18 ఏళ్లుగా వంట చేస్తూ...నే... ఉన్నాడు


ఖానా ఖజానా... ఇదో సక్సెస్‌ఫుల్ వంటల కార్యక్రమం. నిర్లేప్ నాన్‌స్టిక్ కుక్‌వేర్ భాగస్వామ్యంతో జీటీవీ పరిచయం చేసిన ఈ ప్రోగ్రామ్ దశాబ్దం దాటినా కొనసాగుతూనే ఉంది. 1993లో మొదలైన ఖానా ఖజానా వారానికొక ఎపిసోడ్‌గా ఇప్పటికీ జీటీవీలో సరికొత్త వంటలతో ప్రసారమవుతోంది. సంజీవ్ కపూర్ హోస్ట్‌గా ప్రసారమయ్యే కుకరీ షోకు దేశమంతటా ఆదరణే. ఎంత గొప్ప ప్రోగ్రామ్ అయినా టీవీ స్టూడియో నుంచి నేరుగా ప్రతి ఇంటి ముందుగది వరకు వచ్చి భర్త తరఫు బంధువులాగా అక్కడే ఆగిపోతుంది. ఖానా ఖజానా అక్కడితో ఆగకుండా భార్య పుట్టింటి చుట్టంలాగా వంటింట్లోకి దూరి భారతీయ వంటగదుల దుమ్ము దులిపేసింది. మనదేశంలో టీవీ ఉన్న ప్రతి వంటిల్లూ ఖానాఖజానాలో వచ్చిన ఒక్క వంటనైనా ట్రై చేసి ఉంటుంది. అంతే కాకుండా హోస్ట్‌ను సెలబ్రిటీగా మార్చింది. 

సంజీవ్ కపూర్ అలా వండుతూ వండుతూనే యాడ్‌కు మోడల్ అయ్యాడు. వండిన వాటిని రుచి చూపించే ఊరుకోకుండా పుస్తకాలు రాసి బుక్‌స్టాల్స్‌లోనూ ఖానాఖజానాను ప్రమోట్ చేసుకున్నాడు, తానూ ప్రమోట్ అయిపోయాడు. ఖానా ఖజానా టీవీ, ప్రింట్ మీడియాలతో ఆగిపోకుండా అంతర్జాలంలోనూ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసుకుంది. ఒక వంటింటి కార్యక్రమానికి ఇంతటి ఆదరణా? అని ఆశ్చర్యపోతే మన ఆకలి మీద ఒట్టు. వంట ఎంత లోతైన సబ్జెక్టో తెలుసా? ఇండియన్ కిచెన్ భారతీయ చరిత్ర, సంస్కృతి అంతటి లోతైనది, విశాలమైనది. భారత ఉపఖండంలో అనేక సంప్రదాయాలు, వస్తధ్రారణలు, జీవన విధానం లాగానే తినే పదార్థాలు కూడ ఒకదానికి ఒకటి పూర్తిగా భిన్నం.  


ఇన్ని ప్రాంతాల రుచులతోపాటు కాంటినెంటల్ రుచులనూ ఒకే వేదిక మీద అందించే కార్యక్రమమే ఖానా ఖజానా. టాపిక్ ఎందుకు డ్రై అవడం లేదో ఇప్పుడర్థమైంది కదా! ఇక్కడొక్క విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. చెఫ్ సంజీవ్ కపూర్‌ను ప్రోగ్రామ్ ప్రజెంట్ చేసే స్టయిల్‌ను చూస్తే రుచిగా వండడం ఒక్కటీ వస్తే చాలదు, అంత చక్కగా వ్యక్తీకరించి తీరాలి అనిపిస్తుంది. వంట చేస్తున్నంత సేపూ దాని గురించి ప్రత్యేకతలను వివరిస్తూనే ఉంటాడు. మన ఇళ్లలో మగవాళ్లు ఒక ఆమ్లెట్ వేస్తే సింక్ గిన్నెలతో నిండిపోతుంటుంది. సంజీవ్ కపూర్ వండిన తర్వాత కూడా కిచెన్ నీట్‌గా ఉంటుంది.

ఆ మాటా ఈ మాటా చెబుతూ వంట పూర్తి వడ్డించినంత సులువుగా వండినది తింటూ రుచిని ఆస్వాదిస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మరో ఎత్తు. మనకూ కొంచెం పెడితే బాగుంటుందేమో అనిపించేటంతగా నోరూరుతుంది వీక్షకులకు. అందుకే 18 ఏళ్లుగా వండుతున్నా భాగస్వామ్యాలు మారుతున్నాయి తప్ప, ఎవరికీ బోర్ కొట్టడం లేదు. ఇది జీటీవీలో ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు ప్రసారమవుతోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top