సినిమాల దారిలో సీరియళ్లు!

సినీతారల్లో ఇప్పటికే చాలా మంది టీవీ గడప తొక్కేశారు. తొక్కేయడం అంటే పూర్తిగా అటువైపు వెళ్లలేదు కానీ మధ్యమధ్యలో కొన్ని వంటల్లో ఉప్పూకారం వేసి వస్తున్నారు. అంటే - సినిమాల్లో నటిస్తూనే టీవీ కార్యకమాలకు అతిథులుగా, వ్యాఖ్యాతలుగా వచ్చివెళుతున్నారు. పెద్ద పెద్ద స్టార్‌లు ఉంటే బుల్లితెరకో అందం, గౌరవం, గుర్తింపు వచ్చేస్తాయని అన్ని చానెళ్లూ నమ్ముతున్నాయి. ఆ నమ్మకం నిజమని కూడా రుజువయింది. అయితే టీవీ చానెళ్లు కేవలం సినీతారలతోనే సరిపెట్టుకోవడం లేదు. మరికొన్ని అడుగులు ముందుకు వేసి సీరియళ్లను కూడా సినిమాల్లా రిచ్‌గా, అట్రాక్టివ్‌గా తీసి వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. 

అందుకోసం హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను అనుకరిస్తున్నాయి. వాటి కథల నుంచి స్ఫూర్తి పొందుతున్నాయి. ఈ ఫార్ములా హిట్ అయింది. మామూలుగానే సినిమా పాటలు, సన్నివేశాలతో కూడిన ప్రోగ్రామ్‌లు టీవీ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. అందుకే ప్రతి చానెల్‌లోనూ, ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ సినిమాకు సంబంధించిన ప్రోగ్రామ్‌లు కనీసం రెండుమూడైనా టీవీలలో కనిపిస్తుంటాయి. ఇప్పుడిక ఏకంగా బిగ్‌స్క్రీన్ కథలనే సీరియళ్లుగా మలుచుకుంటోంది బుల్లితెర. ఇంచుమించు సినిమా తీసినట్లు ఎపిసోడ్‌లను తీయడంతో భాషతో నిమిత్తం లేకుండా అన్ని ప్రాంతాల వారు హిందీ సీరియల్స్‌ను ఆదరిస్తున్నారు. స్టార్ టీవీలో ప్రసారం అవుతున్న ‘ప్యార్ కి యే ఏక్ కహానీ’... చూస్తుంటే హాలీవుడ్ ‘ట్విలైట్’ సీరీస్ గుర్తుకొస్తాయి.

కలర్స్ చానల్‌లో వచ్చే ‘మట్టి కి బన్ను’ సీరియల్ కరిష్మా కపూర్ నటించిన ‘శక్తి’సినిమాకు అనుకరణ అని సినిమాలు, సీరియళ్లు బాగా ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది. అలాగే, కొత్తగా తయారయ్యే టీవీ సీరియళ్లకు కూడా బాలీవుడ్డే ఇంధనం నింపుతోంది. ‘లైఫ్ ఇన్ మెట్రో’ చిత్ర దర్శకుడు అనురాగ్ బసు ప్రస్తుతం అదే దారిలో టీవీ కోసం కొత్త ‘ప్లాట్’ కట్టే పనిలో ఉండగా, బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ తీసిన ‘జబ్ వియ్ మెట్’ చిత్రం మరో కొత్త టీవీ సీరియల్‌కు ముడిసరకు కాబోతోంది. ‘హమ్ దిల్ దె చుకె సనమ్’ కూడా టీవీ ఎపిసోడ్‌లుగా రూపాంతరం చెందబోతోంది.  



‘‘ఇందులో ఖండించవలసిందేమీ లేదు. సినీతారలకు, సినిమాలకు ఉండే క్రేజ్‌ను టీవీ చానెళ్లు ఉపయోగించుకుంటున్నాయి. ఏం చేసినా ప్రేక్షకుల కోసమే కదా’’ అని చిత్ర, టీవీ పరిశ్రమల విశ్లేషకులు కోమల్ నహతా అంటున్నారు. సీరియల్ చూస్తే సినిమా చూసినట్లుండాలని చానళ్లు అనుకుంటుండగా, సినిమాకు సమాంతరంగా వృద్ధి చెందుతున్న టీవీ కార్యక్రమాలలో ఏదో ఒక విధంగా తమ వాటా దక్కించుకునేందుకు పెద్ద పెద్ద తారలు, టెక్నీషియన్లు, దర్శకులు సైతం ఆసక్తి చూపుతున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top