చక్కెర వ్యాధికి చెక్‌ - యోగాలో చక్కని ఆసనాలు

వయసు నలభై దాటితే చాలు మధుమేహం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ వ్యాధి ఎందుకు, ఎలా వస్తుందనే విషయాలు పక్కనపెడితే దాని బారినపడితే ఎదుర్కోవాల్సిన పర్యవసనాలు అందరికీ తెల్సిందే. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండటానికి యోగాలో చక్కని ఆసనాలు.. 
మండూకాసనం:
 ఈ ఆసనం చూడ్డానికి కప్ప ఆకారాన్ని పోలి ఉంటుంది. దీనిని వేయడానికి రెండు పద్ధతులున్నాయి.
 మొదట వజ్రాసనంలో కూర్చుని.. 
రెండు మోకాళ్లను దూరంగా ఉంచాలి. రెండు చేతులతోనూ రెండు అరికాళ్లను పట్టుకోవాలి. గాలిని తీసుకొని మెల్లగా వదులుతూ చుబుకాన్ని నేలకు తాకించాలి. ఇలా మూడు సెకన్ల పాటు ఉండి గాలి తీసుకొని మెల్లగా పైకి రావాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి. 
ఇక రెండో పద్ధతి. 
వజ్రాసనంలో కూర్చొని రెండు పిడికిళ్లు మూసుకొని నాభి దగ్గర తొడలపై ఆనించి ఉంచాలి. గాలిని వదులుతూ ముందుకు వంగాలి. అరనిమిషం పాటు ఉన్న తర్వాత మెల్లగా గాలి తీసుకొంటూ పైకి లేవాలి. ఈ ఆసనాన్ని మెల్లగా చెయ్యాలి. పొట్టమీద ధ్యాస ఉంచాలి.

వక్రాసనం: 
కుడికాలిని పొడవుగా చాపి ఉంచాలి. ఎడమ పాదాన్ని కుడి మోకాలి పక్కన పెట్టాలి. ఎడమ చేతిని వీపు వెనుక ఉంచాలి. కుడిచేతితో ఎడమ మెకాలిని పొట్టవైపునకు ఒత్తి పట్టుకోవాలి. నెమ్మదిగా గాలిని వదులుతూ ఎడమవైపునకు తిరిగి చూడాలి. ఇలా ఇరవై సెకన్లుపాటు ఉండాలి. తర్వాత మెల్లగా గాలిని తీసుకొంటూ మామూలు స్థితికి రావాలి. ఇలా నాలుగు సార్లు చెయ్యాలి. ఇప్పుడు తిరిగి ఎడమకాలిని చాపి కుడిపాదాన్ని ఎడమ మోకాలి పక్కన ఉంచి కుడి చెయ్యి వీపు వెనుక నుంచి మూడునాలుగు సార్లు చెయ్యాలి.

అర్ధమత్య్సేంద్రియాసనం: 
ముందుగా రెండు కాళ్లు చాపి కూర్చోవాలి. కుడికాలిని ఎడమ మోకాలి అవతలి నుంచి ఉంచి.. ఎడమకాలిని మడిచి కూర్చోవాలి. కుడిచేతిని వీపు వెనుకకు ఉంచాలి. ఎడమచేతిని కుడిమోకాలి అవతలి నుంచి కుడిపాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మెల్లగా గాలిని వదులుతూ కుడివైపునకు పూర్తిగా తిరిగి చూడాలి. నడుం, భుజం, మెడనితిప్పి చూడాలి. ఇలా ముఫ్పై సెకన్లు పాటు ఉండాలి. గాలిని తీసుకొంటూ మెల్లగా యధాస్థితికి రావాలి. ఇలా మూడుసార్లు చెయ్యాలి. అదే విధంగా ఎడమవైపు కూడా చెయ్యాలి. ఈ ఆసనం చేస్తున్నప్పుడు పొట, నడుం మీద ధ్యాస పెట్టాలి.ఈ ఆసనాల వల్ల ఇన్సులిన్‌ సక్రమంగా ఉత్పత్తి అయ్యి మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వెన్నెముక బలంగా మారుతుంది. పొట్ట నడుం దగ్గర కొవ్వు తగ్గుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి.

నాడీశోధన ప్రాణాయామం:
 సుఖాసనంలో కూర్చుని మెల్లగా గాలిని బయటకు వదిలిపెట్టాలి. ఎడమచేతిని చిన్‌ముద్రలో.. కుడిచేతిని విష్ణుముద్రలో ఉంచాలి. విష్ణుముద్ర అంటే బొటనవేలు కుడిముక్కు వైపు.. చిటికెన వేలు, ఉంగరం వేలు ఎడమముక్కు వైపు ఉంచాలి. మధ్య రెండు వేళ్లను రెండు కనుబొమల మధ్య ఉంచాలి. ముందుగా కుడిముక్కుని మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని తీసుకోవాలి. గాలిని బంధించి నాలుగు సెకన్లు పాటు ఉంచాలి. కుడి ముక్కుతో గాలిని వదిలేయాలి. ఈ విధంగా ఐదు నుంచి పది నిమిషాల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.

భ్రమరీ ప్రాణాయామం:
 ఈ ప్రాణాయామం చేసేటప్పుడు తుమ్మెద చేసే ఝుంకార శబ్దం వస్తుంది కనుక దీనిని అలా పిలుస్తారు.సుఖాసనంలో కూర్చొని రెండు చేతుల బొటనవేళ్లతో రెండు చెవులు మూసి ఉంచి చూపుడు వేళ్లు నుదుటి మీద ఉంచాలి. మిగిలిన వాటిని కళ్లమీద సున్నితంగా ఆనించాలి. 
ఇప్పుడు మెల్లగా రెండు ముక్కుల నుంచి గాలిని దీర్ఘంగా తీసుకొని వదిలేటప్పడు 'మ్‌......' అని శబ్ధం చేస్తూ నెమ్మదిగా వదలాలి. మళ్లీ గాలిని తీసుకొని మళ్లీ వదలాలి. అయితే శబ్దం ముక్కు నుంచి కాకుండా నాభి నుంచి వచ్చేట్టు ప్రయత్నించాలి.    
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top