హా...చ్చ్...జలుబు,దగ్గు, ఆస్తమా ఎందుకు వస్తుందంటే...

పెద్దలనూ విసిగించే జలుబుకు ఒకటి కాదు రెండు కాదు ...దాదాపు రెండు వందల వైరస్‌లు కారణం. ఇన్నింటిలో ఏ ఒక్క వైరస్ వల్ల అయినా జలుబు రావచ్చు. అందుకని జలుబుకు సరైన మందు కనిపెట్టలేకపోయారు. విసిగించే జలుబు వల్ల మేలే ఎక్కువ ఉంది. వైరస్ శరీరంలోకి వెళ్లాక మనలోని వ్యాధి నిరోధక శక్తి వల్ల దానితో పోరాడటానికి యాంటీబాడీస్ తయారవుతాయి. ఇవి వ్యాధిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని ఇస్తాయి. అందుకని జలుబు గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. సాధారణంగా పుట్టిన నెల రోజుల వయసు నుంచే పిల్లలకు జలుబు రావడం మొదలవుతుంటుంది.
మందులు వాడినా వాడకపోయినా ఏడు రోజుల్లో తగ్గిపోయే జలుబుకు ఎన్నో ఇతర కారణాలు ఉన్నాయి.
జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పెద్దవాళ్లకు జలుబు ఉండి, పిల్లలకు దగ్గరగా లేదంటే వారి మీదనే దగ్గడం, తుమ్మడం చేస్తే వెంటనే అది పిల్లలకు వస్తుంది.

వైరస్‌తో పాటు శుభ్రత లోపించడం దుమ్ము వల్ల కూడా జలుబు వస్తుంటుంది.


ముక్కులో అడినాయిడ్స్, గొంతులో టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పిల్లలకు జలుబు ఎక్కువసార్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరిలో జలుబు తగ్గడానికి కూడా ఎక్కువ రోజులు పట్టవచ్చు. 


పెద్దలు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం వల్ల, అందులో ఉండే వైరస్ ఎక్కడైనా వ్యాపిస్తుంది. ఇలాంటి చోట ఉండే పిల్లలను జలుబు ఎక్కువగా వేధిస్తుంది. ఉమ్మి ద్వారా టి.బి., స్వైన్‌ఫ్లూ వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంటుంది.

తల్లిపాలు తాగని పిల్లల్లో తరచూ జలుబే కాదు ఏ ఇన్ఫెక్షన్ అయినా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.

జలుబుకి ఆహారం విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. అయితే ముక్కులు మూసుకుపోవడం వల్ల పిల్లలు సరిగా తినలేరు. అందుకని తక్కువ తక్కువ ఆహారాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు ఇస్తుండాలి. రెండు- మూడు గంటలకు ఓసారి పాలిచ్చే తల్లులు పిల్లలకు జలుబు ఉన్నప్పుడు ఎక్కువ సార్లు ఇస్తుండాలి.

వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల పిల్లలకు ఐదేళ్ళ వయసు తర్వాత నుంచి జలుబు దానంతట అదే తగ్గుతూ ఉంటుంది. కాబట్టి జలుబు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే... శుభ్రత, జాగ్రత్తలతో ఈ సమస్య పిల్లల్ని మరీ బాధించకుండా చూడవచ్చు.
ఆస్తమా
చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. జలుబు తగ్గకపోగా పిల్లలు గాలి తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు పిల్లికూతలుగా వినిపిస్తుంటాయి. ఎన్నో కారణాల వల్ల వచ్చే ఈ సమస్య నియంత్రణకు బ్రాంకోడయలేటర్ మందులు, నెబులైజేషన్లు అవసరం పడతాయి. 


ఇవి వాడకూడదు:యాంటీహిస్టమిన్స్ మందులు జలుబుకు ఉపయోగంగా ఉంటుందని అనుకుంటారు. కాని వీటివల్ల జలుబు తగ్గినట్టుగా వైద్యపరంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. అందుకని ఈ మందులను వాడకపోవడమే మంచిది. సాధారణ జలుబుకు నెబులైజేషన్లు వాడాల్సిన అవసరం లేదు. వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైనప్పుడు తప్పనిసరిగా యాంటీబయాటిక్స్ వైద్యుల సలహామేరకు మాత్రమే వాడాలి. ఇన్ఫెక్షన్ చెవికి పాకినా, సైనస్‌గా మారినా లంగ్స్‌కి చేరినా మందులు వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి?

పిల్లల్లో సాధారణంగా రెండు నెలలకోసారి జలుబు వస్తూనే ఉంటుంది. ఎదుగుదలలో ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఎక్కువ సార్లు జలుబు చేసినా భయపడాల్సిన అవసరం లేదు.

పిల్లలు ఊపిరి తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బంది పడుతున్నప్పుడు

జలుబుతో పాటు 101 డిగ్రీల కన్నా జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు

జలుబు ఉండి, ఆహారం తీసుకోవడానికి కష్టమైనప్పుడు

జలుబు రోజుల్లో పిల్లలు మత్తుగా ఉన్నట్టు అనిపిస్తే

జలుబుతో పాటు చెవిపోటు లాంటివేమైనా వచ్చినప్పుడు. ఎందుకంటే ముక్కు నుంచి చెవి, ఊపిరితిత్తులకు కనెక్షన్ ఉంటుంది. ముక్కు నుంచి సమస్య ఇతర శరీర భాగాలకు పాకినప్పుడు

జలుబు వారం రోజుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు
 

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి జలుబుతో పాటు ఇతర సమస్యలు ఉన్నా, బలహీనంగా ఉన్నా, హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్ ఉన్నా, న్యుమోనియా ఉన్నా వైద్యులను తప్పనిసరిగా సంప్రదించి, పిల్లల ఆరోగ్యం పట్ల తగు సూచనలు తీసుకొని జాగ్రత్తలు పాటించాలి.
మందులు
జలుబుకు ప్రత్యేకించి మందులు వాడాల్సిన అవసరం లేదు. ముక్కులు మూసుకుపోయినప్పుడు మాత్రం సెలైన్ డ్రాప్స్, జ్వరంగా ఉంటే పారాసిటమాల్ సిరప్ వైద్యుల సలహా మేరకు వాడాలి. జలుబు ఏడు రోజులకు కూడా తగ్గక ఇంకా కొనసాగుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. యాంటీబయాటిక్స్ వాడనవసరం లేదు. అయితే డాక్టర్ సలహా మేరకు ఇవ్వాల్సి ఉంటుంది. జలుబుకు ప్రత్యేకించి వ్యాక్సిన్లు ఏమీ లేవు. అయితే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి, ఇతర వ్యాధులు రాకుండా ఉండటానికి సమయానుకూలంగా వ్యాక్సిన్లు ఇప్పించడం నిర్లక్ష్యం చేయకూడదు.
దగ్గు

పిల్లలు దగ్గడం మొదలుపెట్టగానే చాలామంది పెద్దలు కాఫ్ సిరప్ ఒకటి కొనుక్కొచ్చి వేసేస్తుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే శరీరంలోని వైరస్, దుమ్ము, కఫం... వంటివి దగ్గు, తుమ్ముల ద్వారా బయటకు వస్తుంటాయి. ఇలాంటప్పుడు దగ్గును తగ్గించే మందులు వేస్తే కఫం లోపలే ఉండిపోతుంది. ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. అందుకని ఐదేళ్లు దాటని పిల్లలకు దగ్గు మందులు అస్సలు ఇవ్వకూడదు. ఐదేళ్లు దాటిన పిల్లలకు పొడి దగ్గు వంటివి బాగా విసిగిస్తున్నప్పుడు వైద్యుల సూచనల మేరకు మాత్రమే మందులు వాడాలి.

ఇంట్లో తీసుకునే కొన్ని చిట్కా వైద్యాల ద్వారా కూడా ఈ సమస్యను నయం చేయవచ్చు. దగ్గు, గొంతులో గర గర తగ్గడానికి గోరు వెచ్చని నీరు తాగిస్తూ ఉండాలి. పెద్దపిల్లలైతే వామునీరు, తులసి నీరు, కొద్దిగా మిరియాలు పాలలో కలిపితీసుకోవచ్చు.
జాగ్రత్తలు

జలుబు ఎక్కువగా ఉండి గాలి పీల్చుకోవడానికి కష్టపడుతుంటే, ఆహారం తీసుకోవడానికి, నిద్రపోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతుంటే సెలైన్ డ్రాప్స్ రెండు చుక్కలు ముక్కులో వేయాలి. అవి కూడా నాలుగు-ఐదు రోజులకు మించి వాడకూడదు. ఎందుకంటే పిల్లల ముక్కులో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. డ్రాప్స్ ఎక్కువగా వాడితే చర్మం దెబ్బతింటుంది. నొప్పి, మంట వంటివి సంభవించి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

గాలిలో తేమ తక్కువగా ఉన్నప్పుడు ఆవిరిపట్టాలి. వేడినీటిలో కొద్దిగా వేపరైజర్స్ వేసి ఆవిరిపట్టాలి. అయితే చంటి పిల్లలు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. పొగలు కక్కే వేడి నీటికి మరీ దగ్గరగా తీసుకెళ్లకూడదు.

చలిగా ఉన్నప్పుడు శుభ్రమైన వెచ్చని ఉలెన్ దుస్తులు వాడాలి.

చీమిడిని తొలగించడానికి ముక్కును గట్టిగా ఒత్తడం, రుద్దడం వంటివి చేయకూడదు. ముక్కు దగ్గరి చర్మం దెబ్బతినకుండా మెత్తని కాటన్ వస్త్రంతో లేదా దూదితో ముక్కు తుడవాలి.
అపోహ: 

జలుబుతో పిల్లల్లో ముక్కులు మూసుకుపోయినప్పుడు అవి తెరచుకోడానికి పెద్దలు నూనె లేదా నెయ్యి చుక్కలు వేస్తుంటారు. ఇది మంచిదేనా?
వాస్తవం: 

ఈ నూనె వల్ల ముక్కులోని సున్నితమైన చర్మం దెబ్బతినడమే గాక, ఒక్కోసారి అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్తే మరింత ప్రమాదానికి దారితీయవచ్చు. 
   



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top