తలనొప్పి తగ్గటానికి కొన్ని ఆసనాలు

కటి చక్రాసనం

మెత్తని చాపపైన నిల్చొని నెమ్మదిగా రెండు చేతులను భుజాలకు సమాంతరంగా చాపాలి. శ్వాస వదులుతూ కుడిచేతిని కిందికి జరుపుతూ తలను కుడి పక్కకు వంచి ఎడమ చేతిని ఎడమ చెవి మీదుగా కుడి పక్కకు చాపి దృష్టిని ఎడమ అరచేతిపై కేంద్రీకరించాలి.ఈ స్థితిలో పది సెకన్లు ఉండి.. శ్వాస తీసుకొంటూ సమస్థితికి వచ్చి కుడివైపు లాగానే ఎడమవైపు కూడా చేసి శ్వాస తీసుకొంటూ సమస్థితికి రావాలి. ఇలా చేసేటప్పుడు మోకాళ్లను వంచకూడదు. ఆరు నుంచి ఎనిమిది సార్లు చెయ్యాలి.
 

ఉపయోగాలు :  
తలకు రక్తప్రసరణ బాగా జరిగి తలనొప్పి తగ్గి జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. పొట్ట తగ్గి నడుము చక్కని ఆకృతి సంతరించుకొంటుంది.స్పాండిలైటిస్‌, మూత్రపిండాల సమస్యలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి.
శీతలీ ప్రాణాయామం

సుఖాసనంలో కూర్చోవాలి. నాలుకను సున్నాలా ఉంచి దానిలోంచి గాలి తీసుకొని... నోరు మూసి లోపల గాలిని ఐదు, పది సెకన్ల పాటు ఉంచాలి. తరవాత ముక్కుతో నెమ్మదిగా బయటికి పంపాలి. ఈ ప్రాణాయామంలో నోటితో గాలిని తీసుకొంటాం. ముక్కుతో వదిలేస్తాం. దాంతో తలనొప్పి తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలోకి వస్తాయి. దీనిని రోజూ ఒకట్రెండు సార్లు చెయ్యాలి. సైనసైటిస్‌, జలుబు ఎక్కువగా ఉన్నవారు ఈ ప్రాణాయామం జోలికి వెళ్లకూడదు.
అర్ధ శీర్షాసనం


కాస్త దళసరిగా ఉన్న తివాచీపై కూర్చొని రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచాలి. రెండు కాళ్లను వీలైనంత దూరం జరిపి రెండు చేతులను ముందుకు నేలకు ఆన్చి శ్వాస తీసుకొంటూ తలను పైకెత్తి అక్కడ రెండు సార్లు శ్వాస తీసుకొని వదలాలి. తర్వాత కళ్లు మూసి శ్వాస వదులుతూ చేతుల సహాయంతో తలను నేలకు తాకించాలి. ఈ స్థితిలో నాలుగు నుంచి ఆరు సెకన్లు ఉన్న తరవాత శ్వాస తీసుకొంటూ పైకి వచ్చి శ్వాస వదులుతూ సమస్థితిలోకి రావాలి.
 

ఉపయోగాలు :
తలనొప్పి తగ్గుతుంది. కళ్లకు మేలు జరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. కళ్లకు కూడా మేలు చేస్తుంది.

అర్ధ చక్రాసనం 


సమస్థితిలో నిల్చొని రెండు చేతులను నడుముపై ఉంచాలి. తర్వాత కళ్లను మూసి శ్వాస వదులుతూ నెమ్మదిగా వీలైనంత వెనుకకు వంగి అక్కడ నాలుగు లేక ఆరు సెకన్లపాటు అలాగే ఉండి గాలి తీసుకొంటూ పైకి వచ్చి శ్వాస వదులుతూ తిరిగి సమస్థితిలోకి రావాలి.
 

ఉపయోగాలు :  
తీవ్రమైన తలనొప్పి తగ్గుతుంది. కాలేయం, మూత్రపిండాల వ్యాధులు దరిచేరవు. వెన్నునొప్పి, మెడనొప్పి, కీళ్లనొప్పులు రాకుండా ఉంటాయి. నూతనోత్సాహం సొంతమవుతుంది.
మూర్ఛ ప్రాణాయామం


కళ్లు మూసుకొని ఏదైనా సౌకర్యవంతంగా ఉండే ఆసనంలో కూర్చొని రెండు నాసికా రంధ్రాల నుంచి గాలిని తీసుకొని తల పైకెత్తి వెనక్కి వంచాలి. లోపల గాలిని కొన్ని క్షణాల పాటు బంధించి ఉంచాలి. ఉండగలిగినంతసేపు ఆ భంగిమలో ఉండి తరవాత కళ్లు మూసుకొని నెమ్మదిగా శ్వాస బయటకు వదిలి మామూలు స్థితికి రావాలి. ఇది ఒక రౌండ్‌. మళ్లీ అలాగే గాలి తీసుకొని తల పైకెత్తి వెనక్కి ఆకాశం వైపు తలని వీలైనంత వెనక్కి ఉంచాలి. గాలిని తీసుకొని ఆ గాలిని బంధించి ఉంచాలి. కళ్లు మూసుకొని నెమ్మదిగా శ్వాస వదులుతూ మామూలు స్థితికి రావాలి. ఇది కంటి దృష్టిని జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
       

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top