రియాలిటీ షోలో గంగూలీ ‘దాదాగిరి’


టీవీ రియాలిటీ షోలలో ఇంతవరకూ సినిమా హీరోలు, హీరోయిన్లకు మాత్రమే క్రేజ్. కాని మొట్టమొదటిసారి ఓ క్రికెటర్ బుల్లితెర మీద యాంకర్‌గా మెరుపులు మెరిపిస్తూ ప్రేక్షకుల్ని మురిపిస్తున్నాడు. అతనే... బెంగాల్ టైగర్... దాదా... సౌరవ్ గంగూలీ. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా, ఓపెనర్‌గా, ఆల్‌రౌండర్‌గా దేశానికి ఎనలేని సేవలు అందించిన సౌరవ్ గంగూలీ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక మళ్లీ ఇండియన్ క్రికెట్‌కే సేవలు అందిస్తాడని అంతా భావించారు. సౌరవ్ లాంటి తెలివైన, గట్స్ ఉన్న వాడు కోచ్‌గా వస్తే జట్టుకు మేలు జరుగుతుందని అనుకున్నారు. కాని అందరి అంచనాలకు భిన్నంగా సౌరవ్ గంగూలీ బుల్లితెర మీద వ్యాఖ్యాతగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేస్తున్న టీవీ రియాలిటీ షో పేరు - దాదాగిరి.

జీ బంగ్లా ఛానెల్‌లో వారానికి మూడు రోజుల పాటు సాయంత్రాలు దాదాగిరి ప్రోగ్రామ్ ప్రసారం అవుతోంది. ఇప్పటికి నాలుగు సీజన్ల పాటు ఈ కార్యక్రమం ప్రసారం అయింది. మొదటి సీజన్‌లో 64 ఎపిసోడ్స్‌కి దాదా గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అయితే, అప్పటికి ఈ వృత్తికి కొత్త కావడంతో గంగూలీ బుల్లితెర మీద అంతగా రాణించడం లేదన్న విమర్శలు మూటగట్టుకున్నాడు. కాని సెకండ్ సీజన్‌కల్లా దాదా యాంకరింగ్‌లో మెళకువలు నేర్చుకుని ఆ సీజన్‌ని మెప్పించడమే కాదు, జీ బంగ్లా ఛానెల్ టీఆర్‌పి రేటింగ్స్ కూడా పెంచగలిగాడు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్ తరహాలో కొందరు కంటెస్టంట్స్‌కు క్విజ్ నిర్వహించి విజేతలకు భారీగా నగదు బహుమతులు చెల్లించడం ఈ రియాలిటీ షో కాంసెప్ట్. బెంగాలీలలో సౌరవ్ గంగూలీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ‘దాదాగిరి’ కొన్నిసార్లు అమితాబ్ కెబిసితో పోటాపోటీగా సాగుతోందని, బెంగాల్‌లో మంచి రేటింగ్స్ సాధిస్తోందని జీ బంగ్లా ఛానెల్ వారంటున్నారు.

ఇటీవల కాలంలో ఐపిఎల్-4 వేలంపాటల్లో సౌరవ్ గంగూలీని ఒక్క జట్టు కూడా తీసుకోలేదు. కాని దాదాగిరి - 4లో మాత్రం సౌరవ్ చెలరేగిపోతున్నాడు.

‘‘బెంగాల్‌లో వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ప్రతిభావంతుల్ని వెతికి పట్టుకోవడం, వారి ప్రతిభను తగిన రీతిలో సత్కరించడం దాదాగిరి ప్రత్యేకత’’ అంటారు జీ బంగ్లా అధికారులు. ఈ షోలో గంగూలీ కొందరు సెలబ్రిటీలతో ముచ్చటిస్తూ, అదే సందర్భంలో వివిధ వర్గాల కంటెస్టెంట్స్‌కు క్విజ్ నిర్వహిస్తుంటారు. సౌరవ్ సారథ్యంలోని ఈ ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అయిందంటే, ప్రస్తుతం యుటివి వారి బిందాస్ టీవీ ఛానెల్‌లో కూడా దాదాగిరి సీజన్ 4 ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి.

రియాలిటీ షో యాంకర్‌గా నటిస్తున్న మాజీ క్రికెటర్ గంగూలీ మరికొందరు మాజీ క్రికెటర్లకు రిటైర్‌మెంట్ తర్వాత యాంకరింగ్ వృత్తిని చేపట్టడానికి స్ఫూర్తి కూడా అవుతున్నాడు.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top