టాయిలెట్ టెన్షన్... యూరినరీ ప్రాబ్లమ్స్

నూటికి తొంభై తొమ్మిది మంది మహిళలు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక దశలో మూత్రసంబంధిత సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. కొందరికి వెంట వెంటనే మూత్రాశయం నిండినట్టు అనిపించడం, బాత్రూమ్‌కు వెళ్లే లోగానే మూత్రం పడిపోవడం, తరచూ మూత్ర విసర్జన చేయాలనిపించడం, రాత్రిళ్లు కూడా మాటిమాటికి నిద్ర లేచి బాత్రూమ్‌కి వెళ్లాల్సిరావడం వంటివి జరుగుతుంటాయి. ఇంకొందరిలో దగ్గినా, తుమ్మినా, వంగి బరువులు ఎత్తినా మూత్రం లీక్ అవుతుంటుంది. మరికొందరికి మూత్రంలో రక్తం పోవడం, మంట, దురదతో కూడిన ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంటుంది. స్ర్తీలలో మూత్రాశయం, మూత్రనాళం, మూత్రద్వారం... వద్ద రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి.
ప్రధాన కారణం
స్ర్తీలలో మూత్రనాళం చిన్నగా ఉంటంది. యోనిమార్గం, మలమార్గం, మూత్ర మార్గం దగ్గర దగ్గరగా ఉండటం, శుభ్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సూక్ష్మజీవులు యోని, మల ద్వారం నుంచి మూత్ర నాళంలోకి ప్రవేశించి, అక్కడ నుంచి మూత్రాశయానికి చేరుతుంటాయి. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటాయి. 



మరెన్నో కారణాలు
కాన్పులు కష్టమైనా, కాన్పులు ఎక్కువ అయి మూత్రనాళ కండరాలు వదులు అయినా, మూత్రపిండాలు దెబ్బతిన్నా, మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడినా, వెన్నెముక దెబ్బతిన్నా, వెన్నెముకకు ఆపరేషన్ అయినా, నరాల వ్యవస్థ దెబ్బతిన్నా, పక్షవాతం వచ్చినా... ఇలా ఎన్నో కారణాల వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు బాధిస్తుంటాయి. ఈ సమస్యల వల్ల రోజువారీ పనులు సక్రమంగా చేసుకోలేరు. జీవనశైలిలో ఆనందాన్ని పొందలేరు. శారీరక వ్యాయామాలు చేయలేరు. ఫలితంగా ఊబకాయం సమస్య తలెత్తుంది.
పుట్టుకతోనే...
కొందరిలో పుట్టుకతోనే పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. అంతర్గత అవయవ లోపాలు ఏవి ఉన్నా మూత్రాశయం నుంచి మూత్రం ముందుకు పాస్ అవకుండా వెనక్కి వెళుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు మరిన్ని ఆరోగ్యసమస్యలకు కారణాలు అవుతుంటాయి కనుక వైద్యుల ద్వారా ఎక్కడ సమస్య ఉందో పరీక్షల ద్వారా తెలుసుకొని, సరైన చికిత్స ఇప్పించాలి.
యువతుల్లో...
ఆడపిల్లలు యుక్తవయసులో సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలాగే కొత్తగా పెళ్లయిన యువతుల్లో మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు లైంగిక కార్యకలాపాల వల్ల బాక్టీరియా వెజైనాలో చేరి, అక్కడ నుంచి మూత్రనాళంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనినే హనీమూన్ సిస్టైటిస్ అంటారు. ఇన్ఫెక్షన్ రాకుండా శుభ్రత పాటించడంతో పాటు, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.


మధ్యవయస్కుల్లో...
నలభై ఏళ్లు దాటిన స్ర్తీలలో మూత్రంపై నియంత్రణ లేకపోవడం ఎక్కువగా జరుగుతుంది. ఈ సమస్యను యూరిన్ ఇన్‌కాంటినెన్స్ అంటారు. పెల్విక్ కండరాలు వదులు అవడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఊబకాయుల్లో కూడా ఈ సమస్య ఉండే అవకాశాలు అధికం.
మెనోపాజ్ దశలో...
హర్మోన్ల లోపాల వల్ల ఈ దశలో మూత్రనాళం సన్నగా అయిపోతుంది. దీని వల్ల మూత్ర విసర్జన సాఫీగా అవదు. మూత్రం వస్తుందనే ఫీలింగ్ పదే పదే రావడం, బయటకు వెళ్లిన సమయాల్లో అదుపు లేకుండా దారిలోనే మూత్ర విసర్జన జరిగిపోవడం వంటివి వీరిలో ఎక్కువ. ఎండోస్కోపి ద్వారా సన్నబడిన ట్యూబ్‌ని సాధారణ స్థాయికి తీసుకు వచ్చి ఈ సమస్యను నివారించవచ్చు.

సిగ్గు, బిడియం.. వల్ల స్ర్తీలు మూత్రసంబంధిత సమస్యలను బయటకు చెప్పుకోరు. చికిత్సకు వైద్యులను సంప్రదించరు. ఫలితంగా సమస్య ఇంకా తీవ్రం అవుతుంది. అందుకని స్ర్తీలు జననేంద్రియ సమస్యల పట్ల అవగాహన పెంచుకొని, తగు జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే ఎన్నో ఆరోగ్యసమస్యలకు ముందే అడ్డుకట్ట వేయవచ్చు.
మూత్రంలో రక్తం

యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా అనిపించడం, రక్తం పోవడం చూసి క్యాన్సరేమోనని చాలామంది భయపడుతుంటారు. మూత్రంలో రక్తం పోవడానికి... మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు, రాళ్లు, కణతులు, మూత్రావయవాలలో ట్యూబరోక్యులోసిస్(టి.బి), పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, గ్లామెర్యులోనెప్రైటిస్, సైక్లికల్ హిమట్యూరియా వంటి రకరకాల కారణాలు ఉన్నాయి...
మూత్రావయవాలలో రాళ్లు: 

కిడ్నీలో కాని, మూత్రనాళంలో కానీ, మూత్రాశయంలో కానీ రాళ్లు ఉండటం వలన ఒక్కోసారి మూత్రంలో రక్తం పడుతుంటుంది. సాధారణంగా ఈ సందర్భంలో నడుములో నొప్పి కూడా విపరీతంగా బాధించవచ్చు.
యూరినరీ ఇన్ఫెక్షన్: 

మూత్రావయవాలలో ముఖ్యంగా మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ వలన ఒక్కోసారి మూత్రంలో రక్తం పోతుంటుంది. దీంతో పాటు మూత్రంలో మంట, తరచుగా బాత్రూమ్‌కి వెళ్లాల్సి రావడం, జ్వరం రావడం గమనించవచ్చు.
కణతులు: 

మూత్రావయవాలలో, మూత్రపిండాలలో, మూత్రాశయంలో వచ్చే కణతులలో 90 శాతం పైగా క్యాన్సర్ కణతులే అయి ఉంటాయి. మూత్రంలో రక్తం పోవడంతో పాటుగా, ఆకలి మందగించడం, సన్నబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ట్యూబర్క్యులోసిస్: 
మూత్రావయవాలలో (టి.బి)ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రంలో రక్తం పడటం, త్వర త్వరగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, జ్వరం వంటి లక్షణాలు కనబడతాయి.
* పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది వంశపారంపర్యంగా వచ్చే ఒక విధమైన వ్యాధి. దీని వల్ల కూడా మూత్రంలో రక్తం పోతుంది.
* గ్లామెర్యులోనెఫ్రైటిస్ ఉన్నవారికి మూత్రంలో రక్తం పడటమే కాకుండా, ఒళ్లంతా వాపులు రావడం, మూత్రం తక్కువగా తయారవడం వంటి లక్షణాలు కనపడి, మెల్లిగా మూత్రపిండాలు చెడిపోయే ప్రమాదం ఉంది.
* సైక్లికల్ హిమట్యూరియా: నెలసరి సమయంలో మూత్రంలో రక్తం పడుతుంది. సిజేరియన్ సమయంలో మూత్రాశయానికి రంధ్రం పడటం వలన అలా అవుతుంది.
వ్యాధి నిర్ధారణకు...

మూత్రం విసర్జన సమయంలో రక్తం పోవడం ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ...
మూత్రపరీక్ష, యూరినరీ సైటాలజీ ఫర్ క్యాన్సర్‌సెల్స్, యూరిన్ కల్చర్, యూరిన్ ఫర్ టి.బి బాక్టీరియా, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్‌రే- ఐ.వి.పి, సి.టి స్కాన్ లేదా ఎం. ఆర్.ఐ స్కాన్, సిస్టోస్కోపి.. వీటిలో కొన్ని, ఒక్కోసారి అన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
జాగ్రత్తలు...
1. రోజూ రెండున్నర లీటర్ల శుభ్రమైన నీరు తాగాలి. 2. మల, మూత్ర విసర్జన తర్వాత శుభ్రత పాటించాలి. పొడిగా ఉన్న కాటన్ లో దుస్తులను వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 3. ఇన్ఫెక్షన్లు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని నిర్లక్ష్యం చేయకుండా తగు చికిత్స తీసుకోవాలి. 4. యూరిన్ ఇన్‌కాంటినెన్స్ నివారణకు పెల్విక్ కండరాలు స్ట్రాంగ్ అవడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి. వీటిని యూరాలజిస్ట్ లేదా గైనకాలజిస్ట్ చేత తెలుసుకొని వాటిని పాటించాలి.
 

గర్భవతులలో...
గర్భవతిలో నాలుగు నెలలు దాటాక గర్భసంచి పరిమాణం పెద్దదై, మూత్రవాహిక పైన ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మూత్రం మాటి మాటికి లీక్ అవడం, లేదా ఆగిపోవడం వంటివి సంభవించి మూత్రపిండానికి వాపు వస్తుంది. కొందరిలో మూత్రపిండాలలో, మూత్రవాహికలో రాళ్ళు ఏర్పడటం వలన కూడా ఈ సమస్య రావచ్చు. నడుములో నొప్పి చలిజ్వరం వాంతులు దీని లక్షణాలు. వాపుతో పాటు మూత్రపిండాలలో చీము చేరినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇద్దరికీ ప్రమాదం: 

కిడ్నీలో వాపు, చీము ఉన్నప్పుడు ఒక్కోసారి అబార్షన్ జరుగుతుంది. నెలలు నిండకముందే ప్రసవం జరగడం వల్ల శిశువు ఆరోగ్యానికి ముప్పు ఏర్పడవచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రమైనప్పుడు సెప్సిస్ షాక్ వచ్చి తల్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కాబట్టి మూత్రసంబంధిత సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.
చికిత్స: 

గర్భసంచి ఒత్తిడి వలన మూత్రపిండానికి వాపు వచ్చినప్పుడు తల్లికి నొప్పి, జ్వరం ఏమీ లేనట్లయితే ప్రత్యేకమైన చికిత్స అవసరం లేదు. అదే ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే యాంటీబయోటిక్స్, నొప్పి నివారణకు మందులు అవసరమైనట్లయితే శిశువుకి హాని కల్గించని మెడిసిన్స్ వాడవలసి ఉంటుంది. మందుల ద్వారా ఇన్ఫెక్షన్, నొప్పి, జ్వరం తగ్గకపోయినట్లయితే ఒక్కోసారి కిడ్నీలో డిజె స్టెంట్ వేయాల్సిన అవసరం రావచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉంటే చాలా వరకు మందుల ద్వారానే ఉపశమనం కలిగించడానికి ప్రయత్నిస్తారు. నొప్పి తీవ్రంగా వచ్చినప్పుడు లేదా కిడ్నీలో వాపు, చీము ఎక్కువైనప్పుడు లేదా రెండు కిడ్నీలలో రాళ్లు తయారై తల్లి ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు ఎండోస్కోపి ద్వారా రాళ్లను తీయవచ్చు. దీని వల్ల తల్లికి, శిశువుకి కూడా ఎటువంటి హాని కలగదు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top