తెలుగు చిత్రాలకు జోరు జోరుగా రీమిక్స్‌లు!

తెలుగు చిత్రాలకు రీమిక్స్ పాటల తాకిడి ఎక్కువైంది. ఒక పాట పది కాలాలపాటు అందరి గుండెల్లోను నిలిచిపోయి పెదాలపై పలుకుతుందంటే దానికి కారణం సంగీత, సాహిత్య, ఆలాపనల్లో ఏదైనా కావచ్చు. అన్నీ కలిపి కావచ్చు. అలాంటి పాటలను వెదికిపట్టి ప్రస్తుత సినిమాల్లో పెట్టడం నేడు ఆనవాయితీగా మారిపోయింది. ఈ ప్రక్రియ కొత్తదేమీ కాకపోయినా ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
 
              ఒకప్పటి చిత్రాల్లో హిట్ సాంగ్స్‌ని, బిట్స్‌గా తీసుకుని దానికి హాస్య గొంతును కలిపి ఒక పాటగా తయారుచేసి ఓ హాస్య జంటపై యుగళ గీతంగా చిత్రీకరించేవారు. ఆ రోజుల్లో ఈ తరహాపాటలు, సుత్తివేలుపై ఎక్కువగా వచ్చాయి. ఈ హవాకి పుల్‌స్టాప్ పడ్డాక ప్రస్తుతం ఏదో ఒక హిట్ సాంగ్‌ని రీమిక్స్ పేరుతో పునఃసంగీతాన్ని అమర్చి అగ్ర హీరోలపై చిత్రీకరించడం జరుగుతుంది.
 
          అగ్రతరం హీరోలుగా వెలుగొందిన ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ పాటలను మొదట్లో రీమిక్స్‌లు చేసినా ప్రస్తుతం సూపర్‌స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పాటలు కూడా అధికంగా రీమిక్స్ కావడానికి రెడీ అవుతున్నాయి. బాగా ప్రజాదరణ పొందిన పాటను రీమిక్స్ చేసి ఏదో ఒక నటి నటునిపై చిత్రీకరించాలనుకోవడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్‌కి బ్రేక్ వేస్తూ పరిశ్రమలో వంశ వృక్షాలు తమ అగ్ర దేవుళ్ల పాటలనే రీమిక్స్ పాటలుగా తయరుచేసుకుని నటించడానికి సిద్ధపడడం ఇటీవల ఎక్కువగా కనిపిస్తుంది.
 
                నాగార్జున, అక్కినేని రీమిక్స్ పాటలతో, జూ.ఎన్టీఆర్ తాతగారి రీమిక్స్‌లతో, రామ్‌చరణ్ తండ్రి హిట్ రీమిక్స్‌తో నటించగా వీటన్నింటికీ భిన్నంగా పవన్‌కల్యాణ్ ఎన్టీఆర్ హిట్ (ఆడవారి మాటలకు...) హరినాధ్ హిట్ (ఈరేయి తీయనిది...)తో ప్రేక్షకులను మైమరిపించాడు. చాలా చిత్రాల్లో రీమిక్స్‌ల హల్‌చల్ అడ్డూ అదుపు లేకుండా నడుస్తోంది. అయినా రీమిక్స్‌ల క్రేజ్ అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. చాలా రీమిక్స్ పాటలకు సంగీత సాహిత్య విలువలు ఉండడంలేదు. అలాంటివి సినిమాకు హెల్ప్‌కావు సరికదా నష్టాన్ని తెచ్చిపెడతాయి.
రీమిక్స్ చేయాలంటే తీసుకున్నపాటలోని సాహిత్యాన్ని పూర్తిగా మార్చాలా? లేక సంగీతాన్ని మార్చాలా? అని ప్రశ్నించుకుంటే అది నిర్మాత దర్శకుల టేస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. హీరో ఇన్‌వాల్వ్‌మెంట్ కూడా తోడవుతుంది. జనంచేత పదే పదే శభాష్ అనిపించుకున్న పాట మళ్లీ జనంతో శభాష్ అనిపించుకోవాలంటే సంగీత సాహిత్యాలలో రీమిక్స్ తప్పదు.

          ఒక పాట సూపర్ హిట్ అయిన తర్వాత చాలా జనరేషన్‌లకు అది నచ్చుతుంది. అయితే అదేపాటను ప్రస్తుత ట్రెండ్ కోసం దాని అందం చెడిపోకుండా అందించడమే రీమిక్స్ ఉద్దేశ్యమని ప్రెస్‌మీట్‌లలో సంగీత దర్శకులు చెప్పడం కామన్. అయితే ఎన్ని పాటలు ఇలా తయారై ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయంటే వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. పాట అందం చెడగొట్టారని తిట్టుకునే వారి శాతంతోపాటు నేటి జనరేషన్ సింపుల్‌గా పాత పాట అంటూ తీసిపారేసే రీమిక్స్‌లు నేడు ఎక్కువగా వస్తున్నాయి.
 
            రీమిక్స్ కూడా ఎక్కువ కాలం నిలవాలంటే సాహిత్యం పాతదై ఉంటేనే మంచిదన్న సంగతి జాణవులే...నెరజాణవులే (ఆదిత్య 369), ఆడవారి మాటలకు...అర్ధాలే వేరులే (ఖుషీ), ఈరేయి...తీయనిది (జానీ), బంగారు కోడిపెట్ట...వచ్చెనండి (మగధీర) అచ్చంగా నిలబెట్టాయని చెప్పవచ్చు. ఈ పాటల్లో సాహిత్యం మారదు. సంగీతంలో మరింత మెలొడీ తోడై అందరి హృదయాలను కొల్లగొట్టింది. అందుకే చాలామంది ఈ పాటలను పాడుకోవడానికి ఇష్టపడుతున్నారు.
 
                      ఆరేసుకోబోయి పారేసుకుని బదులు 2002 వరకు అంటూ అల్లరిరాముడులో రీమిక్స్, ఓలమ్మి తిక్కరేగిందా...అంటూ యమదొంగలో రీమిక్స్... ము..ము...ముద్దంటే చేదా అంటూ కేడిలో రీమిక్స్, మాయదారి చిన్నోడు...అంటూ దేవదాస్‌లో రీమిక్స్, ఓ అప్పారావు...ఓ సుబ్బారావు అంటూ యమగోల మళ్లీ మొదలైందిలో రీమిక్స్, గలగల పారుతున్న గోదారిలా అంటూ పోకిరిలో రీమిక్స్, పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల అంటూ మల్లన్నలో రీమిక్స్ వంటివే కాకుండా ఇంకా ఎనె్నన్నో...వాటిని పరిశీలిస్తే సాహిత్యం సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రీమిక్స్‌లు చేయడం ఒకెత్తయితే వాటి చిత్రీకరణలో చిత్తశుద్ధికి తిలోదకాలిచ్చి అసభ్యతకు పెద్దపీట వేయడం నేడు ఎక్కువగా కనిపిస్తుంది. రీమిక్స్‌లో వేరేవారి సంగీత-సాహిత్యాలను మరొకరు వాడుకోవాల్సి వస్తుంది. కానీ భువనచంద్ర, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ బంగారుకోడిపెట్టనే తిరిగి వారే రీమిక్స్‌గా వాడుకోవడం, రీమిక్స్‌లో ఇప్పటివరకు దక్కిన రికార్డు. జాణవులే...నెరజాణవులే..మాయదారి చిన్నోడు వంటి రీమిక్స్‌లు హీరోయిన్ రీమిక్స్‌లు కావడం గమనార్హం!

                            రీమిక్స్‌లలో కేవలం పల్లవిని మాత్రం తీసుకుని అల్లరి సాహిత్యం, హోరెత్తిపోయే సంగీతంతో వచ్చే రీమిక్స్ పేలిపోతాయని నిరూపించబడుతూనే ఉంది. ఇప్పటివరకు ఓలమీ తిక్కరేగిందా (యమదొంగ), మాయదారి చిన్నోడు (దేవదాసు), బంగారు కోడిపెట్ట (మగధీర)తో హిట్ రీమిక్స్‌లు చేసిన ఘనత కీరవాణియే దక్కించుకున్నారు. మనసు చంపుకుని నిర్మాత, హీరో, దర్శకుల వత్తిడి మేరకు రీమిక్స్‌లు చేయడం వలన ఫలితం శూన్యంగా కనిపిస్తుంది. మనసుపెట్టి కొత్త పాటలాగే ఫీలై సంగీత సాహిత్యాలను సమపాళ్లలో అందిస్తే రీమిక్స్‌కు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది.
సంగీత సాహిత్యాల పరిధి నానాటికీ విస్తరిస్తున్న తరుణంలో హిట్ చిత్రాల్లోని హిట్ పాటలను రీమిక్స్‌ల పేరుతో ఖూనీ చేయడం ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లను (ఉంటే) బాధపెట్టడమే కాదు, సంగీత అభిమానులను క్షోభపెడుతుంది. వంశవృక్ష హీరోల కోసం రీమిక్స్‌లు చేయడంవలన వారు ఖచ్చితంగా ఆ పాటవరకు కొంత క్రేజ్‌ని కోల్పోతారనడంలో సందేహం లేదు. అంతేకాదు రీమిక్స్‌లను అంత ఆత్రుతగా ఎదురు చూసే ప్రేక్షకులు కూడా నేడు లేరు.
 
             తీసిన సినిమా కథలనే మళ్లీ అదేపేరుతో తెరకెక్కించడం, సూపర్‌హిట్ పాటను రీమిక్స్‌లు చేయడం, హిట్ సినిమాలకు పార్ట్-2లు తీయడం ఏదో ఒకటి అర విజయం సాధించినా నూటికి నూరుపాళ్లు ప్రేక్షకులను ఎక్కువగా రంజింప చేయలేవన్నది చిత్ర పరిశ్రమకు తెలియని సత్యమేమీ కాదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top