‘సరిగమప’ స్వరానే్వషణ?


ఏ క్షణాన్నయితే ‘పాడుతా తీయగా’ ఈటీవీలో ఆరంభించారో గానీ (అసలు పాడుతా తీయగా’..నే ప్రాచుర్యం పొందిన జీ ఛానల్ హిందీ ‘సరిగమప’ స్ఫూర్తితో తయారైనది) దాదాపు అన్ని ఛానల్స్‌లోనూ ఆ బాపతు స్వరానే్వషణ ఔత్సాహికుల్లో అవిరామంగా జరిగిపోతోంది. అయితే ‘సంగీతం’ ప్రధాన లక్ష్యమైన ఆహ్లాదతను వీడి స్వర ‘సంగ్రామం’ తదితర యుద్ధ వాతావరణాన్ని ఇవి పెంచి పెద్ద చేయడం చూస్తున్నాం. ఇది వైవిధ్యం కోసమో, ప్రోగ్రామ్‌లో మొనాటనీని తొలగించడానికి అనుసరిస్తున్న పోకడైనా ఈ తరహా నచ్చని ప్రజానీకమూ ఉన్నారు. ఇలా రకరకాల దారులు యధేచ్చగా చుట్టి వచ్చిన గళానే్వషణ కార్యక్రమం జీ తెలుగులో ‘సరిగమప-నువ్వా-నేనా’ పేరుతో అక్టోబర్ 27న ఆరంభమైంది.
ఏదీ కొత్త రూపు?
పేరుకీ, ప్రచారానికీ, కొత్త రూపు అని అర్ధం వచ్చేలా బిల్డప్ జరిగినా ఆ మాదిరి లక్షణాలేవీ ప్రారంభంలోనే గోచరించలేదు. ఒకరొకరుగా వచ్చి పాడడం, వారికి జోడీగా ఇంకో గాత్రాన్ని ఎంచుకోవడం, వారిరువురూ కలిసి పాడడం- అలా పాడిన వాళ్లలో ఎవరు విజేతో తేల్చడం అన్నదిప్పటి వరకు జరిగినదాన్నిబట్టి అర్ధమైన సంగతి. ఇది గతంలో వచ్చిన స్వర పోటీల్లో అవలంబించిన డ్యూయట్ రౌండ్ లాంటిదే గదా...
ఈ ప్రాతిపదిక సరైనదేనా?
ఇక అన్నిటికంటే ముఖ్యమైంది ఎన్నికవుతున్న జోడీల్లో పాల్గొంటున్న అభ్యర్థుల వయస్సులో చాలా తేడా ఉండడం. అయితే గంలో జీ తెలుగు చానలే నిర్వహించిన పాటలపోటీల్లో నెగ్గిన విజేతల బృందంతో ఇప్పుడొచ్చిన కొత్తవాళ్లు పోటీపడడం అన్న కానె్సప్టు పెట్టుకున్న తర్వాత ఇలాంటి వ్యత్యాసాలు అనివార్యం అని భావించాలా? కానీ అంతిమంగా ఈ తరహా ఎక్కువ వయసు వ్యత్యాసాల ద్వారా వెల్వడే గళాలమధ్య పోటీ న్యాయాత్మకంగా ఉండదు. ఎందుకంటే గొంతు అనేది ముఖ్యంగా స్వర విన్యాసంలో తీవ్రమైన అంతరాలు వయోపరంగా వస్తాయి.
ఇది గమనంలోకి తీసుకోవాలి. ఈ ప్రోగ్రామ్‌లో న్యాయ నిర్ణేతల్లో ఒకరుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు రాధాకృష్ణన్ కూడా వయసునుబట్టి, అనుభవాన్నిబట్టి ఎంచుకున్న పాటలో వివిధ స్వరగతులను అనుసరించి గాలిని నియంత్రించి పాడే తీరు వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరి ముందు ముందు భాగాల్లో జరిగే పోటీల్లో ఈ ప్రథాన అడ్డంకిని అధిగమించడానికి కార్యక్రమం ఏం చేస్తుందో చూద్దాం.


పాటల ఎంపికకు సూచనివ్వచ్చుగా...
ఇక పాటల ఎంపికలో ఎవరి స్వేచ్ఛ వారిదైనా, ఇది కార్యక్రమ నిర్వాహకులే పదే పదే చెప్పినట్టు లక్షలాది, కోట్లాది సంగీతాభిమానులు వీక్షించేది కనుక కాస్త సమంజసత ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు వినపడ్డ కొన్ని పాటల్లో ఆ లక్షణానికి దూరంగా ఉన్నవీ ఉన్నాయి. ఉదాహరణకు చిన్నారులిద్దరు పాడిన పాట ‘ఆకుచాటు పిందె తడిసే’, మరో గాయనీ గాయకుల జంట పాడినపాట ‘రాఖీ..రాఖీ..రాఖీ..నా కవ్వాసాకీ’ ఎవరి అభిరుచి వారిదైనా, అందరి అనిరుచులనీ అలరించే మరీ ముఖ్యంగా మనం పైన అనుకున్న సంస్కార, సమంజసతలకు ద ర్పణంగా నిలవాలి. ఇంకా విచారకరమేమిటంటే రెండవ పాటగా ఉదహరించిన పాట ‘రాఖీ’ని ఆలపించిన చిన్నారి వయసు ఎనిమిదేళ్లు. కొసమెరుపుగా ఆ పాటలో వచ్చే ఒక హమ్మింగ్‌కి తెగమురిసిపోయి న్యాయనిర్ణేతల్లో ఒకరు మళ్లీ మళ్లీ పాడించుకున్నారు. ఈ పాటల్ని కార్యక్రమ వ్యాఖ్యాత చమక్ చమక్..్ఢమరే పాటలుగా అభివర్ణించారు. సరే..మరీ అంతగా వాళ్లనుకునే హుషారుగీతాలు అనుకుంటే సభ్యతా పరిమితులకు లోబడిన అనేక పాటలున్నాయి. అవి ఆ ఔత్సాహిక గళాలకు తట్టకపోతే అనుభవజ్ఞులైన కార్యక్రమ నిర్వాహకులు సూచన చెయ్యొచ్చు.



హుందా వ్యాఖ్యానాలు కావాలి
ఇక ఈ కార్యక్రమానికి ఇద్దరు వ్యాఖ్యాతలున్నారు. మిగతా కార్యక్రమాల వ్యాఖ్యానాలకీ, ఈ మోడల్ పాటల ప్రోగాం యాంకరింగ్‌కీ తేడా వుంటుంది. ఆ భేదాన్ని ఇక్కడ పాటించినట్టులేదు. భాష దగ్గరనుంచీ, భావ ప్రకటన వరకూ హుందాతనం తప్పనిసరి. అది కొంతమేరకు ఇందులో లోపించినట్టే కనపడుతోంది. మిగతా యాంకరింగ్‌లో కనపడే అరుపులు, వగైరా ఇందులోనూ ఉన్నాయి. ‘అదుర్స్, సూపర్, సూపరూ, పాటేసుకో లాంటి పద ప్రయోగాలూ దొర్లుతున్నాయి. అంతకు మించి పురుష యాంకరు చేసే నంగి నంగి వ్యాఖ్యానాలతో కూడిన అభినయమూ దర్శనమిస్తోంది. ఇది తక్షణం పరిహరించాలి.
ఇంకా వారనుకునే ‘సంగ్రామం’ సమతుల్యత తెలియడానికి రాబోయే భాగాలు చాలా ఉన్నాయి కనుక వాటి విషయాల్లో పరిహరించదగ్గవి పరిహరిస్తే కార్యక్రమం అందరి మన్ననలు పొందుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top