కోట్లు కొల్లగొడుతున్న - ‘రియాలిటీ షో’లు


ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ ప్రస్తుతం రియాలిటీ షోల వెంట పరిగెడుతున్నాయి. జీడిపాకంలా సాగే సీరియల్స్ గ్రామీణ, పట్టణ స్థాయి ప్రజలను ఎంటర్‌టైన్ చేయడంతో పాటు బానిసలుగా మార్చేసినా నగర స్థాయి ప్రజలకు మాత్రం మహా బోర్‌గా తయారయ్యాయి. దాంతో ఛానల్స్ వారు డాన్స్, గేమ్స్ వంటి షోలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఓ తరహా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పాటల ప్రోగ్రాంలు కూడా బాగానే పని చేస్తున్నాయి.
రియాలిటీ షోల దెబ్మకి సీరియల్స్ కొంతవరకు ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంది. అందుకే సీరియల్ వైపు ప్రేక్షకుల దృష్టిని మరల్చి బానిసలుగా మార్చేందుకు వెండి, బంగారం వంటి కానుకలను ఎరగా వేసి ఎస్‌ఎంఎస్ కాంటెస్ట్‌లను పెట్టడం జరుగుతుంది. అయినా ఏ ఎపిసోడ్‌కి ఆ ఎపిసోడ్ కొత్తగా కనిపించి రిజల్ట్ తేలిపోయే రియాలిటీ షోల వైపే ప్రేక్షకులు నడవడంతో ఛానల్స్ రియాలిటీ షోలను మరింత అందంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రతి ఛానల్ వారు వారంలో కనీసం నాలుగు రియాలిటీ షోలనైనా రూపొందించి అటు యువ ప్రేక్షకులతోపాటు మహిళలను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం ప్రసారమయ్యే రియాలిటీ షోలలో నగదు, బంగారాలను ఎరవేసి నిర్వహించడమే కాకుండా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. రాత్రిపూట నిర్వహించే షోల ద్వారా అన్ని రకాల ప్రేక్షకులను కట్టిపడేయడంలో నిర్వాహకులు విపరీతంగా కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు, వివాదాలు, కన్నీళ్ల పర్యంతాలు వంటి సీన్‌లను ప్రత్యేకంగా ఎడిట్ చేసి ప్రోమోలుగా చూపుకుంటున్నారు. రియాలిటీ షోల ద్వారా వందల కోట్ల రూపాయలలో వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యపడక తప్పదు. అందుకే ఎంత ఖర్చు చేసైనా సరే భారీగా నిర్వహించడానికి భారీ మొత్తాల్లో ప్రైజ్‌లు ఇవ్వడానికి నిర్వాహకులు వెనుకంజ వేయడం లేదు. పాపులర్ రైటర్ యండమూరి సైతం ‘అదృష్టం’ వంటి రియాలిటీ షోలో పాల్గొన్నాక తనదైన శైలిలో ‘అంతర్ముఖం’ అనే సైకలాజికల్ షోను డిఫరెంట్‌గా నిర్వహించడానికి మా టీవీని వేదికగా మార్చుకున్నారు.

రియాలిటీ షోలకు ఆదాయం స్పాన్సర్స్ ద్వారానే కాదు ఎస్‌ఎంఎస్ నిర్వహించడం ద్వారా కూడా లభిస్తుంది. పది నిమిషాల ‘స్లాట్’ని కోట్లు కుమ్మరించి స్పాన్సర్స్ కొంటున్నారు. స్పాన్సర్, కో స్పాన్సర్ చెల్లించే మొత్తాలతో రియాలిటీ షోలు మరింత అందంగా తయారవుతున్నాయి. రియాలిటీ షోల మధ్య పోటీ నానాటికీ పెరిగిపోతోంది. షోలను నడిపించే స్టార్ల మధ్య కూడా నెంబర్ వన్ తత్వం కోసం పోటీ ముదిరిపోతోంది. రియాలిటీ షోలకు మరింత క్రేజ్‌ని అద్దడానికి చూపే ప్రోమోలు వివాదాస్పదంగా కూడా మారుతున్నాయి.
రియాలిటీ షోల మధ్య పోటీ ఎంతవరకైనా పోతుంది. వ్యక్తిగత విషయాలను డబ్బులు ఎరగా పెట్టి బయటకు తీసి ఆ కుటుంబాల్లో చిచ్చును రగిలించే షోలు కూడా నడుస్తున్నాయి. బుల్లితెరపై సెలబ్రిటీలు, గెస్ట్‌లు, పార్టిసిపెంట్స్, యాంకర్ల మధ్య జరిగే ఆసక్తికరమైన మాటలతోపాటు, మాటల యుద్ధాలు కూడా షో నిర్వాహకులకు కోట్లు కుమ్మరించడమే కాదు క్రేజ్‌ని కూడా పెంచుతున్నాయి. టిఆర్‌పి పెరిగిపోతుంటే రియాలిటీ షోలు ఎన్ని ఎపిసోడ్స్‌నైనా జరుపుకుంటాయి.
రియాలిటీ షోలలో మొదట పాల్గొనే స్థాయిలో వుండే సాధారణ ప్రేక్షకుడు ప్రస్తుతం ఎక్కువగా రియాలిటీ షోలను తిలకించే స్థాయిలోనే మిగిలిపోతున్నాడు. ఎందుకంటే షోలకు మరింత క్రేజ్ తీసుకురావడానికి అవసరమైన సెలబ్రిటీలను (సినిమా, టీవీ, వివిధ రంగాలకు చెందిన) సెలెక్ట్ చేయడంతో ఏ ఛానల్‌లో ఏ షో చూసినా సాధారణ ప్రేక్షకుడు ఎక్కువగా కనిపించడం లేదు. పండుగ పబ్బాలకు వచ్చే సెలబ్రిటీలు ప్రస్తుతం ఎక్కువ ఎపిసోడ్స్‌లో కనిపిస్తున్నారు. టీవీ స్టార్, సినిమా స్టార్, పొలిటికల్ స్టార్ ఇలా అన్ని రంగాల వారు షోలకు వచ్చే విధంగా నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల వారి టిఆర్‌పి రేటింగ్ ఘనంగా పెరుగుతుంది. అందుకే రియాలిటీ షోలకు సాధారణ ప్రేక్షకుడు నానాటికీ దూరమై పోయి వీక్షకుడిగా మిగిలిపోతున్నాడు.

కొన్ని రియాలిటీ షోలకు జడ్జీలుగా, యాంకర్లుగా, స్పెషల్ గెస్ట్‌లుగా సెలబ్రిటీలు రావడం షో నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తుంది. వివిధ రంగాలలో క్రేజ్ తగ్గినా.. భారీ క్రేజ్ వున్నా కూడా రియాలిటీ షోలకు నిర్వాహకులుగా రావడానికి సెలబ్రిటీలు లక్షల నుండి కోట్ల వరకు షో నిర్వాహకుల నుండి చక్కగా గుంజుకుంటున్నారు. అందుకే నేడు ఎక్కువగా సినీ తారలు షోలను నడిపించడంలో ఉత్సాహం చూపుతున్నారు. ఈ విధానానికి బిగ్ బి అమితాబ్ ఆద్యుడై క్రేజీ స్టార్లని బుల్లితెరకు వచ్చేలా చేశాడు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్ వంటి వారు నేడు బుల్లితెర షోలతో కోట్లు గడిస్తూ బిజీగా ఉన్నారు.
బుల్లితెర తెలుగు విషయానికి వస్తే గాయకుడు, బాలు, శైలజ, నాగూర్‌బాబులు, నటీమణులు సుమలత, వేద, జయప్రదలు, నటులు జగపతిబాబు, సాయికుమార్, మురళీమోహన్ వంటి వారు ఉన్నారు. రమ్యకృష్ణ, జయసుధ, ఉత్తేజ్, బ్రహ్మానందం వంటి కొంతమంది బుల్లితెరపై కొంతకాలం కనిపించి వెనుదిరిగారు. స్పెషల్ గెస్ట్‌లు వచ్చినపుడు.. స్పెషల్ గెస్ట్‌లతో షో నిర్వహించినపుడు టిఆర్‌పి రేటింగ్ పెరుగుతుందనేది ఛానల్స్ బాగా గమనించాయి కనుకనే ఎక్కువగా సెలబ్రిటీలతోనే ఎపిసోడ్స్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. కొత్త సినిమాలు విడుదలైతే చాలు అన్ని షోలలోనూ ఆయా సినిమాలకు సంబంధించిన తారలు - టెక్నీషియనే్ల దర్శనమిస్తారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్స్ నిర్వహించే షోల మధ్య భారీ పోటీ కనిపిస్తూ నెంబర్ వన్ కావాలనే ఆరాటం కనిపిస్తుంది. కౌన్ బనేగా కరోడ్‌పతి... బిగ్‌బాస్ షోలు భారీ హంగామాను సృష్టిస్తూ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బిగ్‌బాస్ షోను మరింత క్రేజీగా మార్చడానికి హాలీవుడ్ తారను దిగుమతి చేసుకుని ఆమె కోసం ముంబాయికి 125 కి.మీ. దూరంలో ప్రత్యేక సెట్ వేసి మరీ షో చేస్తున్నారు. దీనిని బట్టే అర్థవౌతుంది రియాలిటీ షోల క్రేజ్.. ఆదాయం ఏమిటనేది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top