మధుమేహం -- చాలా మందికి ఉన్నట్టే తెలియదు! - మధుమేహంలో ప్రధాన లక్షణాలు


మధుమేహం సాధారణంగా కనిపించే వ్యాధే. చాలామందికి ఇది ఉన్నట్టే తెలియదు. కాని నలభై ఐదు సంవత్సరాల వయస్సున్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు మెండు. మనదేశంలో ఈ వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరుగుతున్నారు. మనిషిలో ఇన్సులిన్ హార్మోన్ పనితీరు దెబ్బతినప్పుడు ఇది బయటపడుతుంది. శరీరం గ్లూకోజును సమర్ధవంతంగా వినియోగించుకోనప్పుడు ఈ మధుమేహం వస్తుంది. దీనివల్లే గ్లూకోజు రక్తంలో సంచితమై అవాంఛనీయ లక్షణాలను, సమస్యలను ఉత్పన్నం చేస్తుంది. ఈ మధుమేహంలోను రెండురకాలున్నాయ. వాటిని టైప్-1 డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ అని అంటారు.

టైప్-1 డయాబెటిస్: 
ఇన్సులిన్ ఆధారిత మధుమేహం ఇది. ఈ రకం మధుమేహం హఠాత్తుగా మొదలై వేగంగా పురోగమిస్తుంది. సాధారణంగా చిన్నతనంలోనే మొదలవుతుంది. ప్యాక్రియాస్ గ్రంధి ఇన్సులిన్‌ని పూర్తిగా తయారు చేయలేకపోవడం వల్లగాని లేదా బాగా అల్పమొత్తాల్లో తయారుచేయడం వల్లగాని ఈ స్థితి ప్రాప్తిస్తుంది. ఈ వ్యాధి స్థితి ప్రాప్తించిన వారు రోజువారీగా ఇన్సులిన్‌ని ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటూ ఆహారాన్ని నిర్దేశిత రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ లేని రోజుల్లో అంటే 1921వ సంవత్సరం కంటే ముందు ఈ వ్యాధి వచ్చినవారు ఎక్కువకాలం జీవించగలిగేవారు కాదు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావటం, పిల్లలైతే మూత్రవిసర్జన మీద నియంత్రణ వచ్చిన తరువాత కూడా పక్క తడపటం, ఎక్కువగా దప్పిక వేయటం, ఆకలి విపరీతంగా వేయటం, ఉన్నట్లుండి బరువు తగ్గిపోవటం, నిస్త్రాణ, బలహీనత, చిరాకు, వాంతులు, వికారం వంటివి ఈ రకం మధుమేహంలో ప్రధాన లక్షణాలు.
టైప్-2 డయాబెటిస్:

దీనిలో వెలుపల నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీని ప్రాదుర్భావం నెమ్మదిగా జరుగుతుంది. శరీరం సరైన రీతిలో ఇన్సులిన్‌ని వినియోగించుకోలేనప్పుడు ప్రాప్తించే వ్యాధి స్థితి ఇది. సాధారణంగా ఈ రకం మధుమేహం ఆహార నియంత్రణతోనూ, సరైన వ్యాయామం తోనూ నియంత్రణలో ఉంటుంది. కొంతమందికి మాత్రం రక్తంలోని చక్కెరను స్థిరపర్చడానికి వౌఖికంగా గాని లేదా ఇంజెక్షన్ రూపంలో గాని ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరముంటుంది. ఇలాంటి స్థితుల్లో ఆయుర్వేదం ఉపయోగపడుతుంది. ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండటం, శారీరకంగా చైతన్యవంతంగా ఉండటం, మానసిక ఒత్తిళ్ళ నుంచి దూరంగా ఉండటం వంటి వాటి ద్వారా ఈ తరహా మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. ఇది సాధారణంగా పెద్దల్లో కనిపించేదైనప్పటికీ, ఇటీవల కాలంలో యువకుల్లో సైతం కనిపిస్తోంది. ఈ రకం మధుమేహంలో టైప్-1 మధుమేహంలో చెప్పుకున్న లక్షణాలతో పాటు అదనంగా కళ్ళు మసకబారటం, చూపు తగ్గిపోవటం, కాళ్ళూ, పాదాలూ వేళ్లల్లో తిమ్మిర్లుగా మొద్దుబారినట్లు అనిపించటం, హస్త, పాదాల్లో సూదులు గుచ్చినట్లు చిటపటగా అనిపించటం, కాళ్ళమీద గాయమైనప్పుడు త్వరగా మానకపోవటం, తరచుగా చర్మసంబంధమైన ఇనెఫక్షన్లు వస్తుండటం, చర్మం మీద దురదగా అనిపించటం, మగతగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


గర్భిణీల్లో వచ్చే జోస్టేషనల్ డయాబిటిస్:
హార్మోన్లలో సంభవించే తేడాలవల్ల గర్భధారణ సమయంలో కొంతమందిలో ఈ రకం మధుమేహం ప్రాప్తిస్తుంది. సాధారణంగా ప్రసవానంతరం ఈ రకం మధుమేహం తగ్గిపోతుంది. అయితే ఇలా గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చిన వారిలో సగానికి సగం మందిలో తరువాత వయసులో టైప్-2 మధుమేహం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి వారు ఆహార వ్యాయామాదుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 
పరతంత్ర కారణాలవల్ల వచ్చే సెకండరీ డయాబెటిస్:
స్టరాయిడ్స్ వంటి కొన్ని రకాల మందులను వినియోగించటం, రసాయనాలకు గురికావటం వంటి కారణాలవల్ల ప్యాంక్రియాస్ దెబ్బతిని మధుమేహం ప్రాప్తించే అవకాశం ఉంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా ఇంపెయిర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్: 

ఈ రకం స్థితిలో మధుమేహానికి ముందు ఈ స్థితి నెలకొంటుంది. దీనిని పూర్వం రోజుల్లో లేటెంట్ డయాబెటిస్ అని పిలిచేవారు. దీనిలో రక్తంలోని బ్లడ్ షుగర్ సాధారణ స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే మధుమేహ వ్యాధిని కలిగించగలిగినంత ఎక్కువగా ఉండదు. ఈ రకం వ్యాధి స్థితిని ఆహార వ్యాయామాదులతో అదుపులో ఉంచుకోవచ్చు.
మొదటి రకం మధుమేహం శరీరంలో ఇన్సులిన్ తయారుకానప్పుడు వస్తుంది. ఎక్కువగా పిల్లల్లోను, యువకుల్లోను కనిపిస్తుంటుంది. రెండవరకం మధుమేహం శరీరంలో తయారైన ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోలేనప్పుడు వస్తుంది. ఇది సాధారణంగా పెద్దల్లో కనిపించేదైనప్పటికీ ఇటీవల కాలంలో యువకుల్లో సైతం కనిపిస్తోంది.
మధుమేహ లక్షణాలకు కారణాలు

తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావటం: 
శరీరంలో చక్కెర మోతాదు పెరిగిపోయినప్పుడు శరీరం కిడ్నీల ద్వారా దానిని బైటకు పంపే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
 అతిగా దాహం వేయటం:

శరీరం నుంచి నీరు ఎక్కువగా విసర్జిమైనప్పుడు, దానిని సరిదిద్దుకోవడానికి మెదడు శరీరానికి సంకేతాలు పంపుతుంది. ఫలితంగా నోరు తడారి పోవటం, దాహం వేయటం జరుగుతాయి.
 చర్మం పొడారిపోయి దురదలు పెట్టడం: 

ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావటంతో శరీరం నిర్జలీయంగా మారి (డీహైడ్రేషన్) చర్మం పొడారి పోతుంది. స్నిగ్ధత కోల్పోవటం వల్ల దురదలు ఉత్పన్నమవుతాయి. అలాగే రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండటంవల్ల వ్యాధి రక్షణ శక్తి తగ్గటంతో పాటు బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు పెరిగి ఇన్‌ఫెక్షన్లకు ఆస్కారం ఏర్పడుతుంది.
 గాయాలు త్వరగా మానకపోవటం: 

రక్తం ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు పోషక తత్వాలు, ప్రాణవాయువు అందుతుంటాయన్న సంగతి తెలిసిందే. మధుమేహంలో రక్తనాళాలు పూడుకుపోయేందుకు అవకాశం ఉంది. గాయమైన చోటుకు రక్తసరఫరా సరిగ్గా జరుగనందున గాయం మానడానికి చాలాకాలం పడుతుంది.
చూపు మసకబారటం:
మధుమేహం వల్ల శరీరంలో జలీయాంశం తగ్గినప్పుడు కంటి కటకంలోని చక్కెర శాతంలోను, నీటి శాతంలోనూ మార్పులు సంభవించి చూపు దెబ్బతినటం జరుగుతుంది.
 ఎక్కువగా ఆకలి వేస్తుండటం:

మధుమేహం మూలంగా శరీరంలో ఇన్సులిన్ మోతాదు తగ్గినప్పుడు రక్తంలోని చక్కెర రూపంలో ఉన్న ఆహార తత్వాలను కణజాలాలు గ్రహించలేవు. (ఆహారం తీసుకున్నప్పటికీ) దీనితో ఈ కణజాలాలు పోషకతతత్వాల కోసం మెదడును చైతన్య పరిచి ఆకలి పెరిగేలా చేస్తాయి.
  బరువు కోల్పోవటం:
ఆహారం సరిగ్గా తీసుకుంటున్నప్పటికీ బరువు కోల్పోవటానికి కారణం, ఇన్సులిన్ లోపంవల్ల శారీరక కణజలాలు ఆహార తత్వాలను గ్రహించలేక పోవటమే. పోషక తత్వాలు పరిపూర్ణంగా అందకపోవటంతో శరీరం శక్తికోసం కొవ్వు నిల్వలను వినియోగించుకుంటుంది. దీనితో, శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గి సన్నబడిపోతారు.
తిమ్మిరు:
కాళ్ళు చేతల్లో తిమ్మిర్లు పట్టినట్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం: మధుమేహం దీర్ఘకాలం నుంచీ ఉన్నప్పుడు నరాలు దెబ్బతిని తిమ్మిర్లు మంటలు అనిపిస్తాయి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top