ఇఎన్‌టి సమస్యలకు ఇవిగో తైలాలు


క్షార తైలాన్ని చెవిలో చుక్కలుగా వేయడం గానీ, తైలంలో దూదిని తడిపి చెవిలో 'వర్తి' (ప్లగ్గింగ్)గా గానీ ప్రయోగిస్తారు. చెవినుంచి చీము రావడం, చెవిపోటు, చెవిలో శబ్ధాలు, వినికిడి లోపం, క్రిమి వంటి సమస్యలకు ఈ తైలాన్ని వాడవచ్చు.

వాతావరణ సమస్యల కారణంగా గానీ, ఆహార పానీయాల కారణంగా గానీ, లేదా గాయాల వల్ల గానీ కొన్నిసార్లు చెవి, ముక్కు, నోరు, దంత సంబంధ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. చాలా సార్లు ఈ సమస్యలు తల, మెడ నొప్పికి కూడా కారణమవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేక తైలాలు ఉన్నాయి. వీటిలో క్షారతైలం, షడ్బిందు తైలం, ఇరిమేదాది తైలం ముఖ్యమైనవి.

క్షార తైలం
క్షార ద్రవ్యాలను ప్రధానంగా చేర్చి తయారు చేయడం వల్ల ఈ తైలానికి ఆ పేరు వచ్చింది. ఇది చెవి సంబంధ వ్యాధులకు ప్రత్యేకం. ఈ తైలం తయారీలో ముల్లంగి క్షారం, యవక్షారం, సర్జక్షారాలతో పాటు సౌవర్ఛ లవణం, బిడా లవణం, సైంధవ లవణం, సాముద్ర లవణాలను కూడా చేరుస్తారు. వీటితో పాటు ఇంగువ, మునగ తొక్కలు, శొంఠి, దేవదారు, వచ, కోష్టు, సోంపు, తుంగముస్తలు, పిప్పలీ మూలం మూలికలను కూడా కలుపుతారు.

ఆ తరువాత తగిన నిష్పత్తిలో ఆవనూనె, అరటి కంద స్వ రసం, నిమ్మ రసం, మధుశుక్తం, ఇవన్నీ ఒక పాత్రలో వేసి ఆయుర్వేద ఫార్మసిస్టులు 'తైలపాక విధి'లో ఈ తైలాన్ని తయారు చేస్తారు. ఈ తైలాన్ని చెవిలో చుక్కలుగా వేయడం గానీ, తైలంలో దూదిని తడిపి చెవిలో 'వర్తి' (ప్లగ్గింగ్)గా గానీ ప్రయోగిస్తారు. చెవినుంచి చీము రావడం, చెవిపోటు, చెవిలో శబ్ధాలు, వినికిడి లోపం, క్రిమి వంటి సమస్యలకు ఈ తైలాన్ని వాడవచ్చు.
 

 ఈ తైలంతో పాటు ఆయుర్వేద వైద్యుల సలహాతో కడుపులోకి కొన్ని మందులు కూడా తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఈ చికిత్సలు తీసుకోవడం వల్ల చెవి ఆపరేషన్ తప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
షడ్బిందు తైలం
ఆరు చుక్కల మోతాదులో వేయవలసి ఉన్నందున ఈ తైలానికి ఈ పేరు స్థిరపడింది. ముక్కు సంబంధ వ్యాధులకు ఈ తైలం ప్రత్యేకం. తైలం తయారీలో ఆముదపు వేర్లు, తగరం, సోంపు, జీవంతీ, సైందవ లవణం, దాల్చిన, వాయు విడంగాలు, యష్టిమధు, శొంఠి చూర్ణాలను సిద్ధం చేసుకుంటారు.

ఆ తరువాత తగిన నిష్పత్తిలో నువ్వుల నూనె, మేకపాలు, గుంటగలగరస్వరసం కలిపి ఆయుర్వేద ఫార్మసిస్టులు ఈ తైలాన్ని తయారు చేస్తారు. తైలాన్ని ముక్కులో చుక్కలుగా వేయడం గానీ, దూదిని తడిపి ప్లగ్గింగ్ గానీ చేయవలసి ఉంటుంది. ఈ చికిత్సా సమయంలో శ్వాస క్రియ సాగడానికి నోరు తెరిచి ఉంచడం తప్పనిసరి.

దీర్ఘకాలికంగా ఉండే జలుబు (సైనసైటిస్) తరుచూ వచ్చే జలుబు ( ఎలర్జిక్ రైనైటిస్) ముక్కు దిబ్బడ, ముక్కులో ఆర్శస్సు (పాలిప్స్), ముక్కులో మాంసం పెరగడం, ముక్కునుండి చెడువాసన రావడం, క్రిమి వంటి సమస్యలను షడ్బిందు తైలం సమర్థవంతంగా నయం చేస్తుంది. ఈ సమస్యల కారణంగా వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది. ఈ తైలాన్ని వాడుతూనే ఆయుర్వేద వైద్యుల సలహాతో కడుపులోకి కొన్ని మందులు కూడా తీసుకుంటే ఫలితాలు మరింత త్వరగా వస్తాయి.



ఇరిమేదాది తైలం
' ఇ (అ)రిమేద' అనే ఒక తుమ్మ జాతి చెట్టు తొక్కను ప్రధానంగా చేర్చి తయారు చేయడం వల్ల దీనికి ఈ పేరు స్థిరపడింది. పంటి సమస్యలకు, పంటి చిగుళ్ల సమస్యలకు ఈ తైలం ప్రత్యేకం. తైలం తయారీలో ఇరిమేద తొక్క, లవంగం, అగరు, గైరికం, పద్మకాష్ఠం, మంజిష్టా, లొద్దుగ, యష్టిమధు, లక్క, మర్రిమాను తొక్క, తుంగ ముస్తలు, దాల్చిన, జాజికాయ, క ర్పూరం, కాచుపట్ట, ధాతకీ పూలు, నాగకేసరాలు, కాయఫలం వీటి చూర్ణాలన్నీ ఒక పాత్రలోకి చేర్చి తైలపాక విధిలో ఆయుర్వేద ఫార్మసిస్టులు ఈ తైలాన్ని తయారుచేస్తారు.

చిగుళ్ల వాపు, చీము రావడం, దంతాల్లో పిప్పి రావడం, రంధ్రాలు పడటం, నల్లపడటం, దంతాలు జువ్వుమని లాగడం, చిగుళ్ల మీద గడ్డలు ఏర్పడటం, క్రిమిదంతం, నోటి దుర్వాసన, దంతాలు ఊగడం, నాలుక నుంచి జిగురు పడటం, నాలుక పగలటం, అంగిట్లో దురద లేదా నొప్పి, నోటి పుండ్లు ఈ సమస్యలన్నిటినీ ఈ తైలం నివారిస్తుంది. ఈ తైలాన్ని దూదిలో ముంచి దంతాల మీద, చిగుళ్ల మీద రుద్దడం ద్వారా గానీ, నోట్లో తైలాన్ని పుక్కిట పట్టడం గానీ, ఈ తైలంతో పుక్కిలించడం (పుల్లింగ్) ద్వారా గానీ ఫలితాలను పొందవచ్చు.

  
ఈ తరహా చెవి, ముక్కు,నోరు, గొంతు, దంత సమస్యలు ఉన్నవారు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుణ్ని సంప్రదించి ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top