ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో - ‘డబ్బింగ్ వాసనలు’

ఛానల్స్ మధ్య ప్రస్తుతం విపరీతమైన పోటీ నడుస్తోంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను తమ ఛానల్ నుండి తల తిప్పకుండా చేసుకోవడానికి యాజమాన్యాలు అనేక కసరత్తులు చేస్తున్నాయి. రేటింగ్‌ని పెంచుకోవడానికి ఎవరి పంథా వారిది. న్యూస్ ఛానల్స్ సెనే్సషన్ కోసం తహతహలాడితే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ క్రేజీ సీరియల్స్, గేమ్స్ షోలను రూపొందించడంలో మునిగిపోతున్నాయి.
 

సీరియల్‌ని వీక్షిస్తే జీవితకాలం సరిపోదనేది ఛలోక్తి. సీరియల్స్‌ని జీడిపాకంతో పోల్చి కూడా మాట్లాడతారు. దానిలో నిజం కూడా లేకపోలేదు. అరగంట సమయంలో అసలు సరుకు పది నిమిషాలే. మిగతాదంతా నటుల ఎక్స్‌ప్రెషన్స్, దర్శకుల టేకింగ్స్. నిత్యం భూమి కక్ష్యలో తిరుగుతున్నట్లే సీరియల్ ఒకే పాయింట్ చుట్టూ రోజుల తరబడి తిరగడం కనిపిస్తుంది. అందుకే ఎన్ని రోజులు చూడకపోయినా ఏ మాత్రం డౌట్ లేకుండా ఫాలో అయిపోవచ్చుననేది ప్రేక్షకుల ధీమా.

గేమ్ షోల ఊపు పెరిగిపోవడంతో ప్రముఖులు సైతం యాంకర్లుగా దర్శనమిస్తూ వారి క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో బ్రహ్మానందం వంటి వారు ఫెయిల్ అయినా సాయికుమార్, జగపతిబాబు వంటి హీరోలు బ్రహ్మాండంగా క్లిక్ కావడం జరిగింది. వెండి తెరపై వెలిగిన నటీనటులు బుల్లితెరనే ప్రస్తుతం సేఫ్‌గా భావించి ఏ మాత్రం బెదురు లేకుండా తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు.
 

సీరియల్స్ విషయానికొస్తే ఛానల్స్ అవతరించిన తొలి నాళ్లలో కష్టపడి రూపొందించి ప్రేక్షకులకు అందించేవి. ఇప్పటికే ఆ పద్ధతిని ఫాలో అవుతూ ఎక్కువ సీరియల్స్ ప్రసారమవుతున్నా పైలట్ ఎపిసోడ్స్‌లోనే రేటింగ్‌ని సాధించలేకపోతే మరి కొంతకాలం బహుమతులతో కాలక్షేపం చేయాల్సి వస్తుంది. ఆ తరువాత కూడా ప్రేక్షకాదరణ అందుకోలేకపోతే ప్యాకప్ చెప్పక తప్పడం లేదు. సీరియల్స్ లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ నడవడం కష్టం. ఆదిలోనే సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే పాపులర్ ఛానల్స్‌లో యాడ్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంతేగాక మొదట్లోనే బహుమతులను ప్రకటించాల్సి వస్తుంది. అవసరమైతే పాపులర్ ఛానల్‌లో కొన్ని ఎపిసోడ్స్ ప్రసారం చేసి ప్రేక్షకులను ఆకర్షించి తదుపరి తమ ఛానల్‌కి ప్రేక్షకులతోపాటు తెచ్చుకోవాల్సి వస్తుంది.
 

డబ్బింగ్ సీరియల్స్‌కి ఆదరణ పెరిగితే వందలాది మంది ఆర్టిస్టు టెక్నీషియన్లు ఘోరంగా దెబ్బతింటారు. డబ్బింగ్ ప్రక్రియ వలన నిర్మాత నష్టాలను ఇట్టే అధిగమించగలిగినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిలో వెనుకబడి పోతున్నట్లే ఛానల్స్ పరిశ్రమ కూడా వెనక్కి నెట్టివేయబడుతుంది. డబ్బింగ్ ప్రక్రియలో సాధారణ సీరియల్స్‌ని ప్రోత్సహించకపోవడం మంచిది. భారీ వ్యయంతో నిర్మించబడే చారిత్రాత్మక సీరియల్స్‌నే డబ్బింగ్‌కి తీసుకోవడం నిర్మాతల భవిష్యత్‌కి మంచిది.


ఈనాడు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థల అధిపతులు సైతం బుల్లితెరపై సీరియల్స్, గేమ్ షోలతో వ్యాపారం మొదలు పెడుతున్నారు. హిందీలో జితేంద్ర కుమార్తెలు శ్రీ బాలాజీ టెలీ ఫిలింస్ పతాకంతో అరంగేట్రం చేసి ప్రస్తుతం పలు భాషల్లో సీరియల్స్ నిర్మిస్తూ దాదాపు 500 కోట్ల టర్నోవర్‌తో వున్నారు. దక్షిణాదికొస్తే రాడాన్ పిక్చర్స్‌పై రాధిక మొదట తమిళంలో అరంగేట్రం చేసి వాటినే డబ్బింగ్ చేస్తూ ఇతర భాషల్లో పాపులరై కోట్లాది రూపాయల టర్నోవర్ చేస్తోంది.
 

సురేష్ ప్రొడక్షన్స్ గతంలో సీరియల్స్ తీయగా ప్రస్తుతం దాసరి తారకప్రభు సంస్థ, అక్కినేని అన్నపూర్ణ సంస్థ, శ్యాంప్రసాద్‌రెడ్డి మల్లెమాల సంస్థ, రాధిక రాడాన్ పిక్చర్స్, అశ్వనీదత్ వైజయంతీ సంస్థ, రామోజీరావు ఉషాకిరణ్ సంస్థ తెలుగులో మంచి జోరు మీదున్నాయి. ఇవేకాక అనేక సంస్థలు సీరియల్స్ గేమ్ షోల నిర్మాణంలో మంచి రేటింగ్‌తో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం సీరియల్స్ నిర్మాణం వలన సంవత్సరాల తరబడి అర్టిస్టులు బిజీగా మారిపోతున్నారు. ఒక వారంలో ప్రతి రెండ్రోజులు ఒక సీరియల్ కేటాయిస్తూ డబ్బింగ్ చెప్పే తీరిక కూడా లేక గడుపుతున్నారు. అయితే రేటింగ్ లేకపోతే సీరియల్ మూతపడి పోయే పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు నష్టపోతున్నారు. అందుకే సీరియల్స్‌ని డైరెక్ట్‌గా నిర్మించే కంటే డబ్బింగ్ చేసి అపసారం చేయడంలో అటు నిర్మాతలు, ఛానల్స్ వారు ఉత్సాహం చూపుతున్నారు.
 

ప్రస్తుతం డైరెక్ట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో, కలెక్షన్లను కొల్లగొట్టడంలో ఎలా ముందుంటున్నాయో డబ్బింగ్ సీరియల్స్ కూడా అలాగే కొనసాగుతున్నాయి. చిన్నపిల్లల సీరియల్స్ నుండి పెద్దల సీరియల్స్ వరకూ ఛానల్స్ డబ్బింగ్ సీరియల్స్‌కే ప్రాధాన్యతనిస్తూ రేటింగ్ పెంచుకునే దిశగా సాగుతున్నాయి. చిన్నారి పెళ్లికూతురు, మహాభారతం, రామాయణం, శ్రీకృష్ణ, అభీరా, ఝాన్సీ లక్ష్మీబాయి, గురు రాఘవేంద్ర, పంచతంత్రం తోపాటు అనేక సీరియల్స్ తెలుగులోకి అనువదించబడి ఆకర్షిస్తున్నాయి. రాడాన్, బాలాజీ పిక్చర్స్ సీరియల్స్ డబ్బింగ్, రీమేక్ ప్రక్రియలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. డబ్బింగ్ వాసన నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో తెలుగు టీవీ సీరియల్ నిర్మాతలు కూడా ప్రముఖ నవలలను తెర కెక్కించడంతోపాటు కొత్త తరహా ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో సీరియల్స్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌లో సగటున 4 సీరియల్స్ డబ్బింగ్‌వి ప్రసారం కావడం విశేషం. డబ్బింగ్ సీరియల్స్ జోరుగా కొనసాగితే మన నేటివిటీ కథలు తెర మరుగై ప్రస్తుత సినీ పరిశ్రమ పరిస్థితులే ఛానల్స్‌కి కూడా ఎదురౌతాయి. ఆలోచించి ప్రస్తుత నిర్మాతలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top