ఆకర్షణీయమైన ముఖారవిందానికి....


కొంతమందిని చూసిన వెంటనే వారి రూపం మన కళ్లను కట్టిపడేస్తుంది. వారి రూపానికి అట్టే ఆకర్షితులమవుతాం. వారిలోని సౌందర్య మహిమే అందుకు కారణం. ఆ రహస్యమేదో తెలుసుకుంటే మన అందం కూడా పదింతలు మెరుగవుతుంది.  అందానికి ప్రథమ శత్రువు ముడతలు సాధ్యమైనంత వరకూ ఇవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • కోడిగుడ్డు తెల్లసొనలో మూడు టీ స్పూన్ల ఓట్ పిండి, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకుంటే ముడతలు కనిపించకుండా ఉంటాయి.
  •  సాధారణ చర్మతత్వం ఉన్నవారు కోడిగుడ్డులోని పచ్చసొనలో రెండు స్పూన్ల రోజ్‌వాటర్, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఒక సీసాలో భద్రపరచుకుని వారంలో ఒకసారి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం సున్నితంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.


  •   పొడి చర్మం ఉన్నవారు కోడిగుడ్డులోని పచ్చసొనలో రెండు స్పూన్ల నారింజ రసం కొన్ని చుక్కల బాదం నూనె, అరచెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, అరగంట తర్వాత కడుక్కుంటే ముడతలను దూరంగా ఉంచవచ్చు.

చలికాలంలో ముఖ సౌందర్యం

  • మూడు టీ స్పూన్ల గోధుమపిండిలో పాలుపోసి గట్టి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డును ప్రభావవంతంగా తొలగిస్తుంది. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.  
  • ఆవాలను పిండి కొట్టుకుని దానిలో నీరు లేదా నూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రివేళ ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకుంటే ముఖంపై ఉన్న దుమ్ము, జిడ్డు, మురికి తొలగిపోతుంది. చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
  • వెనిగర్, నీళ్లు రెండూ కలుపుకుని దానిలో దూదిని ముంచి ముఖానికి రాసుకుంటే చర్మంపై పేరుకున్న హానికారకాలన్నీ తొలగిపోతాయి. అయితే ఇది పొడిచర్మం ఉన్నవారికి సరిపడదు.
  •  అరటిపండు పావు భాగం, ఒక చుక్క నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే సరిపోతుంది. 
  • ముందుగా ముఖంపై తేనెను రాసుకోవాలి. కొంత సమయం తర్వాత బొప్పాయి లేదా యాపిల్ గుజ్జును ముఖంపై రాసుకోవాలి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత కడుక్కుంటే ముఖం తేజోవంతంగా ఉంటుంది.
  •   బేరీపండు, ద్రాక్ష, యాపిల్, నారింజ.. వీటి గుజ్జుకు తేనెను కూడా జోడించి ముఖంపై ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత వేడినీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.
  • బొప్పాయిపండు గుజ్జును ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.
  • కలబంద ఆకులో ఉండే చిక్కటి గుజ్జును సేకరించి దీనికి ఒక టీ స్పూన్ గ్లిజరిన్ కలుపుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత కడుక్కోవాలి. కొంత మందికి తాజా కలబంద గుజ్జు పడదు. దురద వస్తుంది. అటువంటప్పుడు వాడడం ఆపివేయాలి.
  •  విత్తనాలు తీసివేసిన ద్రాక్ష పండ్ల గుజ్జును ముఖానికి, మెడకు ప్యాక్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
  •  మూడు స్ట్రాబెర్రీ పండ్ల గుజ్జులో కొద్దిగా రోజ్‌వాటర్ కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
  • క్యారట్లను జ్యూస్‌లా చేసుకుని, అందులో తేనె కలపాలి. ఈ జ్యూస్‌ను ముఖం, మెడపై రాసుకుని 20 నిమిషాల పాటు ఉంచుకుని తరువాత కడిగేసుకోవాలి. దీనివల్ల ముఖం నునుపుగా, చర్మం మెత్తని పట్టులా మారిపోతుంది.
  • టమాటా జ్యూస్ ఒక టీస్పూన్, పెరుగు ఒక టీ స్పూన్, రోజ్‌వాటర్ అర టీ స్పూన్.. ఈ మూడింటిని బాగా కలిపి ముఖం, మెడపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముందుగా గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుని, ఆ తర్వాత చల్లటి నీటితో మరోసారి కడుక్కోవాలి. వీటిలో మీ చర్మతత్వానికి అనువుగా ఉన్నదాన్ని ఎంచుకుని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా తేడా అనిపిస్తే దాని వాడకాన్ని వెంటనే నిలిపివేయాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top