స్టార్‌ప్లస్ స్టెప్పులకు హృతిక్ జడ్జిమెంట్

దాదాపు అన్ని టెలివిజన్ చానెళ్లలో తప్పనిసరి ప్రోగ్రామ్‌గా ఉంటోన్న డ్యాన్స్ రియాలిటీ షో త్వరలో కొత్త ఫార్మాట్‌లో స్టార్ ప్లస్‌లో రాబోతోంది. ‘జస్ట్ డ్యాన్స్’ పేరుతో మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని హృతిక్‌రోషన్ ప్రారంభిస్తారు. డ్యాన్స్ పోటీలో పాల్గొన్న వారి నాట్య నైపుణ్యానికి మార్కులేసే గురుతరమైన బాధ్యతను హృతిక్ మీద పెట్టింది స్టార్‌ప్లస్. బహుశా జూన్‌లోనో, జూలైలోనో మొదలు కాబోయే ఈ కార్యక్రమానికి ప్రోమోల చిత్రీకరణ ప్రక్రియ పూర్తయింది.

ప్రోమోల షూటింగ్ కోసం హృతిక్ ఏకబిగిన 17 గంటల పాటు పని చేశాట్ట! గడిచిన సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన షూటింగ్ మంగళవారం తెల్లవారు జామున రెండు గంటల వరకు సాగింది. ఈ రియాలిటీ షో కోసం హృతిక్ సినిమాకు పనిచేసినంతగా కష్టపడడం స్టార్ ప్లస్ నిర్వాహకులకు సంతృప్తినిచ్చింది. తామిచ్చే రెండు కోట్లు గిట్టుబాటవుతాయన్న నమ్మకం కూడా కుదిరి ఉండవచ్చు. అవును! జస్ట్ డ్యాన్స్ కోసం ఎపిసోడ్‌కి రెండు కోట్లరూపాయలివ్వడానికి ఒప్పందం కుదిరింది.

గుజారిష్, కైట్స్ సినిమాలు ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఇంత భారీ రెమ్యూనరేషన్ చెల్లించడానికి స్టార్‌ప్లస్ ముందుకు రావడం విశేషమే. ప్రేక్షకుల జడ్జిమెంట్, బయ్యర్ల జడ్జిమెంట్ హృతిక్‌కు ప్రతికూలంగా ఉన్నా హృతిక్ జడ్జిమెంట్ రాగద్వేషాలకు, ప్రాంతీయ విభేదాలకు, జాతి భేదాలకు అతీతంగా ఆచితూచి ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ‘జస్ట్ డ్యాన్స్’ షోలో ప్రపంచస్థాయిలో అన్ని దేశాల వారూ పాల్గొంటారు. అంటే హృతిక్ ముఖ కవళికల మీద, స్కోరు చార్టు మీద ప్రపంచం దృష్టి ఉంటుంది. తీర్పు ప్రశ్నార్థకం కాకుండా ఉండాల్సిందే. మనకు రెమ్యూనరేషన్ మాత్రమే కనిపిస్తుంది కానీ, రోషన్ శ్రమ కూడా అదే స్థాయిలో ఉంది.
 
ప్రోమోల షూటింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్‌లో అతడి ఛాతీ కండరం చిట్లి (మజిల్ టేరింగ్)పోయింది. దీనికి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ షూటింగ్ పూర్తి చేశాడట. తన అసౌకర్యం కారణంగా షూటింగ్ షెడ్యూల్ కాన్సిల్ అయ్యే ప్రమాదాన్ని నివారించడానికి పడిన కష్టం... కొద్ది వారాల్లో స్టార్‌ప్లస్‌లో ఫలించబోతోంది. ఇది ఇలా ఉంటే ‘బుల్లితెర మీద ఆరంగేట్రం చేయడానికి ఇప్పడే ఎందుకంత తొందర, హృతిక్ కెరీర్‌లో ఇంకా చాలా సమయం ఉంది కదా’ అని సినీ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎవరేం అంటున్నా ఈ బాలివుడ్ స్టార్ మాత్రం కొత్త హుషారుతో స్టార్‌ప్లస్ ఆఫర్‌ను ఎంజాయ్ చేస్తూ తన కొత్త ఉద్యోగానికి న్యాయం చేయడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పేరు మొదట ‘డ్యాన్స్ ఒలింపిక్’ అనుకున్నారు, ఆఖరుకు జస్ట్ డ్యాన్స్‌గా మారింది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top