జీ తెలుగులో వైవిధ్యంతో ‘రాధా కల్యాణం'


ఇప్పుడైతే కొద్దిగా పరిస్థితి మారింది. కానీ గతంలో టీవీ అంటే సీరియల్సే. అందుకే తాము అభిమానించే ధారావాహిక ప్రసార సమయానికి చాలాసేపు ముందరే టీవీ ముందు చూడ్డానికి సమాయత్తమయ్యే ప్రేక్షక కోటి ఇంకా ఉంది. వాళ్ల నాకర్షించడం కోసమే కొత్తకొత్త ధారావాహికలు కదం తొక్కుతున్నాయి. అందులో ఒకటి ‘రాధాకల్యాణం’ (జీ తెలుగులో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 8.30కి వస్తున్నది)
‘రాధాకల్యాణం’ పేరిట లోగడ సినిమాలు వచ్చాయి. ఇప్పుడీ ధారావాహిక. సినిమా అంటే ఏవో ఆరు పాటలు, మూడు ఫైట్లు వంటి పడికట్టు ముడి పదార్థాలున్నట్లే ధారావాహికకీ, ఓ అదరగొట్టే టైటిల్ సాంగూ, నిక్షేపంగా భావాలు పలికించే నెగెటివ్ లేడీ కేరెక్టరు, లెక్కకు మించిన ట్విస్టులు.. అంటూ కొన్ని ష్యూర్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ పోకడలను ఎంతవరకూ ఇది అనుసరించిందని నిర్ధారించడానికి ఇప్పటివరకూ అయినవి అయిదు భాగాలే కనుక తేల్చి చెప్పలేం కానీ కొన్నిటిని పరిశీలించాలి. అదరగొట్టే టైటిల్ సాంగ్ స్థానంలో శ్రావ్యమైన టైటిల్ సాంగు సీతాకోక చిలకమ్మా.. చిరు నవ్వేమైనది...’ అనేది ఉంది. అయితే ఇందులో గీత రచయిత చాలావరకూ చక్కటి టెంపో కొనసాగించినా, కొన్ని చోట్ల ప్రాస కోసం పడిన తెగ ప్రయాస కొట్టొచ్చినట్లు కన్పడింది. (మది, దోషం, మోసం... లాంటి పద ప్రయోగాల సందర్భం..) ఇక కథ విషయానికొస్తే.. పెళ్లీడే రాని ఓ అమ్మాయికి, తన అవసరాల కోసం ఓ దుష్టుడికి పెళ్లి చేయాలని సంకల్పించే తాగుబోతు తండ్రి.. తొలిచూపులోనే ప్రేమలో పడిన కీర్తి - వంశీల ఉదంతం ఇంకోవైపు సమాంతరంగా సాగుతున్నాయి. రెండింటికీ సమన్వయం ఎలా కుదురుస్తారో ముందు భాగాల్లో చూడాలి. అయితే రెండింటికీ ఉన్న ప్రధాన ట్విస్టు ‘పెళ్లి’. రాధ (పేదింట పుట్టిన చిన్నారి) తల్లికి, రాధ హస్తరేఖలు చూసి ఈమెకు రెండు నెలల్లోనే పెళ్లవుతుందని చెప్తాడు. వైద్యం చేయడానికి వచ్చిన ఓ ఆయుర్వేద వైద్యుడు (ఆయనకి హస్తసాముద్రికంలో పరిచయం ఉండి ఉండవచ్చు). అలాగే వంశీ తల్లి, నాయనమ్మ కూడా అతని ప్రేమ సమాచారం సెల్‌లో చూసి, పెళ్లి మంచిదే. కానీ రాబోయే అమ్మాయి ఆయుష్షు ఎలా ఉంటుందో అన్న భయాందోళనలు వెలిబుచ్చారు. అదే రీతిలో కీర్తికి పెళ్లి అంటే ఓ ఆదుర్దాతో కూడిన లుక్ ఇచ్చింది వాళ్లమ్మ. కనుక ఈ పెళ్లవడం లేదా ఏదైనా దీని చుట్టూ ఉంటుందన్న దృష్టి ప్రేక్షకులకు వచ్చేసింది. ఇక నటీనటుల అభినయానికి సంబంధించిన అంశానికి వస్తే, రాధ పాత్ర పోషిస్తున్న నటి ఇందాకా ప్రస్తావించుకున్న పాటలో మంచి అభినయాన్ని చూపింది. క్లోజప్స్‌లో ఆమెకున్న చిన్న కళ్లు ఇబ్బంది పెడ్తున్నాయి. ఇక మరి ఇలాంటి తండ్రి (కూతుర్ని ఓ జులాయికిచ్చి వివాహం చేద్దామనుకునే తత్వం) వుంటాడా అన్న అనుమానం మనల్ని వెంబడించినా, ఉంటే గింటే ఇలాగే ఉంటాడు అని అన్పిస్తున్నాడు క్వార్టర్ కేశవరావు పాత్రలో ఆ నటుడు. వంశీగా, కీర్తిగా నటిస్తున్న పాత్రధారులు ఓకే అయినా, వాళ్లకిచ్చిన డబ్బింగ్ వాయిస్‌ల్లో వైవిధ్యం కనపడ్డం లేదు. ఇక సంభాషణాకర్త మొత్తం ఎపిసోడ్స్‌ను రసపట్టుగా నడపడానికి పూచీ తీసుకున్నట్లు ప్రయోగిస్తున్న మాటల ధోరణి చెప్తోంది. ‘ఈ పచ్చని నోట్లతో నీ పచ్చని జీవితాన్ని పాడు చేస్తున్నాడు’ ‘కడుపున పుట్టిన నువ్వే కడుపు మీద కొడతావా’ ‘ప్రేమించిందన్న విషయం, కాలేజీ ఫస్టొచ్చినంత ఆనందంగా చెప్తారేమిటి?’ - అన్నవి అంతో ఇంతో సందర్భ సహితంగా ఉన్నాయి. కానీ జనవరి 6న ప్రసారమైన భాగంలో కీర్తి పాత్రలో ‘ప్రేమ క్షణికం కావచ్చు, కానీ ప్రేమలో పడడానికి ఒక్క క్షణం చాలు..’ అన్న దాంట్లో క్లారిటీ లేదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top