హీరోయిన్లకు నాగ్‌, వెంకీల గట్టి పోటీ...


టాలీవుడ్‌లోని నలుగురు పెద్ద హీరోల్లో ఇద్దరు మాత్రం సినీ రంగానికి వచ్చి 25 ఏళ్ళు దాటినప్పటికీ... కళ్ళ ముందే పుట్టి నేడు కథానాయకులైన తమ వారసులకంటే వారిద్దరే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. వారే నాగార్జున, వెంకటేష్‌లు. ఇద్దరూ యాభైలకు చేరుకున్నప్పటికీ వీరి సినిమాల విడుదల తేదీలకు దగ్గర్లో మిగిలిన సినిమాల విడుదల లేకుండా జాగ్రత్త పడుతుంటారు. 

                     ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో టీవీ సీరియళ్ళకు అతుక్కుపోయే నారీమణులు నాగ్‌, వెంకీల సినిమాలకు మహారాజ (మహారాణి...) పోషకులు. అయితే, ఈ కారణం వల్లే ఈ అగ్ర నటులిద్దరికీ మహిళా ఉత్పత్తుల కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించే అవకాశాలు వచ్చాయి. ఇతర యువనటులంతా సాఫ్ట్‌ డ్రింక్స్‌, జీన్స్‌, టెలీకాం సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటే... వెంకీ, నాగ్‌ లు ఆభరణాల కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
                     
                      కేరళకు చెందిన కల్యాణ్‌ జువెలరీస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నాగార్జున సంతకాలు చేసినప్పుడు అంతా కళ్ళెగరేశారు. ఈ సంస్థ తరఫున పలు పట్టణాలు, నగరరాల్లో వెలసిన భారీ ప్రకటనలపై ఆయనే కనిపించారు. యాడ్‌ వర్గాల సర్వే ప్రకారం మహిళాలోకంలో నాగ్‌, వెంకీలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 

                          ప్రస్తుతం 52 ఏళ్ళకు చేరుకున్న నాగార్జున కొన్నేళ్ళుగా ప్రకటనలకు దూరంగా ఉన్నారు... ''కొన్నేళ్ళకిందటి వరకూ తీరిక ఉండేదికాదు, ప్రకటనలకు సమయమే చిక్కేదికాదు. సమయం ఉన్నప్పుడు సరైన బ్రాండ్‌లు దొరకలేదు. చివరికిప్పుడు మంచివి వచ్చాయి. వచ్చిన రెండు ఒప్పందాలు దీర్ఘకాలికంగా ఉండేవి. ఆర్థికంగా ఊతమిచ్చేవి'' అన్నారు.
                     
                          ''ఆంధ్రలో జువెలరీ బ్రాండ్‌ కోసం ప్రచారకర్త కావాలని వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు... అనుష్క లేదా ఇలియానా దగ్గరికి వెళ్ళమన్నాను. అయితే, వాళ్ళు కేరళలో ఇలాంటి ప్రచారమే హీరో మమ్ముట్టితో చేస్తున్నట్లు వివరించారు. అంతేగాక, వారి బ్రాండ్‌కు ఉపకరించేలా నాకు మహిళా అభిమానులు ఉన్నారన్న అభిప్రాయం కలిగింది. వారిది స్వచ్ఛమైన బంగారమనే నినాదాన్ని ప్రజలు విశ్వసించడానికిగాను హుందాతనం, మంచి పేరున్నవారు కావాలి... దాంతో నన్ను కలిశారు'' అని నాగ్‌ చెప్పారు.
               
                         ఇటీవలే 51కి చేరుకున్న వెంకీది కూడా ఇదే నేపథ్యం. కొన్నేళ్ళ కిందట కోక్‌ ప్రకటనకు ఆయనే మొదటి ప్రాధాన్యంగా ఉండేవారు. వెంకటేష్‌ కూడా చాలాకాలంపాటు తీరికలేని షూటింగ్‌ల వల్ల ప్రకటనలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఇటీవలే ఈయన కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా రంగప్రవేశం చేశారు.
               ''కొన్నేళ్ళ కిందట కోక్‌ ప్రతినిధులు నన్ను కలిశారు. అప్పుడు సినిమాలతో తీరిక లేనందువల్ల కుదరదని చెప్పేశాను. మణప్పురం గోల్డ్‌ లోన్‌ ప్రకటన అనుకోకుండా వచ్చింది. మహిళల అభిమాన స్టార్‌ గురించి పరిశోధన జరిపామని వారు చెప్పారు. వారు నన్ను కలిశాక వెంటనే అంగీకరించాను. ఆ బ్రాండ్‌ కోసం కొన్ని యాడ్‌లు చేశాను. నేను సరైన బాటలో ఉన్నట్లు నాకనిపించింది'' అని వెంకీ తన మనసు విప్పారు.ఇక మరిన్ని బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ఈ స్టార్‌లిద్దరూ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. హీరోలతో పోల్చితే హీరోయిన్లకు స్టార్‌డమ్‌ అంత ఎక్కువకాలం ఉండదు. అందుకే వాళ్ళు దీపమున్నప్పుడే మూడు చీరలు, ఆరు ఆభరణాల ప్రకటనలు... రిబ్బన్‌ కటింగ్‌లు చేసుకుంటూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటుంటారు. పాపం ఇక వీరికి నాగ్‌ - వెంకీల నుంచి గట్టి పోటీ తప్పదనుకుంటా...
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top