్యలు సహజమే కానీ.. అన్ని సమయాల్లో మాత్రం కాదు. ఎందుకో తెలుసుకోండి మరి.

కొందరికి ఐదారు నెలలు, మరికొందరికి నవమాసాలూ వికారం, వాంతులు బాధిస్తాయి. ఈ ఇబ్బందులు ఆరోగ్యకరమైన గర్భధారణకు సూచన అని అధ్యయనాల్లో తేలింది. ఇలాంటి సమస్యలు లేనివారితో పోలిస్తే.. ఉన్నవారిలో గర్భస్రావాలు, గర్భస్థశిశువు చనిపోవడం, వంటివన్నీ చాలా తక్కువగా ఉంటాయి.

గర్భం దాల్చిన తొలినాళ్లలో హార్మోన్ల స్థాయుల్లో తేడాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో ఈస్ట్రోజెన్‌ స్థాయిపెరుగుతుంది. దాంతో వాంతులు, వికారం విపరీతంగా ఉంటాయి.
 వీలున్నప్పుడల్లా విశ్రాంతి..రకరకాల పనులతో అలిసిపోయే కొద్దీ ఈ వికారం మరింత పెరుగుతుంది. అందుకే వీలున్నప్పుడల్లా విశ్రాంతి తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో మంచినీళ్లు లేదా ద్రవ పదార్థాలు తాగితే.. వాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే.. కొంచెం కొంచెం తరచూ తాగాలి. ఆహారానికీ ఇదే వర్తిస్తుంది. అయితే కొవ్వుశాతం తక్కువగా, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. వేడివేడి పదార్థాల కన్నా.. కాస్త చల్లగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పదార్థాల నుంచి వచ్చే వాసనతో బాధించే వికారాన్ని దీనివల్ల నివారించవచ్చు. నిద్రలేచే ముందు ఓ బిస్కెట్‌ తినాలి. అయినా మార్పు రానప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తే.. మందులు సిఫారసు చేస్తారు.

ఒకవేళ పై సమస్యలతోపాటు.. మూత్రం మరీ ముదురు రంగులో వస్తున్నా, ఎనిమిది గంటలకు పైగా మూత్రవిసర్జన చేయకపోయినా, పొతికడుపులో నొప్పిగా ఉన్నా, జ్వరం, విపరీతంగా నీరసంగా అనిపిస్తున్నా, కళ్లు తిరుగుతున్న భావన కలిగినా, వాంతి చేసుకున్నప్పుడు నెత్తురు కనిపించినా, అదేపనిగా వాంతులు అవుతున్నా.. ఇరవైనాలుగ్గంటలకు పైగా ఘన, ద్రవపదార్థాలు తీసుకోకపోయినా.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
అజీర్ణం.. నివారణ..గుండెలో మంట, తీసుకున్న ఆహారం గొంతులోకి వస్తున్నట్లు అనిపించినా.. వికారం లేదా వాంతి.. వంటి లక్షణాలు అజీర్ణ సమస్యను సూచిస్తాయి.పొట్టలో అసౌకర్యంగా అనిపించే ఈ సమస్య చాలామంది గర్భిణుల్ని ఏదో ఒక సమయంలో బాధిస్తుంది. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ ఇదీ ఎక్కువగా వేధించవచ్చు. హార్మోన్ల స్థాయుల్లో తేడాలు, పొట్టలో ఒత్తిడి పెరగడం, ఉదరంలోని ఆమ్లాలు.. జీర్ణాశయంలోని పొరకు చేరినప్పుడు అజీర్ణ సమస్య ఎదురవుతుంది.

పోషకాహారాన్ని ఎంచుకోవాలి. పొట్ట నిండుగా ఆహారం ఉన్నప్పుడు అజీర్ణం అధికమవుతుంది. అందుకే.. కొద్దికొద్దిగా తరచూ తీసుకోవాలి. ఆహారంలోనూ కార్బోహైడ్రేట్లు, పండ్లు, కూరగాయలు, మాంసకృత్తులు, పాల ఉత్పత్తులు.. ఉండేలా చూసుకోవాలి. కాఫీ, కొవ్వు శాతం పదార్థాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. కెఫీన్‌ ఆధారిత పదార్థాలను పూర్తిగా తగ్గించాలి.నిద్రించేందుకు మూడుగంటల ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి. తల కాస్త ఎత్తుగా ఉంచి పడుకోవాలి. అయినా అసౌకర్యంగా ఉన్నట్లయితే వైద్యుల సలహాతో మందులు వాడవచ్చు.
 మలబద్ధకానికి పరిష్కారం..ఈ సమయంలో హార్మోన్లు కండరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దాంతో జీర్ణాశయం మనం తీసుకునే ఆహారం కన్నా.. నీటిని ఎక్కువగా స్వీకరిస్తుంది. దానికి తోడు వాడే కొన్ని రకాల ఐరన్‌ మాత్రలు, వ్యాయామం చేయకపోవడం.. వంటివన్నీ మలబద్ధకానికి దారితీస్తాయి.
 ఇలా నివారించాలి..ద్రవపదార్థాల మోతాదును పెంచాలి. తాజాపండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. పీచుశాతం ఎక్కువగా ఉన్న పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాఫీ, టీ, కోలాల్లాంటివి తగ్గించాలి.చురుగ్గా ఉండాలి. వ్యాయామం చేసినా మార్పు ఉంటుంది. నడక, యోగా.. వంటివన్నీ మలబద్ధకాన్ని అదుపులో ఉంచుతాయి. వ్యాయామాన్ని వైద్యుల సలహాతో ఎంచుకోవాలి.
 పాదాల నొప్పి.. వాపులుంటే..ఈ సమయంలో బరువు పెరగడం సహజం. అలా పెరిగిన బరువంతా మోకాళ్లు, కాళ్లపై పడుతుంది. దాంతో నొప్పి బాధిస్తుంది.నెలలు గడిచేకొద్దీ గర్భసంచి సాగుతుంది. ఆ బరువు కాస్తా కటి వలయం, కాళ్లలోని రక్తనాళాలపై పడుతుంది. దాంతో రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. ఫలితంగా శరీరంలోని నీటిశాతం కాళ్లలోకి చేరుతుంది. అదే కాళ్ల వాపు (ఎడీమా).
 ఈ జాగ్రత్తలు తప్పనిసరి..సౌకర్యంగా ఉన్న పాదరక్షల్ని ఎంచుకోవాలి. ఈ సమయంలో పాదరక్షల్ని సాయంత్రం వేళ కొనుగోలు చేయాలి. అప్పుడే పాదాల ఆకృతిని సరిగ్గా గుర్తించవచ్చు. నడుం వాల్చినప్పుడు కూడా పాదాల్ని ఎత్తుగా ఉంచాలి. ఎక్కువ సమయం కూర్చుని పనిచేయాల్సి వస్తే.. పాదాలకు ఆసరాగా చిన్న బల్లను వేసుకోవాలి. కూర్చున్నప్పుడు కాలిమీద కాలు వేసుకోకూడదు. సౌకర్యవంతంగా కూర్చోవాలి. వీలున్నప్పుడల్లా కాళ్లను చాపాలి. అప్పుడప్పుడు పాదాలను గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. అదేపనిగా కుర్చున్నా.. నిల్చున్నా కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు నడుస్తుండాలి. దీనివల్ల పాదాల్లో రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది. వ్యాయామంలో భాగంగా నడకను ఎంచుకుంటే మంచిది. శరీరంలో తేమ శాతం ఉండేందుకు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. కాళ్లవాపుతో పాటు.. ముఖం కూడా ఉబ్బినట్లు కనిపించినా.. చేతుల్లోనూ మార్పు ఉన్నా.. వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. అది అధిక రక్తపోటుకు కారణం కావచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top