పిల్లలు ఇంకా పక్క తడుపుతుంటే..?

ఈ అలవాటు చాలా మంది పిల్లలలో ఉంటుంది. దీని గురించి మీరు ఎక్కువగా ఆందోళన పడవద్దు. ఆయుర్వేదంలో దీన్ని ‘‘శయ్యామూత్ర’’ అని వర్ణించారు. అలోపతీలో ‘‘నాక్టర్నల్ ఎన్యూరిసిస్’’ అంటారు. ‘రచనా’పరంగా మూత్రవహ సంస్థానంలోని భాగాలన్నీ నార్మల్‌గానే ఉంటాయి. కేవలం ఇది ‘క్రియాపరమైన వికారం మాత్రమే. దీనికి కారణం పిల్లల మీద ప్రభావితమయ్యే మానసిక ఒత్తిడి మాత్రమే.

ఈ ఒత్తిడి ఈ తరం శిశువుల్లో మరీ అధికం. శిశు సంరక్షణాలయాలలో (క్రెచ్‌లు) పిల్లల్ని పెంచడం, తల్లిపాలు తాగించకపోవడం, పిల్లలపై తమకున్న అనురాగాన్ని వాళ్లు బహిర్గతంగా వ్యక్తీకరించకపోవడం, కొన్ని సందర్భాలలో తమ పిల్లల్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలన్న తపనతో అతిగా క్రమశిక్షణకు గురిచేయడం, పాఠశాలల్లోని వివిధ పోకడలతో కూడిన నియమనిబంధనలు, పోషకవిలువలకి ప్రాధాన్యత లేని మార్కెట్‌లోని ఆహార పదార్థాలను అధికంగా వాడడం.... ఇలాంటి రకరకాల కారణాలు శిశువులపై మానసిక ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయి.


ప్రస్తుతం ఇది ‘సామాజిక ఉపద్రవంగా’ మారింది. దీనివల్ల శిశువుల వ్యక్తిత్వ వికాసానికే ముప్పుకలుగుతోంది. అభద్రతా భావం, ఆత్మన్యూనతల వంటి మానసిక వికారాలకు దారి తీస్తోంది. ఈ విధంగా- పెరిగే వయసులో శిశువులకు కలిగే అనేక బాధలో ఈ ‘‘శయ్యామూత్రం’’ ఒకటి.


తల్లిదండ్రులు అనుసరించవలసిన జాగ్రత్తలు:

ముందు పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. ఇది ప్రమాదకరమైనదేమీకాదని నచ్చ జెప్పాలి. ఇది చాలా మంది పిల్లల్లో ఉండేదేనని, ఎవ్వరూ బయటికి చెప్పరనీ శిశువుకి ధైర్యం చెప్పాలి. పెద్దలు చాలా సహనంతోనూ, సంయమనంతోనూ ఉండాలి. క్రమక్రమంగా ఇది పూర్తిగా తగ్గిపోతుందని శిశువులకు వివరించాలి.

రాత్రి భోజనాన్ని పిల్లలకు త్వరగా సాయంత్రమే తినిపించడం మంచిది. రాత్రి పూట ద్రవ పదార్థాలు తాగించవద్దు.



శిశువు పడుకున్న తర్వాత ఒక్క గంటకే నిద్రలేపి, మూత్ర విసర్జన చేయించాలి. తర్వాత మరో మూడు గంటల వ్యవధిలో మళ్లీ చేయించడం మంచిది.

తల్లిదండ్రులుగానీ, ఇంట్లోని ఇతర పెద్దలుగానీ ఈ విషయంలో శిశువుని తిట్టడం, చివాట్లు పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యరాదు. ‘‘పెద్దదానివవుతున్నావు, సిగ్గులేదా, ఇంకెన్నాళ్లు పోస్తావు’’ అనే మాటలు సర్వ సాధారణం. ఇలా తిట్టడం వల్ల వ్యాధి మరింత పెరుగుతుందే గాని తగ్గదు. ఇది లేత మనసుని మరింత గాయపరుస్తుంది. కాబట్టి ఆత్మ విశ్వాసాన్ని పెంచే ప్రక్రియలు పాటించడం తప్పనిసరి.

కంప్యూటర్ గేమ్స్‌కే పరిమితమవుతున్న పిల్లల్ని, ఆ అలవాటు మాన్పించి, విశాలమైదానాల్లో శారీర వ్యాయామం కలిగే ఆటలు ఆడించే ఏర్పాటు చెయ్యాలి.



మందులు: 
చంద్రప్రభావటి (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1
సారస్వతారిష్ట, అరవిందాసవ ద్రావకాల్ని ఒక్కొక్క చెంచా తీసుకుని, దానికి రెండు చెంచాల నీళ్లు కలిపి, రోజూ రెండుపూటలా తాగించాలి.
వీలుంటే... దొండపాదు వేళ్లని సేకరించి, దాని స్వరసాన్ని (ఒక చెంచా) తేనెతో రెండుపూటలా తాగించాలి.

గమనిక:

అవసరానుసారం, స్పెషలిస్టు సలహా మేరకు ‘‘మూత్రవహ సంస్థానికి’’ స్కానింగ్ చేయించి, ఆయా భాగాలలో లోపాలు లేవని నిర్ధారించుకోవడం మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top