నార్మల్ డెలివరీ అయ్యేందుకు కావలసినవి ముఖ్యంగా మూడు

గర్భిణీ అయినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు, అపోహలు స్ర్తీని చుట్టుముడతాయి. కుటుంబసభ్యులు, ఇంట్లో ఉండే పెద్దవారు చాలావరకు ఆ అనుమానాలు తీర్చగలిగినా అందరి దృష్టి తొమ్మిది నెలలు నిండాక అయ్యే కాన్పుపైన కేంద్రీకృతమై ఉంటుంది. డాక్టర్ని కలిసినప్పుడల్లా ‘డెలివరీ ఎలా అవుతుంది?’ అనే ప్రశ్న ఏదో ఒక సందర్భంలో తప్పక అడుగుతుంటారు. ఈ ప్రశ్నకు చాలాసార్లు డాక్టర్ దగ్గర కూడా జవాబు ఉండదు. పది శాతం మంది స్ర్తీలలో మాత్రమే తొమ్మిదో నెల నిండకముందే నార్మల్‌గా డెలివరీ అవడం కష్టమని, ఆపరేషన్ ద్వారా మాత్రమే బిడ్డను తీయగలుగుతామని డాక్టర్ స్పష్టంగా చెప్తారు. పెల్విస్ లేదా స్పైనల్‌కార్డ్‌లో లోపాలు, గర్భసంచికి పూర్వం జరిగిన ఆపరేషన్, ఇన్ఫెక్షన్ సోకడం, కుట్లు బలహీనంగా ఉండటం, బిడ్డ ఎదురు కాళ్లతో ఉండటం, మాయ కిందకు ఉండటం, వెజైనాలో ఇన్ఫెక్షన్లు ఉండటం... వంటివి ఆపరేషన్‌కి కొన్ని కారణాలు. మిగిలిన తొంభై మంది స్ర్తీలలో తొమ్మిది నెలలు నిండాక వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా డాక్టర్ బిడ్డ వచ్చే దారిని ఎసెస్ చేస్తారు. 

నార్మల్ డెలివరీ అయ్యేందుకు కావలసినవి ముఖ్యంగా మూడు. 

మొదటిది : సరైన పొజిషన్‌లో ఉండే బిడ్డ
కడుపులో బిడ్డ తల కిందకు, కాళ్లు పైకి, ముడుచుకున్న స్థితిలో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రెండవది : బిడ్డకు సరిపడా దారి  

 

బిడ్డ తల్లి నుండి బయటకు వచ్చే దారిని పెల్విస్ అంటారు. ఇది ఒక బోన్ కేజ్ వంటిది. అందువల్ల ఇది సైజ్‌లో పెరగడం అంటూ జరగదు. బిడ్డ నెమ్మదిగా కిందకు జరిగినప్పుడు బిడ్డ దారికి ఉండే అనువైన పరిస్థితిని బట్టి డెలివరీ నార్మల్‌గా అయ్యేది లేనిది నిర్ణయిస్తారు. బిడ్డ పరిమాణంలో పెద్దగా ఉన్నా లేదా పెల్విస్ చిన్నగా ఉన్నా నార్మల్ డెలివరీ అవడం కష్టం అవ్వచ్చు. సైజులో కొద్దిపాటి తేడాలే ఉన్నప్పుడు బిడ్డను ఫోర్‌సెప్స్, వాక్యూమ్ ద్వారా తీస్తారు. ఈ తేడా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు బిడ్డ పెల్విస్‌లో ఇరుక్కుపోవడం, నొప్పులు బాగా వస్తున్నా కిందకు జరగకపోవడం, దీని వల్ల బిడ్డకు ఊపిరి ఆడక ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి రావడం తరచుగా చూస్తుంటాం.
మూడవది : 

బిడ్డను కిందకు జరపడానికి తొమ్మిది నెలలు నిండే సమయంలో తల్లికి నొప్పులు మొదలవుతాయి. కొన్నిసార్లు ఇంజెక్షన్ లేదా మాత్రల ద్వారా కూడా నొప్పులు మొదలయ్యేలా డాక్టర్ సహాయపడతారు. నెమ్మదిగా మొదలైన నొప్పులు క్రమంగా తీవ్రమై బిడ్డను కిందకు జరపడానికి సహాయం చేస్తాయి. తొలికాన్పులో ఆరు నుంచి పది గంటలు, తర్వాతి కాన్పులలో రెండు నుంచి నాలుగు గంటల వరకు ఈ నొప్పులు రావడాన్ని గమనిస్తాం. ఏ కారణం చేతనయినా ఈ నొప్పులు సరిగ్గా రాకపోయినా, నొప్పులు బాగా ఉన్నా, బిడ్డ జరగకపోయినా, బిడ్డకు ఊపిరి ఆడని పరిస్థితి కలిగినా ఆపరేషన్ అవసరం పడవచ్చు. 

ఇక ఇవి గాక బిడ్డ బరువు ఎక్కువగా ఉండటం, తల్లికి హై బి.పి., బ్లడ్ షుగర్ వంటి సమస్యలు ఉన్నా ఆపరేషన్ అవసరం పడవచ్చు. కాన్పు సమయంలో నొప్పుల వల్ల బిడ్డ గుండెపై కలిగే ఒత్తిడి సి.టి.జి అనే పరీక్ష ద్వారా పర్యవేక్షిస్తారు. దీనిలోని మార్పులను బట్టి కూడా కొన్ని సార్లు ఆపరేషన్ అవసరం పడవచ్చు. పైన చెప్పిన కారణాలన్నింటి వల్ల డెలివరీ ఎలా అవుతుందనేది నొప్పులు రాకముందరే చెప్పడం చాలా కష్టం.
 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top